
అఖిల పక్ష సమావేశం పెట్టండి: కాంగ్రెస్
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన భయానక పేలుళ్లపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అన్ని పార్టీల సమావేశం వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. అలాగే డిసెంబర్ 1న ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాన్ని ముందుగానే ఏర్పాటు చేయాలని కోరింది. తద్వారా దేశ భద్రతపై సమగ్ర చర్చ జరగాలని స్పష్టం చేసింది.
భారత రాజధానిని కుదిపేసిన పేలుడు
గత సోమవారం ఢిల్లీలోని రెడ్‌ఫోర్ట్ సమీపంలో ఉన్న ఒక కారులో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. దీనికి కొన్ని గంటల ముందు పోలీసులు ‘వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్’ ను చేధించారు. అందులో 8 మందిని అరెస్ట్ చేశారు. వారిలో ముగ్గురి వైద్యులను అరెస్ట్ చేశారు. ఈ వైద్యులు అల్–ఫలాహ్ యూనివర్సిటీకి చెందినవారని అధికారులు వెల్లడించారు.
హోం మంత్రి బాధ్యత తీసుకుంటారా?"
కాంగ్రెస్ మీడియా విభాగం నాయకులు పవన్ ఖేరా గురువారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇంత పెద్ద ఉగ్రదాడి జరిగినా, హోం మంత్రి అమిత్ షా ఏ విధమైన బాధ్యత తీసుకోలేదు. ముంబయి దాడి సమయంలో అప్పటి హోం మంత్రి శివరాజ్ పాటిల్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు. అయితే ఇప్పటి ప్రభుత్వం మాత్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది అని విమర్శించారు.
2,900 కిలోల పేలుడు పదార్థం ఎలా చేరింది?
ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ పర్యవేక్షణలో ఉన్నప్పటికీ, 2,900 కిలోల పేలుడు పదార్థం ఫరీదాబాద్ వరకు ఎలా చేరింది? దేశ రాజధానిలో ఇంత ఎందుకు జరిగింది? అలాగే దాడి జరిగిన 48 గంటల తర్వాత మాత్రమే ప్రభుత్వం ఇది ఉగ్రదాడి అని ప్రకటించడం ఆశ్చర్యకరం అన్నారు.
పార్లమెంట్‌ను సమావేశపరచండి: కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ దేశ భద్రతను రాజకీయాలకు అతీతంగా చూస్తుందని, కానీ బాధ్యత ఎవరిది అనే ప్రశ్న మాత్రం తప్పదని ఖేరా అన్నారు. ప్రధాని ఆధ్వర్యంలో అన్ని పార్టీల సమావేశం వెంటనే నిర్వహించాలి. పార్లమెంట్ శీతాకాల సమావేశాన్ని ముందుగానే ఏర్పాటు చేయాలి.ఈ దాడి దేశానికి సవాలుగా నిలుస్తోంది. దీని పై చర్చ అత్యవసరం అన్నారు. పహల్గాం దాడి తర్వాత ప్రభుత్వం ‘న్యూ నార్మల్ డాక్ట్రిన్’ పేరుతో ఏదైనా ఉగ్రదాడి జరిగితే ‘యుద్ధ చర్య’ అని ప్రకటించింది. ఇప్పుడు ఆ సిద్ధాంతం ఇంకా అమలులో ఉందా? ఈ దాడి వెనుక బయటి శక్తుల మద్దతు స్పష్టంగా కనిపిస్తోంది. అయినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు ? అని ప్రశ్నించారు. ప్రజలు సమాధానం కోరుతున్నారు.
ప్రజలు తెలుసుకోవాల్సిన హక్కు ఉంది. ఎందుకు ప్రభుత్వం ఇంత ఆలస్యంగా స్పందించింది? ఎందుకు మరోసారి ఇంటెలిజెన్స్ విఫలమైంది? అని ఖేరా ప్రశ్నల వర్షం గుప్పించారు.
దేశం ఉగ్రవాదంపై ఒకేతాటిపై ఉండాలి. కానీ ప్రభుత్వం కూడా స్పష్టత, బాధ్యత, జవాబుదారీతనం చూపాలని అన్నారు.
ప్రభుత్వ ప్రతిస్పందన
బుధవారం కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనను ఉగ్రదాడిగా అధికారికంగా ప్రకటించింది. భూటాన్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో దర్యాప్తు సంస్థలు అత్యవసరంగా, వృత్తిపరంగా ఈ కేసు విచారణ జరిపి నేరస్తులను, వారి మద్దతుదారులను పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
