Let's talk: editor@tmv.in
అఖిలేశ్‌ యాదవ్‌ ఫేస్‌బుక్‌ ఖాతా పునరుద్ధరణ

అఖిలేశ్‌ యాదవ్‌ ఫేస్‌బుక్‌ ఖాతా పునరుద్ధరణ

Pinjari Chand
12 అక్టోబర్, 2025

యూపీలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) అధినేత, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ ఫేస్‌బుక్‌ ఖాతా ఒకరోజు పాటు నిలిపివేశారు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగింది. ఆయనకు ఫేస్‌బుక్‌లో 8.5 మిలియన్లకు పైగా ఫాలోయర్లు ఉన్నారు. శనివారం మళ్లీ పునరుద్ధరించారు. టీ కప్పులో తుఫాన్ మాదిరి రేగిన వివాదం సద్దుమణిగింది. ఖాతా పునరుద్ధరించిన అనంతరం, భారతరత్న, సమాజవాదీ పార్టీ సిద్ధాంతాలకు మూలమైన జయప్రకాశ్‌ నారాయణ జయంతి సందర్భంగా అఖిలేశ్‌ యాదవ్‌ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు చేశారు.

అందులో ఆయన జయప్రకాశ్‌ నారాయణ మాటలను ఉటంకిస్తూ ఇలా రాశారు. ‘సంపూర్ణ విప్లవం అంటే సమాజంలో అత్యంత పీడిత(అణగారిన) వ్యక్తి అధికార శిఖరాగ్రాన నిలవడం’ అఖిలేశ్ ఈ సందేశాన్ని సంపూర్ణ క్రాంతి దినోత్సవం(జూన్ 5) గా పిలుపునిస్తూ ఈ పోస్టు చేశారు.

సమాజ్‌వాదీ పార్టీ విమర్శలు

శుక్రవారం సాయంత్రం అఖిలేశ్‌ యాదవ్‌ ఫేస్‌బుక్‌ ఖాతాను సస్పెండ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ నేతలు బీజేపీని తీవ్రంగా విమర్శించారు, ప్రతిపక్ష స్వరాన్ని అణచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. దేశంలోని మూడో అతిపెద్ద పార్టీ అయిన ఎస్‌పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ఫేస్‌బుక్‌ ఖాతా సస్పెన్షన్‌ ప్రజాస్వామ్యంపై దాడి అని, బీజేపీ ప్రభుత్వం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ విధించిందని ఎస్‌పీ నేత ఫఖ్రుల్‌ హసన్‌ చాంద్‌ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో ఆరోపించారు. అదే విధంగా, ఎస్‌పీ జాతీయ కార్యదర్శి రాజీవ్‌ రాయ్‌ ఈ చర్యను భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై దెబ్బ గా అభివర్ణించారు.

ప్రభుత్వానికి సంబంధం లేదు: అశ్విని వైష్ణవ్‌

ఇదే విషయంపై సమాచార, ప్రసార శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్పందిస్తూ అఖిలేశ్ ఫేస్ బుక్ అకౌంట్ నిలిపివేతకు, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఫేస్‌బుక్‌ స్వతంత్రంగా చర్యలు తీసుకుంది. ఖాతాలో ఒక దుర్భాషలతో కూడిన పోస్టు ఉండటంతో వారి విధానాల ప్రకారం తాత్కాలికంగా సస్పెండ్‌ చేశారు. ప్రభుత్వం ఇందులో ఎటువంటి జోక్యం చేసుకోలేదని అని ఆయన వివరించారు. ఇదిలా ఉంటే ఫేస్‌బుక్‌ యాజమాన్య సంస్థ మెటా ఈ సంఘటనపై ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) అధినేత, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ కు ఎక్స్ లోనూ సుమారు 20.7 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. నిత్యం పార్టీకి సంబంధించిన వివరాలు, ఆయన ఆలోచనలు సోషల్ మీడియాలో పంచుకుంటారు.