
అక్షయపాత్రకు సీఎం ప్రశంసలు: 25 ఏళ్ల సేవల్లో 5 బిలియన్ భోజనాల మైలురాయి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయిడు ప్రముఖ సేవా సంస్థ అక్షయ పాత్ర ఫౌండేషన్ 25 సంవత్సరాల సేవలను పూర్తి చేసుకోవడం, అలాగే 5 బిలియన్ భోజనాలను అందించిన ఘనత సాధించడం సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సమాజ సేవలో అక్షయపాత్ర చేసిన కృషి ఆదర్శప్రాయమని ఆయన పేర్కొన్నారు.
సమాజంలో అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం ద్వారా సమాజం మరింత మంచి దిశగా ముందుకు సాగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పేద వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు పోషకాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం, విద్యాభివృద్ధికి అక్షయపాత్ర సంస్థ విశేషంగా దోహదపడుతోందని ఆయన తెలిపారు.
రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము సమక్షంలో రాష్ట్రపతి భవన్‌లో ఈ 5 బిలియన్ భోజనాల మైలురాయిని చేరుకోవడం గొప్ప విషయం అని సీఎం పేర్కొన్నారు. ఈ విజయాన్ని దేశం మొత్తం గర్వంగా భావించాల్సిన సందర్భమని ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా తెలిపారు.
అక్షయపాత్ర ఫౌండేషన్ కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి పోషణ శక్తి నిర్మాణ్ (పీఎం పోషణ్) పథకంలో భాగస్వామిగా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు ప్రతిరోజూ ఉచిత భోజనం అందిస్తోంది.
అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న అన్నా క్యాంటీన్స్ కార్యక్రమంలో కూడా అక్షయపాత్ర భాగస్వామిగా సేవలు అందిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా తక్కువ ధరలకు పేద ప్రజలకు పోషకాహారం అందించబడుతోంది.
ఈ విధమైన సేవా కార్యక్రమాలు పిల్లల పోషకాహార స్థాయిని మెరుగుపరచడమే కాకుండా, పాఠశాల హాజరు శాతం పెరగడానికి, విద్యపై ఆసక్తి పెంపొందించడానికి దోహదపడుతున్నాయని సీఎం పేర్కొన్నారు. సమాజంలో సమానత్వాన్ని పెంపొందించడంలో కూడా ఇలాంటి సంస్థల పాత్ర కీలకమని ఆయన అన్నారు.
అక్షయపాత్ర ఫౌండేషన్
అక్షయపాత్ర ఫౌండేషన్ ను 2000 సంవత్సరంలో స్థాపించారు. ఈ సంస్థను ఇస్కాన్ సభ్యులు ప్రారంభించారు. ఈ సంస్థ బెంగళూరును కేంద్రంగా చేసుకుని పనిచేస్తున్న ప్రముఖ లాభాపేక్షలేని సేవా సంస్థగా, దేశవ్యాప్తంగా ఆకలి నిర్మూలనతో పాటు విద్యాభివృద్ధికి విశేషంగా దోహదపడుతోంది. “ఆకలి కారణంగా ఏ పిల్లవాడూ చదువుకు దూరం కాకూడదు” అనే ప్రధాన లక్ష్యంతో ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వ (పీఎం పోషణ్) మధ్యాహ్న భోజన పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తోంది. ప్రస్తుతం 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలో 24,000కు పైగా పాఠశాలల్లో చదువుతున్న 2.1 మిలియన్లకు పైగా పిల్లలకు ప్రతిరోజూ వేడి, నాణ్యమైన భోజనాన్ని సరఫరా చేస్తోంది.
65కిపైగా అత్యాధునిక సాంకేతికతతో కూడిన భారీ వంటశాలల ద్వారా పరిశుభ్రతతో ఆహారం తయారు చేసి పంపిణీ చేయడం ఈ సంస్థ ప్రత్యేకత. ఇప్పటివరకు 500 కోట్లకు పైగా భోజనాలను అందించి లక్షలాది మంది విద్యార్థుల ఆరోగ్యం, విద్యలో మెరుగుదలకు సహకరించింది. అంతేకాకుండా, కోవిడ్-19 మహమ్మారి, వరదలు, తుఫానులు వంటి విపత్తుల సమయంలో అవసరమైన వారికి ఆహారం, కిరాణా కిట్లను పంపిణీ చేసి మానవతా సేవలను కొనసాగించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని అన్న క్యాంటీన్లకు కూడా భోజన సరఫరా చేస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తోంది. ఈ విధంగా సమాజంలో ఆకలి సమస్యను తగ్గించడంలో, విద్యను ప్రోత్సహించడంలో అక్షయపాత్ర ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తూ పలు అవార్డులు, ప్రశంసలు అందుకుంది.
కాగా, రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక కేంద్రంలో మంగళవారం జరిగిన అక్షయపాత్ర ఫౌండేషన్ ‘500 కోట్ల భోజనాలు’ అభినందన సమావేశంలో ముర్ము మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా వడ్డించిన భోజనంతో 500 కోట్లు పూర్తయినట్లు ‘అక్షయపాత్ర ఫౌండేషను’ తెలిపింది. ఈ కార్యక్రమంలో తన చేతులతో పిల్లలకు భోజనం వడ్డించి ఆప్యాయత చూపిన రాష్ట్రపతి, గత పాతికేళ్లుగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తూ అక్షయపాత్ర సాధించిన విజయాన్ని అపూర్వమని ప్రశంసించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భావి భారత పౌరులైన పిల్లలకు పోషకాహారం, నాణ్యమైన విద్య తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, రేపటి తరానికి సురక్షితమైన భవిష్యత్తును అందించడం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా సమాజం అంతా కలసి నిర్వహించాల్సిన ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు.
