Let's talk: editor@tmv.in
అక్రమ వలసదారుల పేరుతో బీజేపీ ప్రజల్ని మోసం చేస్తోంది: సచిన్ పైలట్

అక్రమ వలసదారుల పేరుతో బీజేపీ ప్రజల్ని మోసం చేస్తోంది: సచిన్ పైలట్

Pinjari Chand
28 నవంబర్, 2025

కాంగ్రెస్ సీనియర్ నేత, ఛత్తీస్‌గఢ్ ఇన్‌చార్జ్ సచిన్ పైలట్ బీజేపీపై మండిపడ్డారు. అక్రమ వలసదారుల పేరుతో బీజేపీ ప్రజల్ని మోసం చేస్తోందని, 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి ఏ ఒక్క కార్యాచరణ తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్తర్ జిల్లా హెడ్‌క్వార్టర్ జగదల్‌పూర్‌లో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన... బీజేపీ మాటలూ, చేతలూ వేర్వేరుగా ఉంటాయని ధ్వజమెత్తారు. ‘అక్రమంగా దేశంలో ఉంటున్న వారిపై చట్టప్రకారం చర్య తీసుకోవాలి. కాంగ్రెస్ దాన్ని పూర్తిగా సమర్థిస్తుంది. కానీ 11 ఏళ్లుగా బీజేపీ సర్కారు ఏం చేసింది? ఎంతమంది అక్రమ వలసదారుల్ని గుర్తించారు? ఎంతమందిని దేశం నుంచి బహిష్కరించారు? ఆ లెక్క చెప్పగలరా? అస్సాంలో బీజేపీదే ప్రభుత్వం. అక్కడ ఏం చేశారో డేటా ప్రజెంట్ చేయాలి’ అంటూ పైలట్ సూటిగా ప్రశ్నించారు.

‘ఎన్నికలు వస్తే చాలు ‘వలసదారులు, గుస్సేవాళ్లు’ అంటూ భయం పుట్టించి, కాంగ్రెస్ వాళ్లతో కలిసి ఉందంటూ అబద్ధాలు చెప్పడమే బీజేపీ గిమ్మిక్. ఇదంతా ఓట్ల కోసం ప్రజల్ని మోసం చేసే డ్రామా’ అని ఆయన మండిపడ్డారు.

ఛత్తీస్‌గఢ్‌లో జరిగే నేరాలకు ఎవరిది బాధ్యత?

రేపటి నుంచి ఛత్తీస్‌గఢ్‌లో జరగనున్న డీజీపీల సమావేశంపైనా పైలట్ సెటైర్లు వేశారు. ‘దేశవ్యాప్తంగా చట్టవ్యవస్థపై చర్చ జరుగుతుంది కానీ మన రాష్ట్రంలోనే మహిళలపై అత్యాచారాలు, దోపిడీ, దౌర్జన్యాలు జరుగుతున్నా ఎవరూ బాధ్యత వహించడం లేదు. ఇక్కడ ప్రభుత్వం ప్రొజెక్షన్, పర్సెప్షన్ మాత్రమే క్రియేట్ చేస్తోంది. గ్రౌండ్‌లో ఏం లేదు’ అని విమర్శించారు.

ఓటర్ల తొలగింపుపై ఈసీ ఎందుకు మౌనం వహిస్తోంది?

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపైనా పైలట్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘బీహార్‌లో లక్షలాది పేర్లు ఎలా తొలగించారు? రాహుల్ గాంధీ ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టి చూపించారు. కానీ ఎన్నికల సంఘం దానిపై దర్యాప్తు కూడా ఆదేశించలేదు. దళిత, ఆదివాసీ, పేద, వెనుకబడిన వర్గాల నిజమైన ఓటర్లను లక్ష్యంగా చేసుకుని పేర్లు తొలగిస్తారేమో అనే అనుమానం ఉంది. ఒక్క నిజమైన ఓటరుని కూడా జాబితా నుంచి తీసేయకూడదు. దీనికోసం కాంగ్రెస్ నుంచి ఒత్తిడి కొనసాగుతుందని హెచ్చరించారు.

మావోయిస్టు అగ్ర కమాండర్ హిడ్మా ఎన్‌కౌంటర్‌పై

హిడ్మా ఎన్ కౌంటర్ పై కాంగ్రెస్ వైఖరి గురించి అడిగిన ప్రశ్నకు పైలట్ సమాధానమిస్తూ, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కాంగ్రెస్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని అన్నారు. దేశ ఐక్యత, సార్వభౌమత్వం కోసం కాంగ్రెస్ ఎల్లప్పుడూ పోరాడింది. ఇండిపెండెన్స్ కి ముందు నుంచి ఇప్పటి వరకు ఉగ్రవాదం, మావోయిజం, విచ్ఛిన్నతవాదంతో ఎదురొడ్డి పోరాడి ఓడించింది. మావోయిస్టుల దాడిలో ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఒక్క తరాన్నే కోల్పోయింది. ఇలాంటి శక్తులకు మద్దతు ఇస్తున్నామని ఎవరైనా మమ్మల్ని ఎలా నిందించగలరు? మాకు ముందు దేశ భద్రత , తర్వాతే పార్టీ భావజాలం అని పైలట్ స్పష్టం చేశారు. ఎన్డీయే నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలు, మీడియా, పౌరులను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు.

అక్రమ వలసదారుల పేరుతో బీజేపీ ప్రజల్ని మోసం చేస్తోంది: సచిన్ పైలట్ - Tholi Paluku