
అక్రమ వలసదారులపై చర్యలు తీసుకోవాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి డిమాండ్
నగరంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలు, బంగ్లాదేశ్ ముస్లిం చొరబాటుదారులను వెంటనే అరెస్ట్ చేసి, దేశం నుంచి బహిష్కరించాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి డిమాండ్ చేసింది. జనవరి 24న నిర్వహించిన "ధర్మ రక్షణ సభ" విజయవంతమైందని, వేలాది మంది ప్రజలు ఈ సభకు హాజరై చొరబాటుదారులకు వ్యతిరేకంగా గళమెత్తారని శశిధర్ తెలిపారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సమితి ప్రధాన కార్యదర్శి రావినూతల శశిధర్ మాట్లాడారు.
ఈ సందర్భంగా సమితి ప్రధాన కార్యదర్శి రవినూతల శశిధర్ మాట్లాడుతూ, ధర్మ రక్ష సభకు భాగ్యనగర్ నలుమూలల నుంచి వేలాదిమంది హాజరయ్యారని తెలిపారు. అక్రమంగా దేశంలోకి చొరబడిన బంగ్లాదేశీ, రోహింగ్యా వలసదారులను వెంటనే అరెస్ట్ చేసి దేశం నుంచి పంపించాలని సభలో డిమాండ్లు వినిపించాయన్నారు. ఈ ఉద్యమం తొలి దశగా ప్రజల్లో అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టామని, తదుపరి దశలో మండల, జిల్లా స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
ప్రభుత్వమే హైకోర్టు ముందు అంగీకరించిన వివరాలను ప్రస్తావించిన శశిధర్, బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 6,993 మంది రోహింగ్యా ముస్లిం వలసదారులు ఉన్నారని పేర్కొన్నారు. వారిపై వెంటనే చర్యలు తీసుకొని దేశం నుంచి పంపించాల్సిన అవసరం ఉందన్నారు. అక్రమ వలసదారుల వల్ల సమాజానికి, భవిష్యత్తుకు ముప్పు ఏర్పడుతోందని, ఈ అంశంపై ప్రజలను చైతన్యవంతం చేయడమే లక్ష్యమని ఆయన తెలిపారు.
‘జాగో భాగ్యనగర్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభ రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కల్పించడంలో విజయవంతమైందని శశిధర్ పేర్కొన్నారు. బంగ్లాదేశీ, రోహింగ్యా వలసదారుల సమస్యలపై ప్రజల్లో చర్చ మొదలైందన్నారు. ఇకపై నగరం, పరిసర జిల్లాల్లోనూ అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
అన్ని కుల సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే సంస్థలు, కంపెనీలు ఉద్యోగులను నియమించే ముందు వారి పత్రాలను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. చౌక కార్మిక శక్తి పేరుతో అక్రమ వలసదారులను నియమించడం నగర భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టడమేనని హెచ్చరించారు. పౌరులు పోలీసులకు సహకరించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సమితి విజ్ఞప్తి చేసింది.
