Let's talk: editor@tmv.in
అక్రమ నిర్మాణాలపై ఓ విధానాన్ని రూపొందించండి.. రాష్ట్రాలకు సుప్రీం సూచన

అక్రమ నిర్మాణాలపై ఓ విధానాన్ని రూపొందించండి.. రాష్ట్రాలకు సుప్రీం సూచన

Pinjari Chand
13 ఆగస్టు, 2026

దేశవ్యాప్తంగా ఏళ్ల తరబడి కొనసాగుతున్న అనధికారిక నిర్మాణాలను క్రమబద్ధీకరించడం, కూల్చివేయడం విషయంలో ఏకరీతి విధానం రూపొందించాలన్న విజ్ఞప్తిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పరిశీలించాలని సుప్రీంకోర్టు బుధవారం సూచించింది. అయితే దేశమంతటా ఒకే విధానాన్ని అమలు చేయాలని కేంద్రం, రాష్ట్రాలను ఆదేశించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌) విచారించేందుకు కోర్టు నిరాకరించింది. ఈ అంశం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల విధాన పరిధిలోకి వస్తుందని పేర్కొంటూ సుప్రీంకోర్టు దాన్ని స్వీకరించలేదు. అన్ని రాష్ట్రాలు ఏకరీతి విధానాన్ని రూపొందించేలా ఆదేశాలు ఇవ్వాలని సెంటర్‌ ఫర్‌ లా అండ్‌ గుడ్‌ గవర్నెన్స్‌ పిల్‌ దాఖలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ వి. మోహనాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

రాష్ట్రాలను బట్టి పరిస్థితులు, క్షేత్రస్థాయి వాస్తవాలు మారుతుంటాయని ధర్మాసనం పేర్కొంది. అందువల్ల దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఒకే విధమైన విధానాన్ని రూపొందించడం సాధ్యంకాదని, అలా చేయడం సముచితం కూడా కాదని స్పష్టం చేసింది. అయితే పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలను కొత్త విధానాలు రూపొందించే సమయంలో లేదా ఇప్పటికే ఉన్న విధానాలను పునఃసమీక్షించేటప్పుడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పరిశీలించవచ్చని తెలిపింది. సంబంధిత అంశాలన్నింటినీ సమర్థులైన అధికారులు తగిన విధంగా పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.

ఏపీ, తెలంగాణలో క్రమబద్ధీకరణ పథకాలు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు ఢిల్లీలోనూ అనధికారిక నిర్మాణాలు, నివాస ప్రాంతాల క్రమబద్ధీకరణకు సంబంధించిన పథకాలను అమలు చేసిన విషయాన్ని పిటిషన్‌లో ప్రస్తావించారు. అయితే అనేక ప్రాంతాల్లో ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా లేదా తగిన నోటీసులు జారీ చేయకుండానే అనధికారిక కాలనీలు, నిర్మాణాలను అకస్మాత్తుగా కూల్చివేస్తున్నారని పిటిషనర్‌ ఆరోపించారు.ప్రభావిత కుటుంబాలకు పునరావాసం లేదా సంక్షేమ చర్యలు చేపట్టడం లేదని పేర్కొన్నారు. పట్టణ ప్రణాళిక, భూ వినియోగ చట్టాలను అమలు చేయడంతో పాటు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 కల్పించిన నివాసం, జీవనోపాధి, గౌరవంగా జీవించే హక్కులను సమతుల్యం చేసే విధానం లేకుండా కూల్చివేతలు చేపట్టరాదని పిటిషన్‌లో కోరారు.

ఒకవైపు హామీలు.. మరోవైపు కూల్చివేతలు

అనధికారిక నిర్మాణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు భిన్నమైన విధానాలను అనుసరిస్తున్నాయని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కొన్ని సందర్భాల్లో కూల్చివేతలను హడావుడిగా, అస్తవ్యస్తంగా, ఎలాంటి స్పష్టమైన విధానం లేకుండా చేపడుతున్నారని పేర్కొన్నారు. అనధికారిక నిర్మాణాలను క్రమబద్ధీకరిస్తామని అధికారులు ఒకవైపు హామీ ఇస్తూనే.. మరోవైపు వాటి నివాసితుల నుంచి మున్సిపల్‌, ఆస్తి పన్నులు వసూలు చేస్తున్నారని న్యాయవాది తెలిపారు. విద్యుత్‌ వంటి పౌర సౌకర్యాలను కూడా కల్పిస్తున్నారని చెప్పారు. 40-50 ఏళ్ల తర్వాత అవే నిర్మాణాలు అక్రమమైనవని చెబుతూ, ప్రత్యామ్నాయ నివాస సదుపాయం ఉందా? లేదా అనే విషయాన్ని పరిశీలించకుండా కూల్చివేస్తునారని వాదించారు. దశాబ్దాలుగా ఒక ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబాలకు సంబంధించిన అంశాలను మానవ హక్కుల కోణంలో పరిశీలించాలని పిటిషనర్‌ కోరారు.

అక్రమ కూల్చివేతలపై ఇప్పటికే రక్షణ చర్యలు

అక్రమ, అనధికారిక నిర్మాణాల కూల్చివేతల విషయంలో సుప్రీంకోర్టు ఇప్పటికే సమగ్ర రక్షణ చర్యలను నిర్దేశించిందని ప్రధాన న్యాయమూర్తి గుర్తుచేశారు. అయితే గతంలో ఇచ్చిన న్యాయపరమైన ఆదేశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. నివాస హక్కు, మానవ గౌరవంతో జీవించే హక్కులో భాగమేనని గతంలో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొన్న తీర్పును ఆయన ప్రస్తావించారు.

అదే సమయంలో జూలై 14న ఇచ్చిన మరో తీర్పులో.. ఒక కాలనీ చాలా కాలంగా కొనసాగుతున్నంత మాత్రాన దానికి చట్టబద్ధమైన హక్కు ఏర్పడదని, కాలం గడిచిపోవడం లేదా అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్ల అక్రమ నిర్మాణం చట్టబద్ధం కాదని కోర్టు పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. చట్టాన్ని అమలు చేసే రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపాలిటీల అధికారాలను కోర్టు నియమించే కమిటీ భర్తీ చేయలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఉన్నపళంగా, ఏకపక్షంగా కూల్చివేతలు చేయకుండా సుప్రీంకోర్టు ఇప్పటికే రక్షణ చర్యలను జారీ చేసిందని మరోసారి పేర్కొంది.

15 రోజుల ముందు నోటీసు ఇవ్వాలి

ఓల్గా టెల్లిస్‌ కేసులో కోర్టు సూచించిన మానవతా దృక్పథం ప్రకారం.. ఒక వ్యక్తి ఒక స్థలంలో స్థిరంగా నివసిస్తున్నట్లయితే, తగిన న్యాయ ప్రక్రియను అనుసరించకుండా అతడిని అక్కడి నుంచి తొలగించకూడదు. పూర్తిగా అనధికారికంగా ఆక్రమించిన వ్యక్తికి కూడా కూల్చివేతకు ముందు సాధారణంగా కనీసం 15 రోజుల నోటీసు ఇవ్వాలని ఈ కోర్టు ఆదేశించిందని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలను ఒక్కో కేసు పరిస్థితులకు అనుగుణంగా పరిశీలించాల్సి ఉంటుందని జస్టిస్‌ బాగ్చీ పేర్కొన్నారు. కోర్టు రూపొందించే ఒకే విధానంతో అన్ని సమస్యలను పరిష్కరించడం సాధ్యం కాకపోవచ్చన్నారు. పిటిషన్‌లో కోరిన అంశాలు చాలా విస్తృతంగా ఉన్నాయని, వాటిని అంగీకరిస్తే కోర్టు కార్యనిర్వాహక వ్యవస్థ విధాన నిర్ణయాల పరిధిలోకి వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. అలాగే అనధికారిక నిర్మాణాలన్నీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందినవే కావని ధర్మాసనం గుర్తుచేసింది. కొన్ని నిర్మాణాలు వాణిజ్య లేదా లాభాపేక్షతో కూడా చేపడుతున్నారని పేర్కొంది.

అక్రమ నిర్మాణాలపై ఓ విధానాన్ని రూపొందించండి.. రాష్ట్రాలకు సుప్రీం సూచన - Tholi Paluku