
అక్రమ కేసులతో వేధిస్తున్నారు: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
మైనర్ బాలిక మృతి చెందిన ఘటనలో చేసిన వ్యాఖ్యలపై కోవూరు పోలీసులు కాకాణి గోవర్ధన్ రెడ్డికి విచారణకు హజరు కావాలని గతంలో నోటీసులు ఇచ్చారు. అయితే ఈ విషయంలో పోలీసులు గందరగోళంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 14వ తేదీ ఉదయం 11 గంటలకు కోవూరు పోలీస్ స్టేషన్‌కు హాజరుకావాలని గతంలో నోటీసులు జారీ చేయగా, బయలుదేరే సమయంలోనే విచారణను ఫిబ్రవరి 19కు వాయిదా వేసినట్లు మరో నోటీసు ఇవ్వడం పోలీసుల తీరుపై అనుమానాలకు తావిస్తోందన్నారు. నెల్లూరు సాయిరాం నగర్‌లోని తన నివాసంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో కాకాణి మాట్లాడారు. తాను స్టేషన్‌కు వెళ్తున్నట్టు తెలిసి భారీ సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఇదే సమయంలో కోవూరు పోలీసులు మరోసారి నివాసానికి వచ్చి, ప్రస్తుతం విచారణ అవసరం లేదు. ఫిబ్రవరి 19న మేమే మీ నివాసానికి వచ్చి వివరాలు సేకరిస్తాం అంటూ నోటీసు అందజేశారు.
ఇంత అత్యుత్సాహం ఎందుకు?
ఈ నెల 10వ తేదీ రాత్రి 9.30 గంటల సమయంలో హడావుడిగా వచ్చి 14న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ రావాల్సిన అవసరం లేదంటున్నారు. ఇది ఏ విధానం? అని ప్రశ్నించారు. తనపై అక్రమ కేసు నమోదు చేసి విచారణ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. పోలీసుల వ్యవహారం చూస్తుంటే పిల్లల చేష్టల మాదిరిగా ఉంది అని ఘాటుగా వ్యాఖ్యానించారు. మైనర్ బాలిక మృతి ఘటనలో, కోవూరు ఎమ్మెల్యే, వక్ఫ్ బోర్డు చైర్మన్ సహా ఇతర నాయకులు చేసిన వ్యాఖ్యలే తాను కూడా చేశానని, అయితే తనకే ఎందుకు నోటీసులు జారీ చేశారో ప్రజలు గమనించాలని అన్నారు. తన కుమార్తె, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితకు కూడా వాట్సాప్ ద్వారా నోటీసులు పంపడాన్ని తీవ్రంగా ఖండించారు.
కూటమి ప్రభుత్వ కుట్ర
ఇది కూటమి ప్రభుత్వ కుట్ర అని కాకాణి ఆరోపించారు. ప్రశ్నించే స్వరాన్ని అణచివేయాలనే ఉద్దేశంతో తనపై, తన కుటుంబ సభ్యులపై అనేక అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. మీరు ఎన్ని అక్రమ కేసులు మోపినా కూటమి నాయకులు చేస్తున్న అవినీతి, అక్రమాలు, దాడులు, దౌర్జన్యాలపై నేను ప్రశ్నిస్తూనే ఉంటా అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు.
మైనర్ బాలిక మృతి ఘటనపై వ్యాఖ్యలు
ఇటీవల కోవూరు సమీపంలోని గుమ్మలదిబ్బలో మైనర్ బాలిక మృతి సమాజాన్ని కలిచివేసిందన్నారు. బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే ఉద్రిక్త వాతావరణం సృష్టించారని తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లోనే బాలికకు బలవంతంగా విషం తాగించారని నమోదు చేసి ఉందని పేర్కొన్నారు. అలాగే కోవూరు, నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందలేదని బాలిక తండ్రే చెప్పారని అన్నారు. గంజాయి మత్తులో అఘాయిత్యాలు జరుగుతున్నట్లు తాము వ్యాఖ్యానించామని, అదే రకమైన వ్యాఖ్యలు ఇతర నాయకులు చేసినా వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించారు.
గంజాయి, మహిళల భద్రతపై ప్రశ్నలు
రాష్ట్రంలో గంజాయి యథేచ్ఛగా లభిస్తుందని, మహిళలకు రక్షణ ఉందా? అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో గంజాయి నిర్మూలిస్తామని హామీ ఇచ్చిన ఎన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, 19 నెలలు గడిచినా అమలు చేయలేదని విమర్శించారు. పోక్సో చట్టంపై అవగాహన ఉందని, మృతి చెందిన బాలిక పేరు లేదా ఇతర వివరాలు ఎక్కడా ప్రస్తావించలేదని చెప్పారు. అక్రమ కేసులకు భయపడే పరిస్థితి లేదన్నారు.
