Let's talk: editor@tmv.in
అక్టోబర్ 2న ఖాదీ వస్త్రాలు ధరించండి

అక్టోబర్ 2న ఖాదీ వస్త్రాలు ధరించండి

Aravind Maryada Reddy
29 సెప్టెంబర్, 2025

గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న అందరూ ఖాదీ వస్త్రాలు ధరించాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ దిశగా ముందడుగా వేయాలని కోరారు. విదేశీ వస్తువుల వాడకాన్ని తగ్గించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం మన్‌కీ బాత్‌ 126వ ఎపిసోడ్‌లో దేశ ప్రజలకు ఈ మేరకు పిలుపునిచ్చారు. “వికసిత్ భారత్” కలను నెరవేర్చాలంటే ప్రతి ఒక్కరూ స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయాలని అన్నారు. ఇందుకోసం విదేశీ వస్తువులపై ఆధారపడకుండా, మన దేశంలో తయారైన ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేసి ధరించాలని మోదీ కోరారు. స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ స్వదేశీ వస్తువులపై అవగాహన కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. ఒక దశలో ఖాదీ వినియోగం తగ్గినా, గత 11 ఏళ్లలో మళ్లీ ఉత్పత్తి పెరిగిందని పేర్కొన్నారు.

ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అనిశ్చితంగా ఉన్న ఈ సమయంలో, మన ఆర్థిక ప్రయోజనాల కోసం జాగ్రత్తగా ఉండాలని ప్రధాని సూచించారు. ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువుల వాడకానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. రాజకీయ విభేదాలను పక్కనబెట్టి అన్ని పార్టీలు కూడా ఈ ఉద్యమానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. భారత నావికాదళంలోని ఇద్దరు మహిళా అధికారిణులు లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా, లెఫ్టినెంట్ కమాండర్ రూపల ధైర్యసాహసాలను ప్రధాని కొనియాడారు. సముద్ర గర్భంలో వారు చూపుతున్న పట్టుదల దేశానికి గర్వకారణమన్నారు. వారిద్దరితో మన్‌కీ బాత్‌లో భాగంగా ఫోన్‌లో మాట్లాడుతూ ప్రోత్సహించారు.

భగత్‌సింగ్ యువతకు స్ఫూర్తి

స్వాతంత్ర్య్ సమరయోధుడు భగత్‌సింగ్‌ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఉరి శిక్షకు ముందు ఆంగ్లేయులకు రాసిన లేఖలో తూటాలతో చంపమని భగత్‌సింగ్‌ చేసిన విజ్ఞప్తి ఆయన ధైర్యానికి నిదర్శనమని మోదీ గుర్తుచేశారు. ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. భారతరత్న, గానకోకిల లతా మంగేష్కర్‌ జయంతి సందర్భంగా కూడా ప్రధాని మోదీ స్మరించారు. ఆమె పాడిన దేశభక్తి గీతాలు కోట్లాది భారతీయుల హృదయాలను తాకాయని అన్నారు. భారతీయ సంగీతం, సంస్కృతిపై ఆసక్తి ఉన్న ఎవరైనా ఆమె గానాన్ని వింటే మంత్రముగ్ధులవుతారని కొనియాడారు.

అక్టోబర్ 2న ఖాదీ వస్త్రాలు ధరించండి - Tholi Paluku