Let's talk: editor@tmv.in
అక్కినేని కుటుంబాన్ని అవమానపరిచే ఉద్దేశ్యం లేదు: మంత్రి కొండ సురేఖ

అక్కినేని కుటుంబాన్ని అవమానపరిచే ఉద్దేశ్యం లేదు: మంత్రి కొండ సురేఖ

Gaddamidi Naveen
13 నవంబర్, 2025

సోషల్ మీడియాలో నెలకొన్న తీవ్ర చర్చ, ఊహాగానాల నేపథ్యంలో, తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ బహిరంగంగా వివరణ ఇచ్చారు. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టే లేదా పరువు తీసే ఉద్దేశం తనకు లేదని ఆమె స్పష్టం చేశారు.

మీడియాతో పంచుకున్న ప్రకటనలో సురేఖ తెలిపారు.నాకు నాగార్జునపై,ఆయన కుటుంబంపై ఎంతో గౌరవం ఉంది.భారతీయ సినీ రంగానికి వారు చేసిన సేవలు అమూల్యమైనవి. నా మాటల వల్ల ఎవరికైనా మనస్తాపం కలిగితే హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని అవమానపరిచే ఉద్దేశం నాకు లేదు అని చెప్పారు. ఇటీవల కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. కొన్ని ఫ్యాన్‌ గ్రూపులు వాటిని అక్కినేని కుటుంబంపై విమర్శలుగా పరిగణించి ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో ఆ వ్యాఖ్యలు వైరల్‌ కావడంతో వివాదం చెలరేగింది. అభిమానులు వివరణ ఇవ్వాలంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు.

ఈ పరిణామాల నేపథ్యంలో సురేఖ మరోసారి తన గౌరవభావాన్ని పునరుద్ఘాటించారు. అక్కినేని కుటుంబ వారసత్వం, వారి ప్రతిష్ఠ నాకు ఎంతో విలువైనవి. నేను వారిని ఎప్పుడూ గౌరవిస్తాను.ఏదైనా అపార్థం జరిగి ఉంటే నిజంగా చింతిస్తున్నాను అని పేర్కొన్నారు. అక్కినేని నాగార్జున ఈ వివాదంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. గత అక్టోబర్‌ 2024లో కూడా మాజీ మంత్రి కేటీఆర్‌, నటుడు నాగార్జునపై సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అనంతరం ఆమె అక్కినేని కుటుంబానికి క్షమాపణలు చెప్పారు.

2024 అక్టోబర్‌లో చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున, మంత్రి కొండ సురేఖపై క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. నాగార్జున తన కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని కోర్టులో వాదించారు. ఈ కేసు ప్రస్తుతం హైదరాబాద్ నాంపల్లి కోర్టులో విచారణలో ఉంది. సురేఖ ఇప్పటికే ప్రజా వివరణతో పాటు క్షమాపణ తెలిపినా, కోర్టు ప్రక్రియ కొనసాగుతోంది. నాగార్జున ఇప్పటికే సాక్ష్యంగా హాజరయ్యారు.

అక్కినేని కుటుంబాన్ని అవమానపరిచే ఉద్దేశ్యం లేదు: మంత్రి కొండ సురేఖ - Tholi Paluku