Let's talk: editor@tmv.in
అక్కా తమ్ముడి అనుబంధమే ‘జిగ్రా’

అక్కా తమ్ముడి అనుబంధమే ‘జిగ్రా’

FL - BHAVN
4 అక్టోబర్, 2025

మనకు అన్నాచెల్లెళ్ల, అక్కా తమ్ముళ్ల సెంటిమెంటుతో వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో డ్రామా ఎక్కువగా ఉంటుంది. సెంటిమెంటుతో హృదయం పిండేసే సన్నివేశాలు ఉంటాయి. కానీ ఇలాంటి సెంటిమెంట్ తో ఒక యాక్షన్ సినిమా నిర్మించడం కొత్త ప్రయోగంలా అనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో హీరో అక్కే. ఆ సినిమా పేరు జిగ్రా.

జిగ్రా నటి ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన ఇంటెన్స్ యాక్షన్-థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా, అక్కా-తమ్ముడి మధ్య ఉన్న బలమైన బంధాన్ని ముఖ్యంగా కంటికి రెప్పలా కాచుకునే అక్క ప్రేమలోని గాఢతను చూసే ప్రతిఒక్కరూ అనుభూతిస్తారు, తమ్ముడి కోసం ఒకరు ఎంతటి సాహసానికైనా తెగించే అక్క ప్రేమ ప్రధానంగా తీసుకుని తెరకెక్కించారు దర్శకుడు వాసన్ బాల. కమర్షియల్ హంగులు, భావోద్వేగాలు కలగలిపిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది కానీ సినిమా తీసిన తీరు, కథనం, స్టయిలిష్ చిత్రీకరణ చాలా బావుంటుంది.

కథా నేపథ్యం

ఈ సినిమా కథ మొత్తం సత్య (ఆలియా భట్), ఆమె తమ్ముడు అంకుర్ (వేదాంగ్ రైనా) చుట్టూ తిరుగుతుంది. ఒక సుసంపన్నమైన కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ, తమ తల్లిదండ్రుల మరణం తర్వాత సత్య తన తమ్ముడి తోటిదే లోకంగా జీవితం సాగిస్తూ ఉంటుంది. చిన్న పిల్లలుగా ఉన్న వారికి బంధువుల్లో ఒక సంపన్నులైన ఒక కుటుంబం అండగా ఉంటుంది. అంకుర్, ఆ బంధువుల కారణంగా, విదేశంలో మాదకద్రవ్యాల కేసులో ఇరుక్కుని, మరణశిక్ష పడుతుంది. అక్కడి కఠినమైన చట్టాలు, అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా సత్య ఒంటరిగా పోరాటం ప్రారంభిస్తుంది. తన తమ్ముడు అమాయకుడని నిరూపించడానికి, లేదా అతడిని ఆ భయంకరమైన జైలు నుంచి బయటకు తీసుకురావడానికి ఆమె 'జైల్ బ్రేక్' అనే అసాధ్యమైన మిషన్‌ ఒకటి రూపొందిస్తుంది. ఒక సాధారణ యువతి, కేవలం ప్రేమ, పట్టుదల, ధైర్యం ఆధారంగా ఒక అంతర్జాతీయ నేర సామ్రాజ్యం, కఠినమైన ప్రభుత్వ వ్యవస్థతో ఎలా పోరాడి గెలిచిందనేది 'జిగ్రా' కథాంశం.

ఆలీయా ఒక అద్భుతం

అత్యంత కీలక పాత్ర పోషించింది ఆలియా భట్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. సత్య పాత్ర ఆమె కెరీర్‌లో ప్రత్యేకమైందని చెప్పక తప్పదు. ఒక సాధారణమైన అమ్మాయిలోని తెగువ, వాత్సల్యంలోని గాఢత, తన తమ్ముడి కోసం కత్తి పట్టిన వీరనారిగా ఆమె పరిణామం చెందే విధానం అద్భుతం. ముఖ్యంగా, తన తమ్ముడిని కాపాడుకోవడానికి ఆమె పడే బాధ, కోపంగా పరిణమించే నిస్సహాయత, వీటితో పాటు విపరీతమైన తెగువ, సాహసం ఈ భావోద్వేగాలన్నింటినీ ఏకకాలంలో ఆలియా నటనలో చూడవచ్చు. యాక్షన్ సన్నివేశాల్లో ఆమె కనబరిచిన పట్టుదల, ఏ శిక్షణ లేని ఒక అతి సాధారణ అమ్మయి పడిన ఆరాటాన్ని, ఆగ్రహాన్నిఆలియా చూపిన తీరు అద్భుతం.

అంకుర్ పాత్రలో వేదాంగ్ రైనా కు తొలి చిత్రం 'ది ఆర్చీస్' తర్వాత ఒక బలమైన పాత్రలో నటించాడు. జైలులో అతను పడే వేదన, అక్కపై నమ్మకం, మరియు పోరాటానికి సిద్ధమయ్యే తత్వం ప్రేక్షకులను కదిలిస్తుంది. ఆలియా, వేదాంగ్ మధ్య ఉన్న అనుబంధం తాలూకు సిబ్లింగ్ కెమిస్ట్రీ సినిమాకు ప్రాణం పోసింది. వీరితో పాటు, సత్యకు సహాయపడే మాజీ మాఫియా బాస్‌గా మనోజ్ పాహ్వా, మరియు జైలు వార్డెన్‌గా వివేక్ గోంబర్ వంటి సహాయక నటులు తమ పాత్రలకు తగిన నటనతో స్క్రిప్ట్ కు తగిన న్యాయం చేశారు. .

దర్శకత్వ ప్రతిభ అమోఘం

వాసన్ బాల దర్శకత్వ శైలి చాలా ప్రత్యేకమైనది. ఆయన ఈ సినిమాను స్టైలిష్ మేకింగ్ యాక్షన్ కోణంలో చూపించారు. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. విదేశీ లొకేషన్లు, జైలు లోపలి చీకటి వాతావరణం, యాక్షన్ సన్నివేశాల లైటింగ్ – ఇవన్నీ కథలోని తీవ్రతను, ఉద్రిక్తతను పెంచడానికి ఉపయోగపడ్డాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఉండి, ముఖ్యంగా ఎమోషనల్ మరియు యాక్షన్ సీన్స్‌లో ఉత్కంఠతను మరింత పెంచింది. పాటలు కూడా కథనంలో ఇమిడిపోయి, వేగంగా సాగే కథకు ఏమాత్రం అడ్డంకిగా అనిపించలేదు.

'జిగ్రా' కొన్ని బలమైన అంశాలు కలిగి ఉన్నప్పటికీ, విమర్శకుల నుంచి కొన్ని ప్రతికూల అభిప్రాయాలు కూడా ఉన్నాయి. సినిమా కథాంశం జైలు బ్రేక్‌ చుట్టూ తిరుగుతున్నప్పటికీ, కథనం కొన్ని చోట్ల నిదానంగా సాగింది. ముఖ్యంగా మొదటి భాగంలో కథలో వేగం తగ్గింది అనే అభిప్రాయాలు ఉన్నాయి. సినిమా రన్‌టైమ్ (153 నిమిషాలు) కాస్త ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈ మందకొడితనం కొట్టొచ్చినట్టు కనిపించేందుకు కారణం. జైల్ బ్రేక్ అనేది అసాధ్యమైన మిషన్ అయినప్పటికీ, ఒక సాధారణ యువతి కేవలం కొన్ని వనరులతో అత్యంత పటిష్టమైన విదేశీ జైలును ఛేదించడం, కొంతమంది ప్రేక్షకులకు అతిగా అనిపించవచ్చు. కథను మరింత పటిష్టం చేయడానికి, స్క్రీన్‌ప్లేపై ఇంకా దృష్టి పెట్టాల్సింది అని చాలా మంది విమర్శకులు అభిప్రాయపడ్డారు.

'జిగ్రా' కేవలం యాక్షన్ చిత్రం మాత్రమే కాదు, ఇది ఒక భావోద్వేగ ప్రయాణం. ఆలియా భట్ యొక్క నిబద్ధతతో తీసిన సినిమా, వాసన్ బాల స్టైలిష్ టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన బలం. తన తమ్ముడి కోసం ప్రాణాలను పణంగా పెట్టే ఒక అక్క పడే ఆరాటం, పోరాటం ప్రతి ప్రేక్షకుడిని కదిలిస్తుంది. స్క్రీన్‌ప్లేలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, 'జిగ్రా' నిస్సందేహంగా ఒక 'గుండె ధైర్యాన్ని గురించి చెప్పే, ఆకట్టుకునే థ్రిల్లర్. బలమైన భావోద్వేగాల కోసం, కొత్త తరహా యాక్షన్-డ్రామా కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు.

జిగ్రా 2024లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా ఇది. ధర్మ ప్రొడక్షన్స్, ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, షాహిన్‌ భట్‌, సోమెన్‌ మిశ్రా, ఆలియా భట్ నిర్మించిన ఈ సినిమాకు వాసన్‌ బాలా దర్శకత్వం వహించాడు. చూడాలనుకునే వారు నెట్ ప్లిక్స్ లో చూడవచ్చు

అక్కా తమ్ముడి అనుబంధమే ‘జిగ్రా’ - Tholi Paluku