
అక్కడ.. అడుగడుగునా బెల్ట్ షాపులే!
విశాఖలో బెల్ట్ షాపుల జోరు కొనసాగుతోంది. ఒక్కో మద్యం షాపుకు పదికి పైగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. బడ్డీ కొట్లు బెల్ట్ షాపులు అయిపోయాయి.
ఇక్కడ మరో విషయం ఏంటంటే ప్రభుత్వం దుకాణాలలో దొరకని బ్రాండ్ లు కూడా బెల్టు షాపుల్లో దొరకడం విశేషం. ఇదివరకు నగర శివారు ప్రాంతాలలో మాత్రమే అత్యధికంగా బెల్టుషాపులు ఉండేవి. కానీ ఇప్పుడు నగరంలో కూడా కొన్ని షాపులు బెల్టు షాపులు గా మారాయి.
ఎక్సైజ్ అధి కారులకు అన్ని విషయాలు తెలిసినప్పటికీ చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. మామూళ్లు వస్తుండటంతో బెల్టు షాపులకు తమకు ఎటువంటి సంబంధం లేదన్నట్లు వ్యవహరి స్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో కూడా బెల్ట్ షాపుల హవా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం మారినా పరిస్థితి మాత్రం అలాగే ఉంది. టిడిపి ప్రభుత్వం బెల్టుషాపుల నియంత్రణకు గట్టి చర్యలు చేపడుతున్నట్లు చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి.
బెల్టుషాపుల నియంత్రణలో చేతులెత్తేసిన అధికారులు..
బెల్ట్ షాపుల నియంత్రణలో పూర్తిగా చేతులెత్తేసారు. లోకల్ పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు అసలు తమకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగా కేసులు నమోదు చేయడం మానేశారు. బెల్ట్ షాపుల ద్వారా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారిపై తాము ఎలాంటి చర్యలు తీసుకోలేమని చెబుతున్నారు. దీంతో నగరంలో పలుచోట్ల బెల్ట్ షాపుల్లో యథేచ్ఛగా మద్యం అమ్మకాల జోరు కొనసాగుతుంది.
బెల్ట్ షాప్లలో బ్రాండ్ మద్యం..
ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ బెల్ట్ షాపులో దొరకడంతో ఇక్కడ కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. షాపుల్లో ఉండాల్సిన మద్యాన్ని ముందుగానే ఇతర ప్రాంతాలకు తరలించి బెల్ట్ షాపులు ద్వారా దొంగచాటుగా విక్రయాలు జరుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సరుకును ముందుగా వివిధ ప్రాంతాలకు తరలించి, అక్కడి నుండి కావాల్సిన మేర మద్యంను తీసుకువచ్చి అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అటు అధికారులు కూడా వీరికి వంత పాడుతుండటంతో అక్రమంగా మద్యాన్ని విక్రయించే వారు రెచ్చిపోతున్నారు.
ప్రభుత్వ దుకాణాల నుండే బెల్ట్ మాఫియాకు అమ్మకాలు!
ప్రభుత్వ దుకాణాల నుండే బెల్ట్ మాఫియాకు అమ్మకాలు జరుగుతున్నాయి. బ్రాండ్ మద్యాన్ని ప్రభుత్వ దుకాణాలలో బ్లాక్ చేస్తూ దానిని బయట మాఫియాకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో భారీ స్థాయిలో ముడుపులు చేతులు మారుతున్నాయి. మద్యం అంతా మందుబాబులకే విక్రయిస్తున్నట్లు లెక్కలు చూపుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయి.
అధిక ధరలకు విక్రయిస్తూ!!..
ఎక్కడికక్కడ బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. అటు నగరంలోను, ఇటు గ్రామాల్లోను ఈ బెల్టుషాపులు మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నాయి. నిత్యం ఆటోలు, ఇతర వాహనాల ద్వారా మద్యాన్ని వైన్స్ షాపుల నుంచి తరలిస్తున్నారు. బెల్టు షాపుల ద్వారా ఒక్కో మద్యం బాటిల్పై అదనంగా వసూలు చేస్తూ దర్జాగా అక్రమ దందా కొనసాగిస్తున్నారు. అత్యధికంగా ఈస్ట్, ద్వారక, నార్త్, గాజువాక సబ్ డివిజన్లలో బెల్ట్ ఏరులై పరుతుంది.
ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న మద్యం..
కొందరు బెల్టు షాపుల నిర్వాహకులు ప్రభుత్వం దుకాణాల నుంచి మద్యాన్ని కొనుగోలు చేస్తూనే ఇతర రాష్ట్రాల నుంచి కూడా బ్రాండెడ్ మద్యాన్ని తీసుకువస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో బ్రాండెడ్ మధ్యం తక్కువ ధరలకు విక్రయిస్తూ ఉండటం వలన అక్కడ వాటిని కొనుగోలు చేసి ఇక్కడికి తరలించి అధిక ధరలకు విక్ర యిస్తున్నారు. ఇదివరకు ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి మధ్యం తరలిస్తూ పలువురు పట్టుబడటం జరిగింది. పోలీసులు వారిపై కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మార్గాల ద్వారా భారీ ఎత్తున మద్యం విశాఖకి తరలి వస్తూనే ఉందని ప్రజా సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నారు.
కొరవడిన నిఘా..
బెల్ట్ షాపులపై పోలీసు, ఎక్సైజ్ నిఘా.. కట్టడి లేకపోవడంతో బెల్ట్ షాపుల మాఫియా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంది. పాన్ షాప్లను, ఇళ్లను బెల్ట్ షాపులుగా మార్చి మద్యం విక్రయాలు చేస్తున్నారు. నిర్దేశిత సమయం కంటే అర్దరాత్రి దాటినా సరే షాపుల్లో మద్యం అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంత జరుగుతున్నా పట్టించుకొనే నాధుడే కరువయ్యాడు. మధురవాడ, ఆనందపురం, భీమిలీ ప్రాంతాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి.
నగరంలో బెల్ట్ ఒక విధంగా అమ్మకాలు చేస్తే నగర శివారు ప్రాంతాల్లో విచ్చలవిడిగా బారులు తరహాలో అర్ధరాత్రులు దర్జాగా ఎటువంటి భయం లేకుండా అమ్మకాలు చేస్తున్నారు. మధురవాడ, ఆనందపురం, భీమిలీ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా బెల్ట్ షాప్లు దర్శనం ఇస్తున్నాయి. దీనితో యువత వీరి చుట్టే ప్రదక్షిణలు చేస్తూ మత్తు లో రోడ్లపై తూగుతున్నారని స్థానికంగా చెబుతున్నారు. ఇప్పటికైనా బెల్ట్ దుకాణాలపై సిపి కఠినంగా వ్యవహరించాలని ప్రజలు, మహిళ సంఘాలు కోరుతున్నాయి.
