Let's talk: editor@tmv.in
అకాల వర్షం..అపార నష్టం

అకాల వర్షం..అపార నష్టం

FL - SIMHCLM
6 అక్టోబర్, 2025

గత రెండు రోజులుగా కురిసిన అపారమైన వర్షం రైతులకు ఎనలేని కష్టాన్ని తీసుకువచ్చింది. శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలో వందలాది ఎకరాల్లో పంట భూములు నీట మునిగిపోయాయి. వాగులు వంకలు చెరువులు, కాలువలు ప్రాజెక్టులు నియంత్రణకు సాధ్యం కానీ స్థాయిలో నీటిని విడుదల చేస్తూ పంట పొలాలను ముంచెత్తుతున్నాయి. పార్వతీపురం సీతానగరం బొబ్బిలి రామభద్రపురం బాడంగి తెర్లాం కురుపాం గుమ్మలక్ష్మీపురం తదితర మండలాల్లో వందలాది ఎకరాల్లో ఉద్యాన పంటలు మునిగిపోయాయి.

జామ అరటి బొప్పాయి వంటి తోటలు ఏకంగా నేలకూలిపోయాయి. పలు గ్రామాల్లో ఇల్లు కూలిపోగా.. గజపతినగరంలో ఐదు కేజీలు మరణించి రైతు ఏకంగా లక్షన్నర నష్టపోయారు. మేరకముడిదం మండలంలో మొదటి సంఖ్యలో విద్యుత్ స్తంభాలు కూలిపోయి విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. తోటపల్లి, మడ్డువలస. వట్టిగెడ్డ రిజర్వాయర్లు పరవళ్ళు తొక్కుతూ నీటిని కిందికి విడుదల చేస్తున్నాయి. ఇన్ ఫ్లో ఎక్కువ కావడంతో ప్రాజెక్టు ఉనికికి ముప్పు అనే భావించిన ఇరిగేషన్ అధికారులు గేట్లెత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ఎస్ కోట, జామి, కొత్తవలస విపాడ మండలాల్లో బొప్పాయి పంటలు ఘోరంగా దెబ్బతిన్నాయి.

ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కూరగాయ పంటలైన టమాటా వంగ చిక్కుడు అలసంద కాకర వంటి పంటలకు అపారమైన నష్టం వాటిల్లింది. విజయనగరం జిల్లా తీర మండలాలైన భోగాపురం పూసపాటిరేగ ప్రాంతంలో తీరప్రాంతాల్లో పంటచేలకు పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. నాగావళి, జంఝావతి, గీతని గోస్థని, సువర్ణముఖి నదులు గతంలో ఎన్నడూ లేని విధంగా మహాసముద్రాన్ని తలపించేలా ప్రవహిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంత గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. నీరు కలుషితం కావడంతో డయేరియా వంటి వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వైద్య శాఖ అధికారులను జిల్లా కలెక్టర్లు ఆదేశించారు. పార్వతీపురం, విజయనగరం కలెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అత్యవసర సేవ అందించేందుకు సిద్ధమయ్యారు.

పార్వతిపురం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, విజయనగరం జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది కాకుండా ఇప్పటికే నాట్లు వేసే కార్యక్రమం పూర్తయిన వరిచేలు కూడా పెద్ద ఎత్తున నీటిలో మునిగిపోయాయి.. త్వరగా ఈ వరద తగ్గితే తప్ప మళ్లీ వరి చేను నిలబడదని, ఈ వరద ఎక్కువ రోజులు ఉంటే వరి చేను మొదలు కుళ్ళిపోయి మొత్తం నష్టపోవాల్సి వస్తుందని రైతులు కలవర పడుతున్నారు. పత్తి మిర్చి వంటి చేలకు వర్షం నష్టం తెస్తుందని.. చేనులో నీరు నిలవ ఉండిపోతే మొక్కలు తెగులు బారిన పడతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

అకాల వర్షం..అపార నష్టం - Tholi Paluku