
అక్షర్ పటేల్‌కు గాయం
ఆసియా కప్ 2025లో భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. శుక్రవారం ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఫీల్డింగ్ చేస్తుండగా తలకు గాయమైంది. ఈ గాయం కారణంగా ఆయన మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగే కీలకమైన సూపర్-4 మ్యాచ్‌కు ఆయన అందుబాటులో ఉంటాడా? లేదా? అనే దానిపై ప్రస్తుతం సందేహాలు నెలకొన్నాయి.
ఒమన్ ఇన్నింగ్స్‌లో 15వ ఓవర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. శివమ్ దూబే బౌలింగ్‌లో ఒమన్ బ్యాట్స్‌మెన్ హమ్మద్ మీర్జా భారీ షాట్ ఆడగా, మిడ్-ఆఫ్ నుంచి పరుగెత్తుకు వచ్చిన అక్షర్ క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో అతడి చేతి నుంచి బంతి జారిపోవడంతో పాటు, అదుపుతప్పి కిందపడి తల నేలకు గట్టిగా తాకింది. వెంటనే నొప్పితో విలపిస్తున్న అక్షర్‌ను ఫిజియో పరీక్షించి మైదానం నుంచి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయన తిరిగి ఫీల్డింగ్ చేయడానికి రాలేదు.
టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ
ఆసియా కప్ 2025లో అక్షర్ పటేల్ భారత జట్టుకు ఒక కీలకమైన ఆటగాడు. ఒమన్ మ్యాచ్‌లో ఆయన 26 పరుగులు చేసి బ్యాటింగ్‌లో తన సత్తా చాటాడు. అలాగే బౌలింగ్‌లో కూడా రాణిస్తున్నాడు. మొత్తంగా ఈ టోర్నీలో ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఒకవేళ గాయం కారణంగా అక్షర్ లేకపోతే భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు.
మ్యాచ్ అనంతరం భారత ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ అక్షర్ గాయంపై స్పందిస్తూ, ‘ఆయన ప్రస్తుతం బాగానే ఉన్నాడు’ అని తెలిపారు. అయితే అతడి గాయం తీవ్రతపై పూర్తి స్పష్టత రాలేదు. పాకిస్తాన్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు ఆయన ఆడతారా? లేదా? అనేది తదుపరి వైద్య పరీక్షల అనంతరం తెలుస్తుంది. ఒకవేళ అక్షర్ అందుబాటులో లేకపోతే ఆయన స్థానంలో రియాన్ పరాగ్ లేదా వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
ఇక ఒమన్‌తో మ్యాచ్ విషయానికి వస్తే, భారత్ ఈ మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో విజయం సాధించి గ్రూప్-ఏలో అగ్రస్థానంలో నిలిచింది. సంజు శాంసన్ (56), అభిషేక్ శర్మ (38) బ్యాటింగ్‌లో రాణించగా, ఒమన్ తరపున ఆమిర్ కలీమ్ (64), హమ్మద్ మీర్జా (51) అర్ధశతకాలు సాధించి పోరాడారు. ఈ విజయం ద్వారా భారత్ సూపర్ 4కు అజేయంగా అడుగుపెట్టింది. సూపర్ 4లో భారత్ తొలి మ్యాచ్‌ను ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ దుబాయ్‌లో జరగనుంది.
