Let's talk: editor@tmv.in
అక్రమ వలసలపై కేంద్రం ఉక్కుపాదం

అక్రమ వలసలపై కేంద్రం ఉక్కుపాదం

T Venkata Ramana
17 సెప్టెంబర్, 2025

కేంద్ర ప్రభుత్వం భారీ చర్యలకు ఉపక్రమించింది. నార్కోటిక్స్ రవాణా, ఇతర నేరాల్లో పాల్గొన్న దాదాపు 16 వేల మంది విదేశీయులను దేశం నుంచి బహిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవల అమల్లోకి వచ్చిన వలసలు, విదేశీయుల చట్టం-2025 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సమర్పించిన నివేదిక ఆధారంగా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ చర్యలు తీసుకుంటోంది. విదేశీయులు మాదక ద్రవ్యాల రవాణా, స్మగ్లింగ్ వంటి నేరాల్లో పాలుపంచుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ప్రస్తుతం వీరు దేశంలోని పలు రాష్ట్రాల్లోని నిర్బంధ కేంద్రాల్లో ఉన్నారు. బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, మయన్మార్, మలేషియా, ఘానా, నైజీరియా వంటి దేశాలకు చెందినవారు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో మాదక ద్రవ్యాలపై జరిగిన అతిపెద్ద క్రాక్డౌన్గా దీనిని ప్రభుత్వ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఎన్సిబి జాబితాను హోం మంత్రిత్వ శాఖకు, సంబంధిత ఏజెన్సీలకు అందజేసినట్లు తెలుస్తోంది. కొత్త చట్టం నిబంధనల ప్రకారం ఈ బహిష్కరణ ప్రక్రియ జరగనుంది.

కొత్త చట్టంలో ఏముంది

సెప్టెంబర్ 2న అమల్లోకి వచ్చిన వలసలు, విదేశీయుల చట్టం-2025 (ది ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్, 2025) పాస్పోర్టు, వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఫోర్జరీ పత్రాలతో దేశంలోకి ప్రవేశించినా, నివసిస్తున్న విదేశీయులకు కనిష్టంగా రెండేళ్లు, గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అలాగే తప్పుడు పాస్పోర్టులు, ప్రయాణ పత్రాలు సరఫరా చేసేవారికి కూడా శిక్షలు విధించే నిబంధనలు ఉన్నాయి. ఈ చట్టం నాలుగు పాత చట్టాల స్థానంలో అమల్లోకి వచ్చింది. మార్చి 11న పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ బిల్లును బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించారు. ఏప్రిల్ 4న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. మార్చి 27న లోక్సభలో చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఈ చట్టం ద్వారా దేశ భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.

ఇమ్మిగ్రేషన్ బ్యూరోకు అధికారాలు

1971లో స్థాపించిన బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్కు ఈ చట్టం ద్వారా అధికారాలు లభించాయి. అక్రమ వలసదారులను గుర్తించడం, అదుపులోకి తీసుకోవడం, బహిష్కరించడం వంటి బాధ్యతలు ఇకపై ఈ బ్యూరోదే. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటుంది. ఇమ్మిగ్రేషన్ సంబంధిత డేటాను నిర్వహించడం, విదేశీయుల బయోమెట్రిక్ డేటా రికార్డు చేయడం పాలసీలపై కేంద్రానికి సలహాలు ఇవ్వడం వంటివి దీని పరిధిలోకి వస్తాయి.

అక్రమ వలసదారుల గుర్తింపు

ఈ చట్టం ప్రకారం వ్యాలిడ్ పాస్పోర్టు లేదా ప్రయాణ పత్రాలు లేకుండా దేశంలోకి ప్రవేశించినవారు, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఉండేవారిని అక్రమ వలసదారులుగా గుర్తిస్తారు. హోటళ్లు, హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, యూనివర్సిటీలు, ఇతర విద్యా సంస్థలు విదేశీయుల సమాచారాన్ని నివేదించాలి. దీని ద్వారా వీసా ఓవర్స్టేలను ట్రాక్ చేయవచ్చు. విదేశీయులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలపై కేంద్రం ఆంక్షలు విధించవచ్చు. ప్రాంతాలను మూసివేయడం, నిర్దిష్ట షరతులతో అనుమతించడం, నిరాకరించడం చేయవచ్చు. భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినప్పటికీ పేదరికంలో మగ్గుతున్న కోట్లాది మంది ఉన్నారు. సంక్షేమ పథకాలకు రూ.కోట్ల నిధులు కేటాయిస్తున్నా, అక్రమ వలసలు ప్రధాన అడ్డంకిగా మారాయి. సరిహద్దు దేశాల నుంచి అక్రమంగా ప్రవేశించినవారు చట్టవిరుద్ధంగా నివసిస్తూ అసలైన లబ్ధిదారులకు అందాల్సిన సంక్షేమ ఫలాలను పొందుతున్నారు. ఇది వనరుల దుర్వినియోగంగా మారింది. ఈ నేపథ్యంలో కొత్త చట్టం ద్వారా కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది.

అక్రమ వలసలపై కేంద్రం ఉక్కుపాదం - Tholi Paluku