Let's talk: editor@tmv.in
అక్రమ వలసలను సహించేది లేదు

అక్రమ వలసలను సహించేది లేదు

Venkatesh Balusula
16 సెప్టెంబర్, 2025

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశంలో అక్రమ వలసలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అక్రమ వలసలను ఉపేక్షించేది లేదని, ఇకపై పకడ్బందీ విధివిధానాలు అనుసరిస్తామని చెప్పారు. ఇటీవల టెక్సాస్లో భారత సంతతి వ్యక్తి చంద్రమౌళి నాగమల్లయ్య హత్యపై ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో స్పందించారు. స్థానికంగా నాగమల్లయ్యకు మంచి వ్యక్తిగా పేరుందన్నారు. క్యూబా దేశం నుంచి అక్రమంగా వలస వచ్చిన వ్యక్తి ఈ హత్యకు పాల్పడ్డట్లు తెలిపారు. సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రంప్ హామీ ఇచ్చారు.

హత్య జరిగిందిలా...

టెక్సాస్లో కర్ణాటకకు చెందిన చంద్రమౌళి నాగమల్లయ్య మేనేజర్గా పని చేస్తున్నారు. తన భార్య, కుమారుడితో కలిసి అక్కడే ఉంటున్నారు. సెప్టెంబర్ 10న నాగమల్లయ్యతో క్యూబాకు చెందిన సహోద్యోగి యోర్డానిస్ కోబోస్ వాగ్వాదానికి దిగారు. వాషింగ్ మెషీన్ విషయంలో వచ్చిన గొడవతో ఇరువురి మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో భార్య, కుమారుల ముందే నాగమల్లయ్యపై కత్తితో దాడి చేశాడు. నాగమల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై ట్రంప్ తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. హత్యకు పాల్పడ్డ వ్యక్తిపై గతంలోనే నేరారోపణలు ఉన్నాయని, అతడు అక్రమంగా దేశంలోకి ప్రవేశించాడని పేర్కొన్నారు. అతడ్ని గతంలోనే దేశం నుంచి బహిష్కరించాల్సిందన్నారు. నిందితుడు గతంలో బాలలపై లైంగిక వేధింపులు, వాహన దొంగతనం వంటి నేరాలకు పాల్పడినట్లు తెలిపారు. క్యూబాలో అతడికి ప్రవేశం లేని కారణంతోనే అమెరికాలో ఉండిపోయినట్లు చెప్పారు.

జో బైడెన్పై తీవ్ర విమర్శలు

మాజీ అధ్యక్షుడు జో బైడెన్ వలస విధానాల వల్లే నేరస్థులు సైతం దేశంలోకి ప్రవేశించారని, తద్వారా తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ట్రంప్ విమర్శించారు. ఇకపై అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తన పరిపాలనలో అమెరికా సురక్షితంగా ఉండాలన్నదే తన ధ్యేయమని ట్రంప్ తెలిపారు. దీని కోసం అధికారులు సమిష్టిగా కృషి చేస్తున్నారన్నారు. ఈ హత్యపై భారతీయ అమెరికన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ఈ దారుణ హత్యను ఖండిస్తూ నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హ్యూస్టన్లోని భారత కాన్సులేట్ జనరల్ ఈ కేసును సన్నిహితంగా పరిశీలిస్తూ, చంద్రమౌళి కుటుంబానికి సహాయం అందిస్తోంది. విశ్వ హిందూ పరిషత్ అమెరికా విభాగం ఈ హత్యను ఖండిస్తూ, దేశంలో సామాజిక విచ్ఛిన్నం పెరుగుతోందని, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇండియాస్పోరా సంస్థ, హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఈ ఘటనపై స్పందిస్తూ సమాజంలో సహనం, శాంతిని కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశాయి. ఘటన అనంతరం సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి జైలుకు తరలించారు. సెప్టెంబర్ 13న టెక్సాస్లోని ఫ్లవర్ మౌండ్లో చంద్రమౌళి అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన కుటుంబానికి సాయం అందించేందుకు విరాళాలు సేకరించగా 3,21,326 డాలర్లు అందినట్లు తెలుస్తోంది.

భద్రతపై పెరుగుతున్న ఆందోళన

నాగమల్లయ్య హత్య అమెరికాలో వలస విధానాలు, నేరాల నియంత్రణపై చర్చకు తెరలేపింది. ఇది వ్యక్తిగత హత్యగానే కాకుండా అక్రమ వలసదారులతో అమెరికా ఎదుర్కొంటున్న సవాళ్లను బహిర్గతం చేసింది. ట్రంప్ ఈ ఘటనను రాజకీయంగా ఉపయోగించుకొని, బైడెన్ పరిపాలనా విధానాలపై విమర్శలు చేసి మరోసారి వలస విధానాలపై తన కఠిన వైఖరిని స్పష్టం చేశారు. నిందితుడిపై గతంలోనే ఎన్నో నేరారోపణలున్నా అమెరికా ఇంత వరకు అతడిని దేశం నుంచి బహిష్కరించకపోవడం, క్యూబా అతన్ని స్వీకరించకపోవడం తీవ్ర లోటుపాట్లను సూచిస్తున్నాయి. మరోవైపు ఈ ఘటన అమెరికాలో భారతీయ సమాజం ఎదుర్కొంటున్న భద్రతా సమస్యలను కూడా బయటపెట్టింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో వలసదారులపై, ముఖ్యంగా భారతీయులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల బ్రిటన్లో వలసదారులకు వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమం జరిగింది. అదే సమయంలో కొందరు వలసదారుల భద్రతపై ర్యాలీ నిర్వహించారు. దేశ రక్షణ కోసం అక్రమ వలసలను నియంత్రించడం ఎంత ముఖ్యమో, వలసదారుల భద్రతకు తగు చర్యలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యమన్న విషయం ప్రభుత్వాలు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.

అక్రమ వలసలను సహించేది లేదు - Tholi Paluku