Let's talk: editor@tmv.in
అంబేద్కర్ స్ఫూర్తితో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి:

అంబేద్కర్ స్ఫూర్తితో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి:

Panthagani Anusha
14 ఫిబ్రవరి, 2026

పేదరికంలో మగ్గుతున్న వర్గాల పిల్లలు సైతం ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్లు, డాక్టర్లుగా ఎదిగి సమాజంలో గౌరవప్రదమైన స్థానాల్లో ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత ఆన్‌లైన్ శిక్షణను ఆయన ప్రారంభించారు. ఎస్సీ కార్పొరేషన్ ‘ఫిజిక్స్ వాలా’ భాగస్వామ్యంతో అందిస్తున్న ఈ శిక్షణలో భాగంగా అభ్యర్థులకు ట్యాబ్‌లు, స్టడీ మెటీరియల్‌ను మంత్రి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వం అంబేద్కర్ స్టడీ సర్కిళ్లను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి కేంద్రాలుగా ఉచిత రెసిడెన్షియల్ శిక్షణను పునరుద్ధరించామని తెలిపారు. రెసిడెన్షియల్ శిక్షణకు అర్హత సాధించలేని అభ్యర్థులకు కూడా ప్రయోజనం కలగాలనే ఉద్దేశంతోనే ఈ ఉచిత ఆన్‌లైన్ కోచింగ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు.

విద్యార్థులకు ‘లక్ష’ ప్రోత్సాహం

విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడంలో ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని మంత్రి పేర్కొన్నారు. గత ఏడాది ఐఐటీ, నీట్ లో సీట్లు సాధించిన 57 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేశాం. అంబేద్కర్ గురుకులాల్లో ఐఐటీ, నీట్ ఎక్సలెన్సీ సెంటర్లను 3 నుంచి 10కి పెంచాం. రానున్న రోజుల్లో వీటిని మరింత విస్తరిస్తాం" అని ఆయన వివరించారు. ఈ ఏడాది మరింత ఎక్కువ మంది విద్యార్థులు జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో సీట్లు సాధిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

పి-4తో పేదరిక నిర్మూలన

ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి-4 విధానం ద్వారా రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు గట్టి కృషి జరుగుతోందని మంత్రి డోలా తెలిపారు. పేద విద్యార్థుల ఆరోగ్యం సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని పేర్కొన్నారు. కృషి, పట్టుదల, సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను వినియోగించుకుని అభ్యర్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలి అని పిలుపునిచ్చారు. కాగా ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అంబేద్కర్ స్ఫూర్తితో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి: - Tholi Paluku