Let's talk: editor@tmv.in
అంబేద్కర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లింది జగనే: వైసీపీ

అంబేద్కర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లింది జగనే: వైసీపీ

Panthagani Anusha
7 డిసెంబర్, 2025

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతిని పురస్కరించుకుని తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో అంబేడ్కర్‌ ఆశయాలను నిజం చేశారని, అన్ని వర్గాలకు సమన్యాయం అందించారని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కులాల పేరుతో చిచ్చు పెడుతూ అభివృద్ధిని నిర్వీర్యం చేస్తోందని తీవ్రస్థాయిలో విమర్శించారు.

అంబేద్కర్‌* *భావజాలంపై జగన్‌ ముద్ర

లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం ప్రకారం, ఆయన ఆశయాలతోనే వైయస్‌ జగన్‌ పాలన సాగించారని తెలిపారు. కులమతాలు, పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమాన్ని అందించిన ఘనత జగన్‌కే దక్కుతుందని కొనియాడారు. జూపూడి ప్రభాకర్‌రావు ఇతర నేతలు మాట్లాడుతూ, రూ. 400 కోట్లు ఖర్చు చేసి విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం, స్మృతివనం ఏర్పాటు చేయడం ద్వారా జగన్‌.. అంబేడ్కర్‌ భావజాలం భావితరాలకు చేరేలా చేశారని గుర్తు చేశారు.

అయితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి, ‘రెడ్‌ బుక్‌ రాజ్యాంగం’ అమలు చేస్తోందని మేరుగు నాగార్జున వ్యాఖ్యానించారు. సంస్కరణలు నిర్వీర్యం కావడంతో విద్యారంగం నాశనమై, పేద పిల్లలు చదువుకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని ఆందోళన చెందారు.

శిలాఫలకం తొలగింపుపై తీవ్ర హెచ్చరిక

అంబేద్కర్‌ స్మృతివనం వద్ద శిలాఫలకం తొలగింపుపై వైయస్సార్‌సీపీ నేతలు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. టీజేఆర్‌ సుధాకర్‌ బాబు మాట్లాడుతూ, జగన్‌పై ఉన్న అక్కసుతోనే చంద్రబాబు సీఎం కాగానే స్మృతివనం వద్ద శిలాఫలకాన్ని తొలగించారని విమర్శించారు. తొలగించిన ఆ శిలాఫలకాన్ని జనవరి 26 లోగా తిరిగి ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ మీరు ఆ పని చేయకపోతే, రేపు మా ప్రభుత్వం రాగానే, ఇప్పుడు మీరు ఏర్పాటు చేసుకుంటున్న శిలాఫలకాల అన్నింటినీ పూర్తిగా తొలగిస్తాం" అని సుధాకర్‌బాబు స్పష్టం చేశారు.

అక్కసుతో ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టడం సరికాదు

నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ, తాను నిర్మించలేని అంబేద్కర్‌ విగ్రహాన్ని జగన్‌ నిర్మించారనే అక్కసుతోనే దానికి పోటీగా అంతకన్నా పెద్దదైన ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తానని చెప్పడం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను అవమానించడమేనని తేల్చి చెప్పారు. ఇలాంటి ప్రభుత్వానికి అంబేద్కర్‌ పేరెత్తే అర్హత లేదని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం తిరిగి వస్తాయని వారు ధీమా వ్యక్తం చేశారు.

పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్‌ఛార్జ్‌, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్‌ సుధాకర్‌ బాబు, ప్రధాన కార్యదర్శులు నందమూరి లక్ష్మీపార్వతి, జూపూడి ప్రభాకర్‌రావు సహా పలువురు ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అంబేద్కర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లింది జగనే: వైసీపీ - Tholi Paluku