
అంబులెన్స్‌లోనే యువతిపై గ్యాంగ్‌రేప్ – పోలీసుల వెల్లడి
ఫరీదాబాద్‌లో 25 ఏళ్ల యువతిపై జరిగిన గ్యాంగ్‌రేప్ కేసులో కీలకమైన కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలిపై దాడి వాన్‌లో కాకుండా, ఒక ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన అంబులెన్స్‌లోనే జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీనియర్ అధికారి ఆదివారం వివరాలను చెబుతూ నిందితులు ఇద్దరూ గతంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి అంబులెన్స్‌లో డ్రైవర్‌గా, హెల్పర్‌గా పనిచేశారని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని మథురకు చెందిన ఒకరు, ఝాన్సీకు చెందిన మరో వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి, జ్యూడిషియల్ కస్టడీకి పంపించారు. ఘటన జరిగి ఆరు రోజులు గడిచినా, బాధితురాలు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోంది.
ఈ ఘటన తర్వాత తీసినట్లు భావిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో బాధితురాలు తనకు జరిగిన దారుణాన్ని వివరిస్తోంది. అయితే ఆ వీడియో నిజమైనదేనా కాదా అన్న విషయాన్ని పీటీఐ నిర్ధారించలేకపోయింది. ఆ వీడియోలో బాధితురాలు మాట్లాడుతూ నాకు వాళ్లెవరో ఇంతకు ముందు తెలియదు. నేను వాహనంలో కూర్చోగానే వాళ్లలో ఒకరు నా పేటీయం ఖాతాలో రూ.600 జమ చేశారు. ఆ తర్వాత కారు తాళాలు వేసి, నా మొబైల్ ఫోన్ లాక్కున్నారు. రాత్రి దట్టమైన పొగమంచు ఉంది. నేను గట్టిగా అరచినా ఎవరూ సహాయం చేయలేదని చెప్పింది. బాధితురాలి ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత, మ్యాజిస్ట్రేట్ ముందు నిందితుల గుర్తింపు పరేడ్ నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత జైలు నుంచి ప్రొడక్షన్ వారెంట్ తీసుకుని మరింత విచారణ చేపడతామని పేర్కొన్నారు.
ఘటన వివరాలు
పోలీసుల సమాచారం ప్రకారం, సోమవారం(డిసెంబర్ 29న) సాయంత్రం బాధితురాలు ఫరీదాబాద్‌లోని సెక్టార్ 23లో తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. తిరిగి వస్తూ ఆమె ఆటోలో ఎన్ఐటీ-2 చౌక్ వరకు వచ్చి, అక్కడి నుంచి మెట్రో చౌక్ వైపు నడుచుకుంటూ వెళ్లింది. అర్ధరాత్రి వేళ ఇంటికి వెళ్లేందుకు ఆటో కోసం ఎదురుచూస్తున్న సమయంలో, ఇద్దరు నిందితులు ఆమెకు లిఫ్ట్ ఇస్తామని చెప్పారు. అయితే ఇంటికి తీసుకెళ్లకుండా, ఆమెను గురుగ్రామ్ వైపు తీసుకెళ్లి, ప్రయాణంలోనే అంబులెన్స్‌లో లైంగిక దాడి చేశారు. రాత్రంతా వాహనంలో తిప్పిన అనంతరం మంగళవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఫరీదాబాద్‌లోని రాజా చౌక్ వద్ద ఆమెను రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. అనంతరం బాధితురాలిని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు.
సుమోటోగా స్వీకరించిన హర్యానా మహిళా కమిషన్
ఫరీదాబాద్‌లో 25 ఏళ్ల యువతిపై జరిగిన అమానుషమైన గ్యాంగ్‌రేప్ ఘటనను హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్‌గా పరిగణనలోకి తీసుకుంది. ఈ విషయాన్ని ఆదివారం అధికారులు వెల్లడించారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేణు భాటియా, ఫరీదాబాద్ పోలీస్ కమిషనర్ సత్యేందర్ కుమార్ గుప్తాను సంప్రదించి, ఘటనపై సమగ్ర నివేదిక, ఇప్పటివరకు పోలీసులు తీసుకున్న చర్యలపై పూర్తి సమాచారం తనకు అందజేయాలని కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రేణు భాటియా మాట్లాడుతూ నేను బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడాను. ఆమెకు అవసరమైన అన్ని విధాల సహాయాన్ని మహిళా కమిషన్ అందిస్తోందని చెప్పారు.
బాధితురాలి ఆరోగ్య పరిస్థితి
బాధితురాలికి చికిత్స అందిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడు డా. అమిత్ యాదవ్ మాట్లాడుతూ బాధితురాలి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా (స్టేబుల్‌గా) ఉందని తెలిపారు. ఆమె ముఖంపై తీవ్ర గాయాలు కావడంతో, శనివారం ముఖానికి శస్త్రచికిత్స నిర్వహించామని, బాధితురాలి సమ్మతితో ఆమె కుడి భుజానికి (ఫ్రాక్చర్) కూడా త్వరలో శస్త్రచికిత్స చేస్తామని చెప్పారు.
