Let's talk: editor@tmv.in
అంబానీ ‘సిమెంట్’ కంపెనీపై వ్యతిరేకత

అంబానీ ‘సిమెంట్’ కంపెనీపై వ్యతిరేకత

FL - YUGDR
1 అక్టోబర్, 2025

ఆదాని సంస్థ ఏర్పాటు చేయ తలపెట్టిన అంబుజా సిమెంట్ కర్మాగారం పరిసర ప్రాంతాలలో పంబ రేపుతోంది. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం పెదగంట్యాడలో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుచే యాలని భావిస్తున్న అదానీ సంస్థ (అనుబంధ కంపెనీ అయిన అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ పేరుతో పెడుతున్నారు) పర్యావరణ ప్రభావ అంచనా నివేదికలో అన్నీ అవాస్తవాలే పొందుపరచడం పెద్ద వివాదాస్పదంగా మారింది. కొందరు అధికారులు, కూటమి పెద్దల మద్దతుతో అడ్డగోలుగా అనుమతులు పొందేందుకు తప్పుడు సమాచారం ఇచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిని ప్రశ్నించా ల్సిన ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) మౌనంగా ఉంది. దీనిపై ఈ అక్టోబరు 8న ప్రజాభిప్రాయ సేకరణ జరగనున్నది.

ఇళ్ళ మధ్య సిమెంట్ కర్మాగారం

పెదగంట్యాడలోని సర్వే నంబర్లు 97 పి, 98, 99 పి, 101 పి లలో సుమారుగా 20 ఎకరాల్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలని అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం ప్రతిపాదన చేసింది. దీని పేరు.. గంగ వరం సిమెంట్ గ్రైండింగ్ యూనిట్. ఏడాదికి 40 లక్షల టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేయాలనేది లక్ష్యం. దీనికి వేయి కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని పేర్కొంది. ఇది స్లాగ్ సిమెంట్. ప్రధాన ముడిసరకు అయిన ఫ్లైయాష్ ను సమీపంలోని ఎన్టీపీసీ, హిందూజ పవర్ ప్లాంట్ల నుంచి రోజూ లారీలతో తీసుకువస్తారు. ఇక్కడ ఫ్లయష్ ఉచితంగా లభ్యం అవుతుంది.

తప్పుల తడకల తో నివేదిక

సిమెంట్ పరిశ్రమ కాలుష్యంతో కూడుకున్నది. కావడంతో పరిసర ప్రాంతాలపై దాని ప్రభావంఏమిటో ఒక నివేదికతయారు చేసి ముందుగా సమర్పించాలి. దీనిని పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) నివేదికగా వ్యవహరిస్తారు. అదానీ యాజమాన్యం ఆ నివేదికలో అన్నీ అవాస్తవాలు పేర్కొంది. నివాస ప్రాంతాలకు 500 మీటర్ల ఆవల సిమెంట్ పరిశ్రమలు ఏర్పాటు చేయాలనేది నిబంధన. ఇక్కడ అదానీ పరిశ్రమ ఏర్పాటుచేసే భూములకు కేవ లం 130 మీటర్ల పరిధిలో పెదగంట్యాడ, 290 మీటర్ల పరిధిలో గాజువాక ప్రజలు నివసిస్తున్నారు. ఈ విషయాన్ని తొక్కిపెట్టారు.

అదానీ సిమెంట్స్ కు భారీగా నీరు అవసరం. రోజుకు 4 వేల కిలోలీటర్లు కావాలని వారే పేర్కొన్నారు. అక్కడికి 4 కి.మీ. దూరానున్న డీశాలినేషన్ ప్లాంటు నుంచి రోజుకు 200 కిలోలీటర్లు, అదే ప్లాంటు నుంచి ఆపరేషన్ సమయంలో రోజుకు 400 కిలోలీటర్లు తీసుకుంటామని పేర్కొన్నారు. మిగిలిన 3,600 కిలోలీటర్ల నీటిని ఎక్కడి నుంచి తీసు కుంటుందనే అనుమానం వస్తుంది. విశాఖ నగరానికి తాగునీరు అందించే ఏలేరు కాలువే ప్రధాన నీటి వనరు కాబట్టి అందులో నుంచే తీసుకోవాలి. విశాఖ తాగునీటి అవసరాల కారణంగా ఇప్పటికే విశాఖలో పరిశ్రమలకు అవసరమైన నీటిని అందివ్వలేకపోతున్నారు.

డిశాలనేషన్ ప్లాంట్ ఏది?

అసలు విషయం ఇంకొకటి ఉంది. గాజువాక లో డీశాలినేషన్ ప్లాంటే లేదు. లేని ప్లాంటు 4 కి.మీ. దూరాన ఉందని, అందులో శుద్ధిచేసిన నీటిని తీసుకుంటామని అవాస్తవాలు నివేదించింది. ఇది పూర్తిగా ప్రభుత్వాన్ని తప్పు దోవ పట్టించడం కిందకే వస్తుంది. ఇప్పుడే అన్ని అబద్ధాలు చెబితే ఆ తరువాత ఇంకెన్ని చెబుతారో ఊహించుకోవలసిందే.

ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలి

అదానీ యాజమాన్యం సిమెంట్ పరిశ్రమకు సంబంధించి అవాస్త వాలతో పర్యావరణ ప్రభావం అంచనా నివేదిక రూపొందించినం దున, ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలని ఫోరం ఫర్ బెటర్ విశాఖ కన్వీనర్ ఈ ఏ ఎస్ శర్మ డిమాండ్ చేశారు. ఏపీపీసీబీ అధికారులు ప్రజల ప్రాణాలను విలువైనవి గుర్తించి, నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. జిల్లా అధికార యంత్రాంగమూ తగు రీతిలో స్పందించాలని,విశాఖను మరింత కాలుష్యమయం చేయడం తగదని స్పష్టం చేశారు.

అంబానీ ‘సిమెంట్’ కంపెనీపై వ్యతిరేకత - Tholi Paluku