Let's talk: editor@tmv.in
అంబటి రాంబాబు అరెస్టు రాజకీయ కక్షే: జగన్

అంబటి రాంబాబు అరెస్టు రాజకీయ కక్షే: జగన్

Panthagani Anusha
6 ఫిబ్రవరి, 2026

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైయస్ఆర్‌సిపి నేతలే లక్ష్యంగా ‘జంగిల్ రాజ్’ నడుపుతోందని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం గుంటూరులోని సిద్ధార్థ నగర్‌లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసాన్ని కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. టీడీపీ శ్రేణుల దాడిలో ధ్వంసమైన కార్లు, గృహోపకరణాలను స్వయంగా పరిశీలించిన జగన్ అనంతరం అంబటి భార్య, కుమార్తెలను పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

హత్యాయత్నం చేసి.. అక్రమంగా అరెస్టు చేస్తారా?

అంబటి రాంబాబుపై జరిగిన దాడిని హత్యాయత్నంగా అభివర్ణించిన జగన్ ఒక మాజీ మంత్రి గుడికి వెళ్లి వస్తుంటే పోలీసుల సమక్షంలోనే ప్రతిపక్ష నేతలు కర్రలతో దాడి చేయడం, ఇంటిపైకి వెళ్లడం ఏ రకమైన సంస్కృతి? స్థానిక ఎమ్మెల్యే, ఆమె భర్త నేతృత్వంలో కార్లను ధ్వంసం చేసి కార్యాలయానికి నిప్పు పెట్టడం దారుణం. అంత విధ్వంసం జరిగినా నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి బాధితుడైన అంబటిపై అక్రమ కేసులు బనాయించి రాజమండ్రి జైలుకు పంపడం చంద్రబాబు కక్షసాధింపు రాజకీయాలకు నిదర్శనం అని మండిపడ్డారు.

తిరుమల లడ్డూ నెయ్యి వివాదంపై కీలక వ్యాఖ్యలు

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో చంద్రబాబు ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని జగన్ పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వ ల్యాబ్‌లైన ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ నివేదికలే నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని స్పష్టం చేశాయి. సిట్, సీబీఐ దర్యాప్తులో కూడా వాస్తవాలు వెల్లడయ్యాయి. తప్పు జరిగితే వైవీ సుబ్బారెడ్డి, భూమనల పేర్లు ఛార్జిషీట్‌లో ఎందుకు లేవు? స్వార్థ రాజకీయాల కోసం వెంకటేశ్వరస్వామి ప్రతిష్టను దెబ్బతీసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ఇంకా అబద్ధపు ఫ్లెక్సీలతో మభ్యపెట్టడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రశ్నిస్తే జైలు..

రాష్ట్రంలో మద్యం మాఫియా రాజ్యమేలుతోందని జగన్ ఆరోపించారు. నకిలీ మద్యం తయారు చేస్తున్నది టీడీపీ నేతలేనని కానీ జోగి రమేష్ వంటి నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. "సూపర్ సిక్స్ హామీలను తుంగలో తొక్కి, ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపుతున్నారు. మద్యం దుకాణాల పక్కనే పర్మిట్ రూమ్‌లు పెట్టి యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే గంజాయి కేసులు పెట్టి వేధిస్తున్నారు. చివరకు సోషల్ మీడియా కార్యకర్తలను కూడా వదలడం లేదు అని దుయ్యబట్టారు.

అదేవిధంగా అరాచకాల్లో భాగస్వాములవుతున్న పోలీసు అధికారులపై జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. "చంద్రబాబు అధికారం శాశ్వతం కాదు. మరో మూడు ఏళ్లలో మా ప్రభుత్వం వస్తుంది. అప్పుడు తప్పుడు పనులు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం. యూనిఫామ్‌తోనే బోనులో నిలబెడతాం. అప్పుడు వడ్డీతో సహా బదులిస్తాం" అని హెచ్చరించారు. అక్రమ పద్ధతులు మానుకోకపోతే రాష్ట్ర బంద్ నిర్వహిస్తామని, ఢిల్లీ వేదికగా ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.

తాడేపల్లి నుంచి గుంటూరు వరకు జగన్ పర్యటన పొడవునా అభిమాన తరంగం పోటెత్తింది. ఇదిలా ఉండగా జగన్ గుంటూరు పర్యటనపై అధికార పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. రెవెన్యూ మంత్రి ఎ. సత్య ప్రసాద్ మాట్లాడుతూ అనుమతించిన పరిమితికి మించి జనాన్ని సమీకరించి శాంతిభద్రతలకు భంగం కలిగించారని ఆరోపించారు. ఈ పర్యటన రాజకీయ లబ్ధి కోసమేనని, కుల, మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా ఉందని విమర్శించారు.

అంబటి రాంబాబు అరెస్టు రాజకీయ కక్షే: జగన్ - Tholi Paluku