Let's talk: editor@tmv.in
అంబటికి బెయిల్ వచ్చినా.. జైల్లోనే

అంబటికి బెయిల్ వచ్చినా.. జైల్లోనే

Panthagani Anusha
10 ఫిబ్రవరి, 2026

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అంబటికి గుంటూరు స్పెషల్‌ మొబైల్‌ కోర్టు బెయిల్‌ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కేసులో పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

అయితే ఈ కేసులో బెయిల్‌ లభించినప్పటికీ అంబటి రాంబాబు వెంటనే జైలు నుంచి విడుదలయ్యే పరిస్థితి లేదు. పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌లో గతంలో నమోదైన మరో కేసులో ఇప్పటికే రిమాండ్‌లో ఉండటంతో ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులోనే కొనసాగనున్నారు. ఈ కేసులో ఈ నెల 22వ తేదీ వరకు కోర్టు రిమాండ్‌ విధించింది.

పోలీసులతో దురుసు ప్రవర్తన కేసు

గతేడాది నవంబర్‌ 12న గుంటూరులో కూటమి ప్రభుత్వం మెడికల్‌ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ‘ప్రజా ఉద్యమం’ పేరుతో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా అంబటి రాంబాబు పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అంబటిని పీటీ వారెంట్‌పై కోర్టుకు హాజరుపరచగా, స్పెషల్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ ఈ నెల 22 వరకు 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

దీంతో సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారంటూ జనవరి 31న అరెస్టు చేసిన కేసులో బెయిల్‌ వచ్చినా మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీ కేసులో రిమాండ్‌ కొనసాగనుంది. ఈ కేసులోనూ బెయిల్‌ లభిస్తేనే అంబటి విడుదలయ్యే అవకాశం ఉంటుంది.

35 క్వాష్‌ పిటిషన్లపై హైకోర్టు విచారణ

ఇదిలా ఉండగా, అంబటి రాంబాబుపై సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 35 కేసులను క్వాష్‌ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది.

ఒకే అంశంపై 35 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అంబటి తరఫు న్యాయవాది ఒకే విషయంపై అనేక కేసులు నమోదు చేయడం అన్యాయమని వాదించారు. దీనికి ప్రతిగా ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వేర్వేరు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందాయని కోర్టుకు తెలిపారు. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొన్న హైకోర్టు, విచారణ పూర్తయ్యే వరకు తొందరపాటు చర్యలు తీసుకోకూడదని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది.

కేసుల సంఖ్యపై వైఎస్సార్‌సీపీ ఆరోపణలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబటి రాంబాబుపై కక్ష సాధింపు చర్యలుగా కేసులు నమోదు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గత ఎనిమిది రోజుల్లోనే దాదాపు 36 కేసులు నమోదు చేశారని మొత్తం మీద ఇప్పటివరకు అంబటిపై 44 కేసులు నమోదయ్యాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.