Let's talk: editor@tmv.in
అందోల్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై మంత్రి దామోదర్ సమీక్ష

అందోల్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై మంత్రి దామోదర్ సమీక్ష

Gaddamidi Naveen
24 అక్టోబర్, 2025

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గురువారం సంగారెడ్డిలోని తన నివాసంలో సంగారెడ్డి, మెదక్ జిల్లాల పంచాయతీ రాజ్ రోడ్లు, భవనాలు (ఆర్&బి) శాఖల ఇంజినీరింగ్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అందోల్ నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, ముఖ్యంగా రోడ్లు ఇతర నిర్మాణాల పురోగతిపై మంత్రి ప్రధానంగా చర్చించారు.

రోడ్ల పనులు వేగవంతం చేయాలని ఆదేశం

సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో విస్తరించి ఉన్న అందోల్ నియోజకవర్గం పరిధిలో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న రోడ్ల నిర్మాణ పనులు, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తుల పనులను శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ నష్టం మొత్తం రూ. 147.70 కోట్ల వరకు ఉందని తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ తెలిపింది. ఈ నష్టం 84.97 కిలోమీటర్ల రోడ్లకు సంబంధించినదిగా పేర్కొనబడింది. ఈ నష్టాలను పరిగణనలోకి తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్ల ప్రత్యేక నిధులను విడుదల చేసింది. ఈ నిధులను ప్రధానంగా రోడ్ల మరమ్మత్తులు, చిన్న బ్రిడ్జిల నిర్మాణం మరమ్మత్తుల కోసం ఉపయోగించనున్నారు.

గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న రోడ్ల నిర్మాణం, మరమ్మత్తుల పనులతో పాటు, కొత్తగా నిర్మిస్తున్న అంగన్వాడీ భవనాల నిర్మాణం, వివిధ పాఠశాలల్లో నిర్మిస్తున్న టాయిలెట్స్ బ్లాక్స్ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. ముఖ్యంగా మండల కేంద్రాల నుండి గ్రామాలకు వెళ్లే కనెక్టింగ్ రోడ్ల పనులను వేగవంతం చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు మంత్రి సూచించారు.

సంగారెడ్డి జిల్లాలో అంగన్వాడీ భవనాల నిర్మాణం

సంగారెడ్డి జిల్లాలో 49 అంగన్వాడీ భవనాల నిర్మాణం కోసం రూ.3.92 కోట్ల అంచనా వ్యయం నిర్ణయించబడింది. ఇందులో 18 పనులు రూ.1.99 కోట్ల ఖర్చుతో పూర్తి చేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.

గార్లపల్లి - అజ్జమర్రి బ్రిడ్జి పురోగతిపై చర్చ

అనంతరం, సంగారెడ్డి జిల్లా రహదారులు , భవనాల శాఖ ఇంజినీరింగ్ అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కీలకమైన గార్లపల్లి - అజ్జమర్రి బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిపై చర్చించారు.ఈ సమీక్షా సమావేశంలో పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖ అధికారులు జగదీశ్వర్‌‌తో ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.అధికారులందరూ సమన్వయంతో పనిచేసి పనులను నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.

అంగన్వాడీ భవనాల నిర్మాణ వ్యయం

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అంగన్వాడీ కేంద్రాల నిర్మాణ వ్యయం ప్రతి యూనిట్‌కు రూ. 12 లక్షలుగా నిర్ణయించబడింది. ఈ వ్యయం భవనం నిర్మాణం, నీటి సరఫరా సౌకర్యాలు, టాయిలెట్ వంటి అంశాలను కలిగి ఉన్నాయి. ఈ నిర్ణయం 2024 ఫిబ్రవరిలో పార్లమెంట్‌లో సమాధానంగా వెల్లడించబడింది.