Let's talk: editor@tmv.in
అందుకే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: హర్మన్‌ప్రీత్ కౌర్

అందుకే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: హర్మన్‌ప్రీత్ కౌర్

Shaik Mohammad Shaffee
11 అక్టోబర్, 2025

ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ 2025 టోర్నీలో భాగంగా విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు అనూహ్య రీతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆఖరి వరకు తీవ్రంగా పోరాడినా, సఫారీ బ్యాటర్ నదిన్ డి క్లర్క్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన ముందు టీమిండియా తలవంచక తప్పలేదు. క్లర్క్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికా జట్టు విజయాన్ని అందుకుంది. ఈ ఓటమితో టోర్నీలో భారత్‌కు తొలి పరాజయం ఎదురైంది.

టాపార్డర్ వైఫల్యమే ఓటమికి కారణం: హర్మన్‌ప్రీత్

అనూహ్య ఓటమిపై భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్ స్పందించింది. టాపార్డర్ వైఫల్యమే తమ ఓటమికి ప్రధాన కారణమని ఆమె పేర్కొంది. ఇకపై తమ వ్యూహాలు మార్చుకోవాల్సి ఉందని, మెరుగైన భాగస్వామ్యాలు, భారీ స్కోర్లు సాధించడంపై దృష్టి పెడతామని తెలిపింది. "ఇదొక చాలా కఠినమైన మ్యాచ్. ఇరు జట్లు అద్భుతంగా ఆడాయి. మా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలినా, రిచా ఘోష్ పోరాటంతో 250 పరుగులు చేయగలిగాం. అయితే ఆఖర్లో క్లో ట్రయాన్, డి క్లర్క్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇది బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్ అని వారు నిరూపించారు. మాకంటే వారు మెరుగ్గా ఆడారు. ఈ విజయానికి వారు పూర్తిగా అర్హులు" అని పేర్కొంది.

"టాపార్డర్‌గా మేము బాధ్యత తీసుకోలేకపోయాం. వరుసగా వికెట్లు కోల్పోయాం. మేం మా బ్యాటింగ్ తీరును మార్చుకోవాలి. మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోతున్నాం. ఈ వైఫల్యాల నుంచి మేం చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఇది సుదీర్ఘమైన టోర్నమెంట్ కాబట్టి, సానుకూల ధృక్పథంతో సరైన రీతిలో ఆటను మెరుగుపర్చుకుంటూ ముందుకు సాగాలి" అని హర్మన్‌ప్రీత్ పేర్కొంది. కాగా ఆదివారం ఇదే వైజాగ్‌ మైదానంలో ఆస్ట్రేలియాతో హర్మన్‌ సేన తలపడనుంది.

రిచా ఘోష్ విధ్వంసకర ఇన్నింగ్స్ వృథా

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లలో ప్రతికా రావల్ (37) ఫర్వాలేదనిపించగా, స్మృతి మంధాన (23) నిరాశపరిచింది. వన్‌డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ (13)తో పాటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (9) కూడా విఫలమయ్యారు. జెమీమా రోడ్రిగెస్ డకౌట్, దీప్తి శర్మ (13) త్వరగా పెవిలియన్ చేరారు.

ఈ క్లిష్ట దశలో వికెట్ కీపర్ రిచా ఘోష్ 77 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 94 పరుగులు చేసి జట్టును ఆదుకుంది. ఆమెకు స్నేహ్ రాణా (24 బంతుల్లో 33) తోడైంది. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 88 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

డి క్లర్క్ వీరోచిత పోరాటం

లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే చుక్కెదురైంది. తజ్మిన్ బ్రిట్స్, సునే లూస్ తక్కువ పరుగులకే ఔటయ్యారు. అయితే మరో ఓపెనర్, కెప్టెన్ లారా వోల్వార్ట్ (111 బంతుల్లో 70 పరుగులు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో క్లో ట్రయాన్ (66 బంతుల్లో 49 పరుగులు) పోరాడింది. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన ఎనిమిదో నంబర్ బ్యాటర్ నదిన్ డి క్లర్క్ (54 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 84 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఆమె విధ్వంసక ఇన్నింగ్స్‌తో మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే సఫారీ జట్టు 7 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. నదిన్ డి క్లర్క్ “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు గెలుచుకుంది.

అందుకే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: హర్మన్‌ప్రీత్ కౌర్ - Tholi Paluku