
అందుకే ఐపీఎల్ నుంచి తప్పుకున్నా: అశ్విన్
భారత దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన ఐపీఎల్ రిటైర్మెంట్ వెనుక ఉన్న అసలు కారణాలను వెల్లడించారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో గడిపిన చివరి సీజన్ తనకు వ్యక్తిగతంగా ఎంతో నిరాశను మిగిల్చిందని, అది మానసిక వేదనతో కూడిన బాధాకరమైన ఘట్టమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన యూట్యూబ్ ఛానెల్ 'యాష్ కీ బాత్'లో మాట్లాడిన అశ్విన్, వాస్తవానికి తాను మరికొంత కాలం ఐపీఎల్ ఆడే సత్తా ఉన్నప్పటికీ, భావోద్వేగ పరంగా ఆ ఒత్తిడిని తట్టుకోలేకే ఆటకు స్వస్తి పలికినట్లు స్పష్టం చేశారు. 2024లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్, గతేడాది తన ఐపీఎల్ ప్రస్థానాన్ని కూడా ముగించిన సంగతి తెలిసిందే.
స్వస్థలంలో చేదు అనుభవం
ఐపీఎల్ ప్రయాణాన్ని ఎక్కడైతే మొదలుపెట్టారో, అదే చెన్నై జట్టుతో ముగించాలన్నది అశ్విన్ ఆకాంక్ష. కానీ 2025 సీజన్‌లో ఆయనకు ఆశించిన గౌరవం దక్కలేదు. మొత్తం 14 మ్యాచ్‌లలో కేవలం 9 మ్యాచ్‌లకు మాత్రమే ఆయనను పరిమితం చేశారు. తన పాత్రపై స్పష్టత కోరినప్పటికీ సరైన సమాధానం రాకపోవడంతో, మానసిక ప్రశాంతత కోసం తప్పుకోవడమే మేలని అశ్విన్ భావించారు. "నేను ఆ చేదు జ్ఞాపకాల గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు, అది చాలా బాధాకరం. నా హోమ్ టౌన్‌లోనే కెరీర్ ముగిసింది కదా అని సరిపెట్టుకున్నాను" అని ఆయన పేర్కొన్నారు.
జట్టు కోసం భారీ త్యాగం
ఫ్రాంచైజీకి తనను రిటైన్ చేసుకోవాలా లేక వదిలేయాలా అనే సందిగ్ధత లేకుండా చేయడానికే తాను రిటైర్మెంట్ ప్రకటించినట్లు అశ్విన్ వెల్లడించారు. రూ.9.75 కోట్లకు జట్టులోకి వచ్చిన ఆయన, తప్పుకోవడం వల్ల సీఎస్‌కే పర్స్‌లో దాదాపు రూ.10 కోట్లు మిగిలాయని చెప్పారు. "ఆ డబ్బుతో మినీ వేలంలో యువ ఆటగాళ్లను కొనుగోలు చేసి బలమైన జట్టును నిర్మించుకోవచ్చని భావించాను. జట్టు మేలు కోరి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను" అని వివరించారు.
