
అందరిలోనూ వణుకు పుట్టిస్తున్న హైడ్రా!
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల రక్షణ, విపత్తు ప్రతిస్పందన కోసం ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) తన ఉక్కుపాదం మోపుతోంది. ముఖ్యంగా దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ మాఫియా, రాజకీయ నాయకుల అండదండలతో ఆక్రమణలకు గురైన వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియను హైడ్రా ముమ్మరం చేసింది. నగరంలో ఎక్కడా లేని విధంగా ఈ దూకుడు చర్యలతో హైడ్రా అంటేనే హడల్ అనే పరిస్థితి కబ్జాదారుల్లో నెలకొంది.
హైడ్రా ఏర్పాటు ఎందుకు?
అతివేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌లో వరదలు, ఇతర విపత్తుల నివారణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం గతంలో ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరిం,చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 2024 జూలై 19న హైడ్రాను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు, పార్కులను రక్షించడం, అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం ఈ ఏజెన్సీ ముఖ్య లక్ష్యం.
రికార్డు స్థాయిలో ఆస్తుల రికవరీ
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యవేక్షణలో ఏజెన్సీ ఏర్పడినప్పటి నుంచి ఆస్తుల రక్షణ విభాగం రికార్డు స్థాయిలో భూములను రికవరీ చేసింది. 2024 జూలై నుంచి ఇప్పటివరకు 581కి పైగా ఆక్రమణలను తొలగించి, 923 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకుంది.
రికవరీ చేసిన ఈ భూముల విలువ సుమారు రూ. 45 వేల కోట్ల నుంచి 50 వేల కోట్ల వరకు ఉంటుందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇందులో ప్రభుత్వ భూమి, చెరువులు, నాలాలు, రోడ్లు, పార్కుల ఆక్రమణలు ఉన్నాయి.
కొండాపూర్‌లో సంచలనం
తాజాగా కొండాపూర్‌లోని బిక్షపతి నగర్‌లో సర్వే నెంబర్ 59లో దశాబ్దాలుగా 12 మంది రైతుల ఆధీనంలో ఉన్న 36 ఎకరాల అతి విలువైన భూమిని హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి విలువ రూ.7 కోట్ల వరకు ఉంటుందని ప్రాథమిక అంచనా వేసినప్పటికీ మార్కెట్ విలువలో ఇది మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
గాజులరామారంలో ఘర్షణ
గాజులరామారంలో 317 ఎకరాలప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునే క్రమంలో నిరసనకారులు అధికారులపై రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైడ్రా కూల్చివేత చర్యలు అనేక చోట్ల తీవ్ర నిరసనలకు, ఘర్షణలకు దారితీశాయి. కూల్చివేతలకు అడ్డుతగిలిన ప్రజలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నగరంలోని నాలాలు, చెరువుల ఆక్రమణలతో పాటు సామాన్య, ధనిక వర్గాల నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చివేసింది. ఇందులో రిసార్ట్‌లు, రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా ఉన్నాయి.అక్రమంగా ప్లాట్లు కొనుగోలు చేసిన పేద కుటుంబాలు తాము మోసపోయామని ఆందోళన వ్యక్తం చేస్తూ కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల మహిళలు బత్కమ్మ పండుగ సమయంలో భావోద్వేగంతో నిరసనలు తెలిపారు.
కోర్టులలో కేసులు
హైడ్రా చర్యలను సవాలు చేస్తూ కబ్జాదారులు హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ అనేక కేసుల్లో కోర్టులు హైడ్రాకు అనుకూలంగా తీర్పు చెప్పాయి.
కూల్చివేత సమయంలో తమ ఆస్తులు కోల్పోతున్నామని ఆవేదన చెందిన కొందరు వ్యక్తులు ఘటనా స్థలంలోనే ఆత్మహత్యాయత్నాలు చేసుకున్న సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.దశాబ్దాలుగా ప్రభుత్వ భూములను ఆక్రమించిన స్థానిక రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కుమ్మక్కైన రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులపై హైడ్రా దృష్టి సారించింది. అక్రమ ఆక్రమణలకు విద్యుత్, నీటి కనెక్షన్లు ఇవ్వడం, ఇంటి పన్నులు వసూలు చేయడం కబ్జాదారులకు వరంగా మారగా ఇప్పుడు హైడ్రా అధికారులు వారి అక్రమాలకు చరమగీతం పాడుతున్నారు.
పార్కు స్థలంలోని ఆక్రమణల తొలగింపు
తాజాగా బంజారాహిల్స్ రోడ్డు నెం. 10లో అత్యంత విలువైన 5 ఎకరాల స్థలం అక్రమ కబ్జాల బారిన పడగా హైడ్రా అధికారులు రంగంలోకి దిగి ఆక్రమణలను పూర్తిగా తొలగించారు. ప్రభుత్వానికి ఆ భూమిని తిరిగి స్వాధీనం చేశారు. కుత్బుల్లాపూర్ మండలం, గాజులరామారం మహాదేవపురంలో పార్కులు, ఇతర ప్రజావసరాల కోసం ఉద్దేశించిన స్థలాలు కబ్జా అవుతున్నాయనే ఫిర్యాదుల మేరకు హైడ్రా అధికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా3.50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పార్కు స్థలంలో ఆక్రమణలను హైడ్రా సిబ్బంది తొలగించారు.
విలువైన భూములు రక్షణ
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా, మేడ్చల్ విలేజ్ పరిధిలో ఏ.జి. ఆఫీస్ ఉద్యోగులు 2005లో వేసిన లేఔట్‌లో పార్కులు, రహదారులు కలిపి మొత్తం 3 ఎకరాల మేర కబ్జాకు గురైనట్టు ఫిర్యాదు అందింది. హైడ్రా అధికారులు వెంటనే స్పందించి, ఈ ఆక్రమణలను తొలగించి 3 ఎకరాల ప్రజావసరాల స్థలాన్ని కాపాడారు. అలాగే రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్మెట్ మండలం, తట్టి అన్నారం విలేజ్, శ్రీలక్ష్మి గణపతి కాలనీలో కూడా హైడ్రా ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టింది. ఇక్కడ 680 గజాల విస్తీర్ణంలో ఉన్న పార్కు స్థలంలో 270 గజాలను తన ప్లాట్‌గా పేర్కొంటూ ఒక వ్యక్తి కబ్జా చేశాడు. ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపిన హైడ్రా, ఆక్రమణలను తొలగించి మొత్తం 680 గజాల పార్కు స్థలాన్ని సంరక్షించింది.నగరంలో ప్రజోపయోగ స్థలాలను కాపాడేందుకు హైడ్రా తన దాడులను, విచారణలను కొనసాగిస్తోందని అధికారులు తెలిపారు. ప్రజలు కూడా ఇలాంటి ఆక్రమణల గురించి వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు.
శనివారమే దాడులు ఎందుకు?
హైడ్రా అధికారులు ఎక్కువగా శనివారం, ఆదివారమే కూల్చివేతలకు దిగుతున్నారు. సాధారణ రోజుల్లో అయితే కూల్చివేతలను అడ్డుకునే అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు. కోర్టుకు, రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్లి కూల్చివేతలను నిలిపివేసే విధంగా ఒత్తిడి తెచ్చే అవకాశాలుంటాయని హైడ్రా అధికారులు శని, ఆదివారాలను ఎంచుకుంటున్నారు. అయితే అంత ఒత్తిడి ఉండదని వారు భావిస్తున్నారు. శని, ఆదివారాల్లో కోర్టులు పనిచేయవు కాబట్టి హైడ్రా తమ పని అప్పటికే కానిచ్చేస్తున్నారు. ఏదేమైనా హైడ్రా అంటేనే ఇప్పుడు జనాలకు గుబులు పట్టుకుంది. వీకెండ్ వస్తుందంటేనే ఎక్కడ వచ్చి పడుతారోననే భయాందోళనలో ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు.
