Let's talk: editor@tmv.in
అందరికీ సమాన న్యాయం అందడమే లక్ష్యం: జస్టిస్ సూర్య కాంత్

అందరికీ సమాన న్యాయం అందడమే లక్ష్యం: జస్టిస్ సూర్య కాంత్

Panthagani Anusha
25 మార్చి, 2026

సమాజంలోని ప్రతి వ్యక్తికి ముఖ్యంగా నిస్సహాయులకు, అట్టడుగు వర్గాలకు న్యాయం సులభంగా, సమానంగా అందుబాటులోకి రావాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్య కాంత్ ఉద్ఘాటించారు. ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (డీఎస్‌ఎల్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో రూపొందించిన పలు న్యాయ సేవా కార్యక్రమాలను సోమవారం ఢిల్లీ హైకోర్టు ఆడిటోరియంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో న్యాయ అవగాహనను బలోపేతం చేయడమే కాకుండా సామాన్యులు ఎటువంటి అవరోధాలు లేకుండా న్యాయ పరిష్కారాలను పొందేలా చూడాల్సిన బాధ్యత అందరిపై పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పారాలీగల్ వాలంటీర్ల కోసం రూపొందించిన 'హ్యాండ్‌బుక్-కమ్-ఫీల్డ్ డైరీ - 2026'ను ఆయన ఆవిష్కరించారు. ఈ డైరీ వాలంటీర్లకు ఒక ఆచరణాత్మక మార్గదర్శిగా ఉపయోగపడుతుందని ఇందులో ఉచిత న్యాయ సహాయం పొందేందుకు అవసరమైన అర్హతలు, మహిళలు,వినియోగదారుల హక్కులకు సంబంధించిన చట్టాలను సరళంగా వివరించినట్లు తెలిపారు. వీటితో పాటు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడం సైబర్ ఫిర్యాదులు ఇవ్వడం అదేవిదంగా ప్రభుత్వం నుంచి పొందే పరిహారాల ప్రక్రియలపై కూడా స్పష్టమైన సమాచారం ఈ డైరీ లో పొందుపరిచినట్లు తెలిపారు.

అదేవిధంగా న్యాయ సేవలను ప్రజారోగ్య వ్యవస్థతో అనుసంధానించే ఒక వినూత్న పైలట్ ప్రాజెక్టుకు కూడా శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గ్రామీణ స్థాయిలో కీలక పాత్ర పోషించే ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలకు పారా లీగల్ వాలంటీర్లుగా శిక్షణ ఇవ్వనున్నారు. వీరు ఇంటింటికీ వెళ్లి ప్రజల్లో చట్టపరమైన అవగాహన కల్పించడంతో పాటు అర్హులైన వారు సంక్షేమ పథకాలు న్యాయ సహాయం పొందేలా తోడ్పాటునందిస్తారు.

అంతేకాకుండా బాధితులకు తక్షణ ఉపశమనం అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్ఎల్ఎస్ఏ ప్రకటించింది. ఇక్కడ నేర బాధితులకు ఉచిత వైద్యంతో పాటు తక్షణ న్యాయ సలహాలు, కౌన్సెలింగ్, పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసే సౌకర్యం కల్పిస్తారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలపై జరిగే నేరాల బాధితులకు ఈ కేంద్రాలు అండగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.వి. సంజయ్ కుమార్, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ఉపాధ్యాయ సహా పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు.