Let's talk: editor@tmv.in
అందరం ఒకే పేజీపై ముందుకు వెళ్తున్నాం: శశిథరూర్

అందరం ఒకే పేజీపై ముందుకు వెళ్తున్నాం: శశిథరూర్

Pinjari Chand
30 జనవరి, 2026

చాలా మంచి, సానుకూల, నిర్మాణాత్మక చర్చ జరిగింది. అందరం ఒకే పేజీపై కలిసి ముందుకు సాగుతున్నామని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో జరిగిన భేటీ అనంతరం కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందించారు. గత వారం కేరళలో జరిగిన కాంగ్రెస్ కీలక సమావేశానికి థరూర్ హాజరు కాకపోవడంతో పార్టీ లోపల విభేదాలున్నాయన్న ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గురువారం పార్లమెంట్‌లోని ఖర్గే కార్యాలయంలో దాదాపు రెండు గంటల పాటు ఈ భేటీ జరిగింది.

నేను ఎప్పుడూ పార్టీతోనే ఉన్నాను

మీడియాతో మాట్లాడిన థరూర్ లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడితో చర్చ జరిగింది. అంతా బాగానే ఉంది. నేను ఎక్కడ ప్రచారం చేయలేదో చెప్పండి? ఎప్పుడూ పార్టీ కోసమే పని చేశానని వ్యాఖ్యానించారు.త్వరలో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి అంశం చర్చకు వచ్చిందా? తాను ఆ రేసులో ఉన్నానా? అన్న ప్రశ్నలకు థరూర్ స్పష్టంగా సమాధానం ఇచ్చారు. ఆ విషయం అసలు చర్చకు రాలేదు. నాకు ఎలాంటి పదవికి అభ్యర్థిగా ఉండాలనే ఆసక్తి లేదు. ప్రస్తుతం నేను ఎంపీగా ఉన్నాను. తిరువనంతపురం ప్రజలు నాపై నమ్మకం ఉంచారు. పార్లమెంట్‌లో వారి ప్రయోజనాలు కాపాడటమే నా పని అని చెప్పారు. ఈ భేటీపై థరూర్ ‘ఎక్స్’ వేదికగా కూడా స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే జీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జీతో విస్తృత అంశాలపై ఆప్యాయమైన, సానుకూల చర్చ జరిగింది. ప్రజల సేవలో ముందుకు సాగేందుకు అందరం ఒకే పేజీపై ఉన్నామని పేర్కొన్నారు.

గత పరిణామాలు

కేరళ అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలపై చర్చించేందుకు జరిగిన ఏఐసీసీ సమావేశానికి థరూర్ హాజరు కాలేదు. అయితే, కోజికోడ్‌లో జరిగిన కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో తన పుస్తకం ‘శ్రీ నారాయణ గురు’పై మాట్లాడాల్సిన ముందస్తు అపాయింట్ మెంట్లు ఉన్నాయని, పార్టీ నాయకత్వానికి ముందుగానే తెలియజేశానని ఆయన చెప్పారు. జనవరి 24న థరూర్, పార్టీతో నాకు కొన్ని అంశాలపై చర్చించాల్సిన విషయాలున్నాయి. అవి నాయకత్వంతోనే మాట్లాడతాను అంటూ వ్యాఖ్యానించడం కూడా చర్చకు దారితీసింది. ఇక, జనవరి 19న కొచ్చిలో జరిగిన కాంగ్రెస్ ‘మహా పంచాయత్’లో రాహుల్ గాంధీ తనను ప్రత్యక్షంగా పలకరించలేదన్న అంశం కూడా వివాదంగా మారింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం అంతర్గత విభేదాలేవీ లేవని, థరూర్‌కు ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయని స్పష్టం చేసింది.