Let's talk: editor@tmv.in
అంతుబట్టని వ్యాధి

అంతుబట్టని వ్యాధి

FL - TRND
12 అక్టోబర్, 2025

పచ్చని చెట్లు, నిశ్శబ్దమైన గాలులు, శాంతంగా కనిపించే జీవితం. కానీ ఆ నిశ్శబ్దంలో ఒక భయంకర రహస్యం దాగి ఉంది. ఆ గ్రామంలో మనిషి 40ఏళ్లు దాటితే అది అద్భుతం. ఇక్కడ కాలం ముందుగానే ఆగిపోతుంది. చిన్న వయసులోనే కాళ్లు బలహీనపడతాయి. శరీరం క్రమంగా కదలకుండా పోతుంది. చివరికి మిగిలేది నొప్పి మాత్రమే. ప్రతి ఇంట్లో నడవలేని శరీరాలు, కాళ్లలో బలం కోల్పోయిన మనుషులు, పసితనం ముగిసే లోపే వృద్ధుల్లా మారిపోయిన ముఖాలు కనిపిస్తాయి. అక్కడ జీవితం నెమ్మదిగా చావుతో పోటీ పడుతోంది. ఎవరూ స్పష్టంగా చెప్పలేని ఒక శాపం ఆ నేలపై ఉందన్న భావన అక్కడి ప్రజలది. అది రోగమా, నీళ్ళలో దాగిన విషమా, లేదా విధి ఆడుతున్న నాటకమో ఎవరికీ తెలియదు. బీహార్‌లోని ముంగేర్ జిల్లాలో ఉన్న దూద్ పానియా గ్రామం గురించే ఇదంతా. ఇంతకీ ఆ గ్రామంలో 40ఏళ్ల తర్వాత జీవితం ఎందుకు ఆగిపోతుంది?

దూద్ పానియా గ్రామంలో ప్రతి ఇంటిలోనూ బాధలే కనిపిస్తాయి. ఒకప్పుడు బలంగా నడిచిన కాళ్లు ఇప్పుడు కదలవు. ఒకప్పుడు అడవికి వెళ్లి కట్టెలు తెచ్చిన చేతులు ఇప్పుడు కదలడం మానేశాయి. చాలా మంది ప్రజలకు మంచమే ప్రపంచం. సంవత్సరాలుగా లేచే శక్తి ఉండదు. ఇంట్లోని భర్త, భార్య, కూతురు, కుమారుడు అందరికి అవే లక్షణాలు. ఇక వీధుల్లో చిన్నపిల్లలు కూడా వృద్ధుల్లా కనిపిస్తున్నారు. ఒకప్పుడు నవ్వులతో నిండిన గ్రామంలో ఇప్పుడు ఏడుపు మాత్రమే ఉంది. ప్రతి నెలా ఎవరో ఒకరు ఈ రహస్య రోగానికి బలి అవుతున్నారు. కాళ్ల నుంచి మొదలయ్యే నొప్పి క్రమంగా మొత్తం శరీరాన్ని బలహీనంగా చేస్తుంది. చివరికి మనిషి మంచంపైనే చివరి శ్వాస తీసుకుంటాడు. ఈ దృశ్యం అక్కడ సర్వసాధారణం అయిపోయింది.

ఇక అక్కడ పుట్టినవారు చిన్నప్పటి నుంచే ఒక నిజాన్ని అంగీకరిస్తున్నారు. వారంతా 40ఏళ్లకు మించి బతకారని ఫిక్స్ అయ్యారు. ఆ వయసు దాటినవారు దేవుళ్ల్లా కనిపిస్తారు. వారు జీవించి ఉన్నంత కాలం గ్రామం వారిని ఒక ఉదాహరణగా చూస్తుంది. డాక్టర్లు ఇప్పటికే చాలాసార్లు గ్రామానికి వచ్చారు. వారు కూడా ఆశ్చర్యపోయారు. ఇంత చిన్న వయసులో ఇంత మందికి ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు. డాక్టర్లు నీటిని పరీక్షించాలని నిర్ణయించారు. ఆ నీటిలో ఏదైనా లోపం ఉందేమో తెలుసుకోవాలని భావించారు. కొంతమంది వైద్యులు ఇది విటమిన్ లేమి కావచ్చని అంటున్నారు. ఇంకొంతమంది ఇది భూగర్భ జలాల ప్రభావమని అంటున్నారు. కానీ నిజమైన కారణం ఇంకా ఎవరికీ తెలియదు. గ్రామస్తులు మాత్రం ఒక్క మాట చెబుతున్నారు. మాకు ఉద్యోగం అవసరం లేదు, మాకు బతకడం అవసరం. మా నీటిని పరీక్షించండి, మా ప్రాణాలను కాపాడండి. ప్రతి ఇంట్లో నడవలేని వృద్ధులు, కాళ్లకు కర్రలతో తిరిగే యువకులు, చిన్న వయసులో వృద్ధుల్లా కనిపించే అమ్మాయిలు. వీరందరూ ఒకే ప్రశ్న అడుగుతున్నారు. మా జీవితం ఇలా ఎందుకు మారిపోయిందని నిలదీస్తున్నారు.

ఇటు దూద్ పానియా రహస్యం ఇంకా పరిష్కారం కాలేదు. నీటిలో సమస్యా, లేదా గాలిలోనే సమస్యా అన్నది ఎవరికీ తెలియదు. ఆ నేలలోనే ఏదైనా దాగి ఉందా అన్నది కూడా ఎవరూ చెప్పడంలేదు. కానీ ఒక రోజు ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందనే ఆశ మాత్రం అక్కడి ప్రజల కళ్లలో ఇంకా మెరుస్తోంది. మరి చూడాలి.. డాక్టర్లు, సైంటిస్టులు ఈ గ్రామాన్ని ఎలా కాపాడతారో అన్నది వెయిట్ అండ్ సీ..!

అంతుబట్టని వ్యాధి - Tholi Paluku