
అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు
ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్టు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.22 లక్షలు విలువైన 12.350 కేజీల వెండి, 44 గ్రామాలు బంగారం, 20 కేజీల ఇత్తడి, 5 కేజీల రాగి బిందె స్వాధీనం చేసుకున్నారు. కళ్యాణదుర్గం రూరల్, యు.పి.ఎస్ పోలీసులు ఈ ముఠాను పట్టుకుని మొత్తం 20 కేసులను చేధించినట్టు జిల్లా ఎస్పీ జగదీష్ చెప్పారు.
వి.మర్రిస్వామి, వి.రాజు, ముచ్చర్లపల్లి శ్రీనివాసులను అరెస్టు చేశారు. ఈ ముగ్గురూ కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వ్యసనాలకు అలవాటుపడి వాటిని తీర్చుకోవడానికి దొంగలుగా మారినట్టు పోలీసులు గుర్తించారు. శనివారం అనంతపురం పోలీస్ కాన్ఫరెన్సు హాలులో జరిగిన మీడియా సమావేశంలో వివరాలను జిల్లా ఎస్పీ జగదీష్ వెల్లడించారు.
నిందితులు ముగ్గురూ స్నేహితులు. పేకాట, తాగుడు తదితర వ్యసానాలకు బానిస అయిన నేపథ్యంలో బాగా అప్పులు చేశారు. అప్పులు తీర్చడానికి దొంగతనాలు మొదలుపెట్టారు. దేవాలయాలు, ఊళ్లకు దూరంగా ఉన్న ఇళ్లు లక్ష్యంగా దొంగతనాలు చేశారు. తద్వార డబ్బులు సంపాదించాలని వ్యూహం పన్నారు. బంగారం, వెండి, ఇత్తడి, రాగి వస్తువులను దొంగతనం చేశారు. కర్ణాటక, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేసినట్టు ఎస్పీ జగదీష్ తెలిపారు.
దొంగలించిన బంగారు, వెండి, ఇత్తడి, రాగి ఆభరణాలను, వస్తువులను విక్రయించి వచ్చిన సొమ్మును జల్సాలకు వాడుకోవాలని పథకం వేశారు. కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబుకు పక్కా సమాచారం అందడంతో కళ్యాణదుర్గం రూరల్, రూరల్ యు.పి.ఎస్ సి.ఐలు నీలకంఠేశ్వర, వంశీకృష్ణల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. శనివారం ఉదయం కుర్లపల్లి క్రాస్ వద్ద ఈ ముగ్గుర్ని అరెస్టు చేశారు. ఈ ముగ్గురు కూడా పాత నేరస్తులు.
కర్నాటకలోని హిరియూర్, అబ్బినహాళ్, చెళ్లికెర పోలీసు స్టేషన్లలో దొంగతనం కేసులు, జిల్లాలోని శెట్టూరు, కళ్యాణదుర్గం రూరల్ యు.పి.ఎస్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇది వరకే లిక్కర్, గ్యాంబ్లింగ్ కేసులు ఉన్నాయి. కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు పర్యవేక్షణలో చాకచక్యంగా అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్న కళ్యాణదుర్గం రూరల్, రూరల్ యు.పి.ఎస్ సి.ఐలు నీలకంఠేశ్వర, వంశీకృష్ణల బృందాలను జిల్లా ఎస్పీ పి.జగదీష్ అభినందించారు.
