Let's talk: editor@tmv.in
అంతర్జాతీయ సైబర్ నేర ముఠా గుట్టు రట్టు

అంతర్జాతీయ సైబర్ నేర ముఠా గుట్టు రట్టు

Panthagani Anusha
28 డిసెంబర్, 2025

సిమ్ బాక్స్ టెక్నాలజీని ఆయుధంగా మార్చుకుని దేశవ్యాప్తంగా కోట్ల రూపాయల టెలికాం మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ సైబర్ నేర ముఠాను ఆంధ్రప్రదేశ్ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఫిర్యాదు ఆధారంగా చేపట్టిన దర్యాప్తులో, ఈ ముఠా కారణంగా కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే సుమారు రూ.20 కోట్ల మేర నష్టం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు.

సైబర్ క్రైమ్ ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా వెల్లడించిన వివరాల ప్రకారం, దక్షిణాసియా దేశాలైన వియత్నాం, మయన్మార్, కంబోడియా, లావోస్, థాయిలాండ్, మలేషియా తదితర ప్రాంతాల నుంచి ఇంటర్నెట్ ఆధారిత వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ కాల్స్‌ను భారత్‌లో ఏర్పాటు చేసిన సిమ్ బాక్స్‌ల ద్వారా స్థానిక కాల్స్‌లా మార్చి ప్రజలను మోసం చేశారు. విదేశాల నుంచి వచ్చిన కాల్స్ కూడా దేశీయ నంబర్ల నుంచి వచ్చినట్టుగా కనిపించడంతో బాధితులు నమ్మి మోసపోయినట్లు పోలీసులు తెలిపారు.

కేసు ఎలా వెలుగులోకి వచ్చిందంటే

ఈ ముఠా కార్యకలాపాలు కొన్ని నెలల క్రితం విశాఖపట్నంలోని గాజువాక–పెదగంట్యాడ ప్రాంతాల్లో అనుమానాస్పద కాల్ ట్రాఫిక్ పెరగడంతో వెలుగులోకి వచ్చాయి. ఈ విషయంపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కు చెందిన సంచార్ సాథీ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదుకాగా ప్రాథమిక పరిశీలనలో ఇది సిమ్ బాక్స్ ఆధారిత మోసమని గుర్తించిన టెలికాం అధికారులు కేసును ఆంధ్రప్రదేశ్ సీఐడీకి అప్పగించారు.

సీఐడీ చేపట్టిన దర్యాప్తులో నిందితులు నకిలీ పేర్లు, తాత్కాలిక చిరునామాలతో కొరియర్ సేవల ద్వారా సిమ్ బాక్స్ పరికరాలను తెప్పించి పలు రాష్ట్రాల్లో అద్దె ఇళ్లను కేంద్రాలుగా మార్చి కార్యకలాపాలు నిర్వహించినట్లు తేలింది. విదేశాల్లో ఉన్న ముఠా సభ్యులు టెలిగ్రామ్, వాట్సాప్ వంటి యాప్‌ల ద్వారా సూచనలు ఇస్తూ భారత్‌లోని స్థానిక వ్యక్తులతో కలిసి మోసాలకు పాల్పడ్డారని అధికారులు వెల్లడించారు.

ఈ సమాచారం ఆధారంగా విశాఖపట్నం, హైదరాబాద్‌తో పాటు ఒడిశాలోని రౌర్కెలా, బిహార్‌లోని నలంద, గోవాలోని అరంబోల్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ప్రాంతాల్లో ఒకేసారి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక వియత్నాం పౌరుడితో సహా ఇద్దరు విదేశీయులు, స్థానిక హ్యాండ్లర్లు, సిమ్ కార్డు సరఫరాదారులు, పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లుగా వ్యవహరించిన వ్యక్తులు కలిపి మొత్తం 20 మందిని అరెస్ట్ చేశారు.

నిందితుల నుంచి 14 సిమ్ బాక్స్‌లు, 1,500కు పైగా అక్రమ సిమ్ కార్డులు, 22 మొబైల్ ఫోన్లు, 8 రౌటర్లు, 7 సీసీ కెమెరాలు, ల్యాప్‌టాప్, యూపీఎస్ పరికరాలు, ఇన్వర్టర్, మానిట ర్ తదితర ఎలక్ట్రానిక్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పూర్తిస్థాయి సాంకేతిక విశ్లేషణ మిగిలి ఉండటంతో మొత్తం ఆర్థిక నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

అరెస్టైన విదేశీయులు స్థానిక ఆపరేటర్లకు సిమ్ బాక్స్ పరికరాల వినియోగంపై శిక్షణ ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. అదేవిధంగా ఈ-కేవైసీ ప్రక్రియలో లోపాలున్నాయని చెబుతూ వివరాలు సరిచేస్తున్నామనే ముసుగులో అదనపు సిమ్ కార్డులు పొందినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో విదేశాల నుంచి నిధులు, లాజిస్టిక్ సహకారం అందినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో డబ్బు లావాదేవీలు ఇతర అనుబంధ నెట్‌వర్క్‌లపై సీఐడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. సిమ్ బాక్స్ మోసాలపై ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి అక్రమ కార్యకలాపాలను ఏమాత్రం ఉపేక్షించబోమని పోలీసులు స్పష్టం చేశారు.

సిమ్ బాక్స్ టెక్నాలజీ అంటే ఏమిటి?

సిమ్ బాక్స్ టెక్నాలజీ అనేది విదేశాల నుంచి వచ్చే కాల్‌ను మన దేశం నుంచి వచ్చిన కాల్‌లా మార్చే ఒక పరికరం. ఇంటర్నెట్ ద్వారా వచ్చిన అంతర్జాతీయ కాల్‌ను ఇందులో ఉన్న భారతీయ సిమ్ కార్డు ద్వారా బయటకు పంపిస్తారు. దీంతో కాల్ లోకల్ నెంబర్ నుంచి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఈ పద్ధతిని మోసగాళ్లు ప్రజలను మోసం చేయడానికి ఉపయోగిస్తున్నారు.

అంతర్జాతీయ సైబర్ నేర ముఠా గుట్టు రట్టు - Tholi Paluku