Let's talk: editor@tmv.in
అంతర్జాతీయ సంరక్షణ మరియు మద్దతు దినోత్సవం

అంతర్జాతీయ సంరక్షణ మరియు మద్దతు దినోత్సవం

Dantu Vijaya Lakshmi Prasanna
29 అక్టోబర్, 2025

సంరక్షణ అనే పదంలో ప్రేమ, జాలి, మమకారం దాగి ఉన్నాయి. మన తల్లిదండ్రులు చిన్నప్పుడు మన కోసం చూపిన శ్రద్ధ, పెద్దయ్యాక వృద్ధాప్యంలో వారికి ఇవ్వాల్సిన ఆదరణ, ఇవన్నీ జీవన చక్రంలో అంతర్భాగాలు. మనలో ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరో ఒకరు మన కోసం నిరంతరం త్యాగం చేస్తుంటారు. వారి ఆప్యాయత, ప్రేమ మనిషితనానికి మూలం. ఈ దినోత్సవం ఆ నిస్వార్థ సేవను గుర్తుచేస్తూ, "సంరక్షించే చేతులు – సమాజానికి శక్తి" అని మన మనసులను మెల్లగా తాకుతుంది.

సమాజం బలపడాలంటే సంరక్షణ విలువలు బలపడాలి. ఆర్థిక వ్యవస్థలు మారినా, సాంకేతికత పెరిగినా, మానవ సంబంధాలను కాపాడేది సంరక్షణే. ఒక తల్లి చేతుల్లోని బిడ్డ భద్రత, ఒక నర్సు సేవలోని మమకారం, ఒక ఉపాధ్యాయుడి దారిదీపమయిన సహనం, ఇవన్నీ మానవతా సంస్కృతికి ప్రాణం. ఈ రోజు మనం మన చుట్టూ ఉన్న సంరక్షణ కార్మికులను గుర్తించి వారికి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే వారి కష్టమే మన సమాజపు హృదయ స్పందన. ఆ చేతులు లేకపోతే మన బతుకు సమతుల్యం కోల్పోతుంది. ప్రతి సంరక్షకుడి కృషిని గౌరవించడం ద్వారా మనం సమానత్వాన్ని, సానుభూతిని, మానవత్వాన్ని సంరక్షిస్తాం. ఆ చేతులు వంగి కష్టపడితేనే, మన సమాజం నిలబడుతుంది.

సంరక్షించే చేతులు – సమాజానికి శక్తి.

మన మానవతకు ముద్ర వేసే ఆ చేతులకే మన ప్రణామం.

మనిషి జీవితంలో ప్రేమ, జాలి, పరస్పర సహకారం అనేవి అత్యంత విలువైన గుణాలు. ఈ విలువలను గుర్తు చేసుకోవడానికే ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం అక్టోబర్ 29న “అంతర్జాతీయ సంరక్షణ, మద్దతు దినోత్సవం”గా నిర్వహిస్తోంది. ఈ రోజు మన సమాజంలోని సంరక్షణ కార్మికుల కృషిని గౌరవించడమే కాకుండా, వారికీ గౌరవప్రదమైన జీవన ప్రమాణాలు అందించాలనే సందేశాన్ని ఇస్తుంది.

సంయుక్త జాతుల అసెంబ్లీ తీర్మానం

యుఎన్ జనరల్ అసెంబ్లీ 29 అక్టోబర్‌ను “అంతర్జాతీయ సంరక్షణ మరియు మద్దతు దినోత్సవం”గా ప్రకటించింది. దీని ప్రధాన ఉద్దేశం, సంరక్షణ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెట్టడం. లింగ సమానత్వం, వికలాంగులకు, వృద్ధులకు, ప్రతి వయస్సు వారికి గౌరవప్రదమైన మద్దతు వ్యవస్థలను ఏర్పాటు చేయడం. చెల్లింపులేని సంరక్షణ పనికి విలువ ఇవ్వడం. సంరక్షణ పనులపై ఉన్న లింగ వివక్ష, వర్గ వివక్ష, వయస్సు లేదా వలస సంబంధిత పక్షపాతాలను తొలగించడం.

2025 కార్యక్రమం

• అక్టోబర్ 29, 2025

స్థలం:జెనీవా, స్విట్జర్లాండ్

నిర్వాహకులు:యుఎన్ ఉమెన్, ఐఎల్‌ఓ, ఓహెచ్‌సిహెచ్‌ఆర్

2025 వేడుకల ప్రధాన లక్ష్యం

ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా సంరక్షణ రంగంలో జరుగుతున్న చర్యలను కలిపి, లింగ సమానత్వ దిశగా పురోగతిని విశ్లేషిస్తుంది. మహిళలు, ఉద్యోగదాతలు, కార్మిక సంఘాలు, వివిధ హక్కుదారుల అభిప్రాయాలను సమీక్షిస్తుంది. లింగ సమానత్వం సాధనకు సాధించిన పురోగతిని, లోటుపాట్లను విశ్లేషిస్తుంది

అంతర్జాతీయ దినోత్సవాలను ఎందుకు జరుపుకుంటాం

ఇలాంటి రోజులు ప్రజల్లో అవగాహన పెంచడానికి, ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడానికి, ప్రపంచ సమస్యలపై దృష్టి పెట్టడానికి, మనిషి సాధనలను గుర్తించడానికి యునైటెడ్ నేషన్స్ జరుపుతుంది.

మీకు తెలుసా ?

సంరక్షణ రంగంలో మహిళల పాత్ర

ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య, విద్య, గృహసేవల వంటి సంరక్షణ రంగాలలో మహిళలే ప్రధాన శక్తి. అయితే వారు ఇతర రంగాలతో పోలిస్తే తక్కువ వేతనం పొందుతున్నారు. ఐఎల్‌ఓ ఇంటర్ నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం, ఈ రంగంలో మహిళలు పురుషుల కంటే సగటున 24% తక్కువ వేతనం పొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 249 మిలియన్ మహిళలు , 132 మిలియన్ పురుషులు ఈ రంగంలో పనిచేస్తున్నారు. మహిళలు చెల్లింపులేని సంరక్షణ పనిలో పురుషుల కంటే 3.2 రెట్లు ఎక్కువ సమయం ఖర్చు చేస్తున్నారు. ఇది వారి ఆర్థిక స్వావలంబనకు అడ్డంకిగా మారుతోంది.

సంరక్షణ రంగం ఆర్థిక వ్యవస్థ ప్రాధాన్యం

సంరక్షణ రంగం అనేది కేవలం సేవ కాకుండా, సామాజిక అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి పునాదిగా ఉంటుంది. పిల్లలు, వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు వంటి లక్షలాది మందికి మానవతా మద్దతు అందించేది ఈ రంగమే. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో ఉద్యోగాల అవసరం రోజురోజుకీ పెరుగుతోంది. కానీ ఇంకా తక్కువ వేతనాలు, భద్రతా లోపం, మానసిక ఒత్తిడులు వంటి సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

సంరక్షణే మానవత యొక్క ప్రాణం, ఆ సంరక్షణకారిణీ చేతులు ప్రపంచాన్ని నిలబెడతాయి.

సంరక్షణ ఆర్థిక వ్యవస్థ

సంరక్షణ పనులు - చెల్లింపుతోనైనా లేదా ఉచితంగానైనా మహిళలకైనా ,పురుషులకైనా మంచి భవిష్యత్తు ఇవ్వగల ఉద్యోగo కీలకం. పెరుగుతున్న జనాభా, వృద్ధాప్య సమాజాలు, కుటుంబ వ్యవస్థల మార్పులు, మహిళల ఉద్యోగ పెరుగుదల , సామాజిక విధానాల లోపాలు మొదలైనవి, ప్రభుత్వాలు, యజమానులు, కార్మిక సంఘాల, పౌరులందరూ కలసి ఈ వ్యవస్థలో తీసుకోవలసిన చర్య ల అవసరాన్ని తెలియజేస్తున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించకపోతే, సంరక్షణ సేవల లోపం, నాణ్యత లోపం కారణంగా తీవ్రమైన గ్లోబల్ సంక్షోభం ఉత్పన్నమవుతుంది . లింగ అసమానతలు మరింత పెరుగుతాయి.

సంరక్షణ పనులు రెండు విభాగాలుగా ఉంటాయి

ప్రత్యక్ష సంరక్షణ: బిడ్డకు ఆహారం పెట్టడం, అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని చూసుకోవడం వంటి వ్యక్తిగత సేవలు.

పరోక్ష సంరక్షణ: వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం వంటి కార్యకలాపాలు.

చెల్లింపులేని సంరక్షణ పనిఅంటే డబ్బు లేకుండా ఇంట్లో చేసే సేవలు చేయడం. చెల్లింపుతో చేసే సంరక్షణ పని అంటే నర్సులు, డాక్టర్లు, ఉపాధ్యాయులు, గృహ సేవకులు వంటి వృత్తిపరమైన సంరక్షణ కార్మికులు చేసే పని.

ఆరోగ్య, సంరక్షణ రంగంలోని మహిళలు

ఆరోగ్య, సంరక్షణ రంగాలలో పనిచేసే మహిళలు ఇతర రంగాలతో పోలిస్తే ఎక్కువ లింగ వేతన తేడాను ఎదుర్కొంటున్నారు. వారు సగటున తమ పురుష సహచరుల కంటే 24 శాతం తక్కువ వేతనం పొందుతున్నారు. ఆరోగ్య మరియు సంరక్షణ రంగంలోని మహిళల పరిస్థితి సమాజంలోని లింగ అసమానతలకు ప్రతిబింబం. ఈ రంగం మానవ సేవకు ప్రతీక అయినప్పటికీ, దీనిలో పనిచేసే మహిళల జీవితం మాత్రం అనేక సవాళ్లతో నిండి ఉంటుంది. ఆస్పత్రులు, వృద్ధాశ్రమాలు, గృహ సంరక్షణ కేంద్రాలు, బాల సంరక్షణ సంస్థలు వంటి చోట్ల మహిళలే ప్రధాన శక్తిగా పనిచేస్తున్నారు. కానీ, అదే సేవకు పురుషులు పొందే వేతనంతో పోలిస్తే మహిళలు తక్కువ వేతనం పొందుతున్నారు. ఇది కేవలం సంఖ్య కాదు. ఇది వారి శ్రమకు, నిబద్ధతకు, మానవతా సేవకు ఇవ్వబడుతున్న తక్కువ విలువకు నిదర్శనం.

ఈ రంగంలోని మహిళలు నిరంతరం ఒత్తిడిలో పనిచేస్తారు. రాత్రి పగలు తేడా లేకుండా విధులు నిర్వర్తిస్తూ, రోగుల బాధను తాము అనుభవిస్తూ, కుటుంబం బాధ్యతలతో కూడిన సమతుల్యం సాధించాల్సి వస్తుంది. అయితే, ఈ కష్టం వారికి గౌరవప్రదమైన పారితోషికం లేదా భద్రతా హామీగా మారడం లేదు. లింగ ఆధారిత వివక్ష, పదోన్నతులలో పాక్షికత, శ్రమ గుర్తింపులో లోపం వంటి అంశాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

అదనంగా, మహిళలు సంరక్షణ రంగంలో చెల్లింపులేని పనుల భారాన్ని కూడా మోస్తున్నారు. ఇంట్లో వృద్ధుల సంరక్షణ, పిల్లల సంరక్షణ, కుటుంబ ఆరోగ్యం చూసుకోవడం వంటి పనులు ఆర్థిక లెక్కల్లో కనిపించకపోయినా, సమాజం నిలబడే బలమైన పునాదులే. ఈ అదనపు భారం కారణంగా, అనేక మహిళలు పూర్తి కాల ఉద్యోగాలకంటే అర్ధకాలిక లేదా తాత్కాలిక పనులను ఎంచుకోవాల్సి వస్తుంది. ఫలితంగా వారి ఆదాయం తగ్గిపోతుంది, ఆర్థిక స్వావలంబన దెబ్బతింటుంది.

ఈ పరిస్థితిని మార్చాలంటే, సంరక్షణ రంగంలో మహిళలకు సమాన వేతనం, భద్రత, గౌరవం లభించాలి. వారి సేవను "కారుణ్యపూరిత బాధ్యత"గా కాకుండా, "సామాజిక అభివృద్ధికి కీలకమైన వృత్తి"గా చూడాలి. ప్రభుత్వాలు, సంస్థలు, ప్రజలు కలసి ఈ రంగాన్ని సమానత్వం, గౌరవం, ఆర్థిక స్థిరత్వం దిశగా తీసుకెళ్లాలి.

సంరక్షణ రంగంలో సమస్యలు, అవకాశాలు

ప్రపంచవ్యాప్తంగా పిల్లల, వృద్ధుల సంరక్షణ అవసరం పెరుగుతోంది. దీనివల్ల అనేక ఉద్యోగాలు సృష్టించబడతాయి. అయితే, ఈ రంగంలో పనిచేసేవారు తక్కువ వేతనాలు, ప్రయోజనాల లోపం, మానసిక, శారీరక, లైంగిక హానులకు గురవుతున్నారు. అందువల్ల, సంరక్షణ విధానాలు, సేవల రూపకల్పనతో పాటు ఈ రంగంలోని పనివారికి గౌరవప్రదమైన వేతనాలు, భద్రత, హక్కులు కల్పించాలి.

సంరక్షించే చేతులు - సమాజానికి శక్తి. ఈ దినోత్సవం మనకు అందించే సందేశం ఇదే. పిల్లల సంరక్షణ నుంచి వృద్ధులను ఆదరించే వరకు ప్రతి పని మన సమాజాన్ని బలపరుస్తుంది. సంరక్షణ పనిని కేవలం బాధ్యతగా కాకుండా, మానవత్వపు విలువగా మనందరం గుర్తించాలి. అప్పుడు మాత్రమే సమానత్వం, గౌరవం, అభివృద్ధి కలసి నడుస్తాయి.