
అంతర్జాతీయ వేదికపై నిరసనలా? దేశ ప్రతిష్టను దిగజార్చొద్దు: వైఎస్ జగన్
దేశ రాజధానిలోని భారత్ మండపంలో జరిగిన 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన నిరసనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొన్న వేదికపై ఇటువంటి చర్యలు దేశానికే అవమానకరమని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఆయన (ట్విట్టర్) వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు.
రాజకీయాలు ఎటు వెళ్తున్నాయి?
"నిన్నటి ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ తీరు మనందరినీ సిగ్గుపడేలా చేసింది. అసలు మన రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయి? రాజకీయ ప్రయోజనాల కోసం దేశ గౌరవాన్ని ఎవరూ కించపరచకూడదు" అని జగన్ స్పష్టం చేశారు. మన మధ్య ఎన్ని రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ ప్రపంచ దేశాల ముందు భారత్ ఒక ఐక్య దేశంగా నిలబడాలని ఆ స్ఫూర్తిని దెబ్బతీయడం సరికాదని ఆయన హితవు పలికారు. ప్రపంచ వేదికలపై భారత ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన గుర్తు చేశారు.
అసలేం జరిగింది?
శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఏఐ శిఖరాగ్ర సమావేశంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇండియన్ యూత్ కాంగ్రెస్ (IYC)కు చెందిన కొందరు కార్యకర్తలు సమావేశ ప్రాంగణంలోకి చొరబడి, తమ చొక్కాలను విప్పి నిరసన తెలిపారు. ప్రధాని మోదీ ఏఐ కార్యక్రమంలో దేశ గుర్తింపును తాకట్టు పెట్టారని ఆరోపిస్తూ వారు నినాదాలు చేశారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుని వెలుపలికి తరలించారు.
పోలీసు కస్టడీలో నలుగురు కార్యకర్తలు
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఢిల్లీ పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి శనివారం పాటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితులు కృష్ణ హరి, కుందన్ యాదవ్, అజయ్ కుమార్, నరసింహ యాదవ్‌లను ఐదు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. అంతర్జాతీయ ప్రతినిధుల సమక్షంలో దేశ వ్యతిరేక నినాదాలు చేస్తూ భద్రతా ఉల్లంఘనకు పాల్పడ్డారని పోలీసులు కోర్టుకు నివేదించారు.
దేశవ్యాప్తంగా బీజేపీ నిరసనలు
మరోవైపు భారత్ మండపం వద్ద కాంగ్రెస్ శ్రేణుల ప్రవర్తనను నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. అంతర్జాతీయ వేదికపై దేశ పరువు తీశారంటూ పలు రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించడంతో ఈ ఉదంతం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.
