
అంతర్జాతీయ వుషూ ఛాంపియన్‌షిప్‌లో బీఎస్ఎఫ్ జవాన్‌కు రజతం
దేశ సరిహద్దులను కాపాడే సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కానిస్టేబుల్ దుర్గేశ్వర్ సింగ్, ఇప్పుడు క్రీడా రంగంలోనూ దేశానికి గర్వకారణంగా నిలిచారు. గ్రీస్ రాజధాని ఏథెన్స్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక '6వ అక్రోపోలిస్ ఇంటర్నేషనల్ వుషూ ఛాంపియన్‌షిప్'లో ఆయన అద్భుత ప్రదర్శన కనబరిచి రజత పతకాన్ని ముద్దాడారు. అత్యంత క్లిష్టమైన 90 కేజీల విభాగంలో పోటీపడిన దుర్గేశ్వర్, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుల నుంచి ఎదురైన గట్టి పోటీని తట్టుకుని వెండి పతకాన్ని కైవసం చేసుకున్నారు.
ఈ నెల 13 నుంచి 15 వరకు జరిగిన ఈ మెగా టోర్నీలో భారత్ సహా దాదాపు 19 దేశాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. మొత్తం 1,100 మందికి పైగా అథ్లెట్లు ఈ పోటీల్లో తలపడగా, వారిని అధిగమించి దుర్గేశ్వర్ సింగ్ పతక పీఠాన్ని అధిరోహించడం విశేషం. వృత్తిరీత్యా దేశ రక్షణలో ఉంటూనే, క్రీడల్లో తనలోని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుని అంతర్జాతీయ స్థాయిలో పథకం సాధించిన దుర్గేశ్వర్‌ను బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు, క్రీడాభిమానులు అభినందిస్తున్నారు.
