
అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠా గుట్టు రట్టు
దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో మత్తుమందుల తయారీ, సరఫరా చేస్తున్న ఒక భారీ అంతర్జాతీయ ముఠా గుట్టును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) రట్టు చేసింది. అక్టోబరు 21 నుంచి 23 వరకు వివిధ ప్రభుత్వ విభాగాల సహకారంతో డీఆర్‌ఐ నిర్వహించిన సమన్వయ దాడులలో భారీగా మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుని, 26 మంది విదేశీయులను అరెస్టు చేసింది.
ముఠా స్థావరాలపై దాడులు: ఈ నెట్‌వర్క్‌పై అందిన నిర్దిష్ట సమాచారం మేరకు డీఆర్‌ఐ అధికారులు పకడ్బందీ నిఘా ప్రణాళికతో దాడులు నిర్వహించారు.
గ్రేటర్ నోయిడాలో తయారీ స్థావరం: గ్రేటర్ నోయిడాలోని బహుళ అంతస్తుల భవనాల నడుమ ఉన్న నిర్మానుష్య వ్యవసాయ క్షేత్రంలో మెథాంఫిటమైన్ తయారీ స్థావరాన్ని గుర్తించారు. ఈ స్థావరంపై దాడి చేసి 11.40 కిలోల యాంఫిటమైన్, దాని తయారీలో ఉపయోగించే 110.923 కిలోల రసాయన పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
ముఠా నాయకుడి అరెస్టు: ఈ ముఠా ప్రధాన నిర్వాహకుడిని గురుగ్రామ్‌లోని అతని నివాసంలో అరెస్టు చేయడంతో పాటు అతడి నుంచి 1.33 కిలోల యాంఫిటమైన్‌ను పట్టుకున్నారు.
పశ్చిమ ఢిల్లీలో నిల్వ కేంద్రం: దాడులలో లభించిన ఆధారాలతో పశ్చిమ ఢిల్లీలో నిషిద్ధ వస్తువుల నిల్వ, సరఫరాకు ఉపయోగిస్తున్న మరొక భవనాన్ని డీఆర్‌ఐ అధికారులు గుర్తించారు. ఇరుకైన దారులు, జనసాంద్రత గల ఈ ప్రాంతంలో అధికారులను కొందరు దుండగులు అడ్డుకుని, ప్రతిఘటించినప్పటికీ, ఢిల్లీ పోలీసు బృందంతో కలిసి సంయుక్తంగా ఆ ప్రాంగణాన్ని అదుపులోకి తీసుకుని తనిఖీలను పూర్తిచేశారు.
భారీగా డ్రగ్స్, నగదు స్వాధీనం
ఈ ఆపరేషన్‌లో భాగంగా పశ్చిమ ఢిల్లీలోని నిల్వ కేంద్రం నుంచి పలువురిని అరెస్టు చేసి, 7.79 కిలోల కొకైన్, 1.87 కిలోల హెరాయిన్, 3.54 కిలోల యాంఫిటమైన్, 2 కిలోల గంజాయి, 0.15 కిలోల మెథాక్వాలోన్, 4.50 కిలోల మత్తుమందు తయారీ రసాయనాలతో సహా మాదకద్రవ్యాల అక్రమ సరఫరా మార్గంలో ఆర్జించినట్లు భావిస్తున్న ₹37 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ విలువ
రెండు చోట్ల దాడులలో పట్టుబడిన మొత్తం 16.27 కిలోల యాంఫిటమైన్, 7.9 కిలోల కొకైన్, 1.8 కిలోల హెరాయిన్, 2.13 కిలోల గంజాయి, 115.42 కిలోల రసాయనాల అంతర్జాతీయ మార్కెట్‌లో విలువ సుమారు ₹108.81 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
దర్యాప్తు ముమ్మరం
వివిధ ప్రభుత్వ విభాగాలు ఎంతో సమన్వయంతో ఈ సంక్లిష్ట ఆపరేషన్‌ను విజయవంతం చేశాయి. మత్తుమందుల అక్రమ తయారీ-సరఫరా ముప్పును ఎదుర్కొనడంలో డీఆర్‌ఐ దృఢ సంకల్పానికి ఈ దాడులు నిదర్శనం. ఈ ఉదంతంపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.
