
అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ రేసులో భారత సంతతి రచయిత్రి పద్మా విశ్వనాథన్
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సాహిత్య పురస్కారం 'అంతర్జాతీయ బుకర్ ప్రైజ్-2026' తుది జాబితాలో భారత సంతతికి చెందిన రచయిత్రి, అనువాదకురాలు పద్మా విశ్వనాథన్ చోటు సంపాదించుకున్నారు. బ్రెజిల్ రచయిత్రి అనా పౌలా మయా పోర్చుగీస్ భాషలో రాసిన "ఆన్ ఎర్త్ యాస్ ఇట్ ఈస్ బినీత్" (On Earth As It Is Beneath) అనే నవలను ఆమె ఆంగ్లంలోకి అనువదించారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అనేక కృతులలో కేవలం ఆరు పుస్తకాలను మాత్రమే జడ్జీల ప్యానెల్ షార్ట్‌లిస్ట్ చేయగా, అందులో పద్మా విశ్వనాథన్ అనువాదం ఉండటం విశేషం.
హృదయాన్ని హత్తుకునే కథాంశం
బ్రెజిల్‌లోని ఒక మారుమూల జైలు (పెనాల్ కాలనీ) నేపథ్యంలో ఈ నవల సాగుతుంది. అక్కడ న్యాయానికి, క్రూరత్వానికి మధ్య ఉండే సన్నని గీత ఎలా చెరిగిపోతుందనే అంశాన్ని రచయిత్రి అనా పౌలా అద్భుతంగా చిత్రించారు. "అధికారం, క్రూరత్వం, మనుషుల మధ్య ఉండే సంబంధాల చుట్టూ తిరిగే ఈ కథ ఒక చీకటి నీతి కథలా అనిపిస్తుంది" అని ప్రఖ్యాత భారతీయ కాలమిస్ట్ నీలాంజన రాయ్ సభ్యురాలిగా ఉన్న జడ్జీల ప్యానెల్ కొనియాడింది.
అవార్డు విశేషాలు
ఈ ప్రతిష్టాత్మక పురస్కారం కింద విజేతకు 50,000 పౌండ్ల (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 60 లక్షలు) నగదు అందుతుంది. ఈ మొత్తాన్ని రచయిత, అనువాదకుడు సమానంగా పంచుకుంటారు. ప్రస్తుతం షార్ట్‌లిస్ట్‌లో ఉన్న ప్రతి పుస్తకానికి 5,000 పౌండ్ల నగదు బహుమతి లభిస్తుంది. ఈ ఏడాది మే 19న లండన్‌లోని టేట్ మోడ్రన్‌లో జరిగే వేడుకలో విజేతను ప్రకటిస్తారు. ఈ ఏడాది తుది జాబితాలో మహిళల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.
పద్మా విశ్వనాథన్ ఎవరు?
పద్మా విశ్వనాథన్ భారత సంతతికి చెందిన కెనడియన్-అమెరికన్ రచయిత్రి. 58 ఏళ్ల పద్మ ప్రస్తుతం అమెరికాలోని అర్కాన్సాస్-ఫాయెట్‌విల్లే విశ్వవిద్యాలయంలో క్రియేటివ్ రైటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె కేవలం అనువాదకురాలే కాకుండా సిద్ధహస్తురాలైన నాటకకర్త, నవలా రచయిత్రి కూడా. ఆమె రాసిన నవలలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది దేశాల్లో ప్రచురితమయ్యాయి. వివిధ భాషల్లోని సాహిత్యాన్ని ఆంగ్ల పాఠకులకు చేరవేయడంలో ఆమె విశేష కృషి చేస్తున్నారు.
బుకర్ ప్రైజ్ నేపథ్యం
ప్రపంచవ్యాప్తంగా రచయితలకు ఇచ్చే అత్యంత గౌరవప్రదమైన అవార్డులలో 'బుకర్ ప్రైజ్' ఒకటి. ఇది ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది, నేరుగా ఇంగ్లీష్ భాషలో రాసిన నవలలకు ఇచ్చే 'బుకర్ ప్రైజ్'. రెండోది, ప్రపంచంలోని ఏ ఇతర భాషలోనైనా రాసి, దానిని ఇంగ్లీష్‌లోకి అనువదించిన పుస్తకాలకు ఇచ్చే 'ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్'. మంచి కథలను అందించే రచయితలను ప్రోత్సహించడంతో పాటు, ఒక భాషలోని గొప్ప సాహిత్యాన్ని మరో భాషలోకి మార్చే అనువాదకులకు గుర్తింపు ఇవ్వడమే ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశం.
బుకర్ గెలిచిన భారతీయులు వీరే..
ప్రపంచ సాహితీ వేదికపై ఇప్పటివరకు మొత్తం ఏడుగురు భారతీయులు, భారత సంతతి వ్యక్తులు ‘బుకర్’ గౌరవాన్ని అందుకున్నారు. వీరిలో నేరుగా ఆంగ్లంలో రాసిన నవలలకు ఇచ్చే 'బుకర్ ప్రైజ్'ను వి.ఎస్. నైపాల్ (1971), సల్మాన్ రష్దీ (1981), అరుంధతి రాయ్ (1997), కిరణ్ దేశాయ్ (2006), అరవింద్ అడిగా (2008) గెలుచుకున్నారు. ఇక ఇతర భాషల నుండి ఆంగ్లంలోకి అనువదించిన పుస్తకాలకు ఇచ్చే 'ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్' విభాగంలో 2022లో గీతాంజలి శ్రీ ('టూంబ్ ఆఫ్ సాండ్' నవలకు) విజేతగా నిలవగా, 2025లో కన్నడ రచయిత్రి భాను ముస్తాక్, అనువాదకురాలు దీపా భస్తీ తమ 'హార్ట్ ల్యాంప్' కథా సంపుటికి గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నారు. కన్నడ నుంచి అనువదించబడిన ఈ పుస్తకం గతేడాది లండన్‌లో విశేష ఆదరణ పొంది సంచలనం సృష్టించింది.
