
అంతర్జాతీయ బాలికా దినోత్సవం
పుట్టిన ప్రతీ ఆడపిల్ల ఒక కుటుంబంలో ఆనందపు కిరణం, ప్రేమకు ప్రతిరూపం.
ఆమె నవ్వులో సంతోషం, ఆమె కళ్లలో స్వప్నం, ఆమె మనసులో దయ దాగి ఉంటుంది.
బాలిక కేవలం కుటుంబ సభ్యురాలు కాదు. ఆమె ఒక భవిష్యత్ తల్లి, ఉపాధ్యాయురాలు, నాయకురాలు, సృష్టికర్త ఆమె ఉన్నచోట సౌందర్యం, సానుభూతి, స్ఫూర్తి , శాంతి సహజంగానే విరుస్తాయి.ఆడపిల్ల పుట్టడం అంటే ఇంట్లో అదృష్టం అడుగుపెట్టినట్లే. ఆమె చదువుకుంటే కుటుంబం ఎదుగుతుంది . ఆమె ఉద్యోగం పొందితే ఆర్థిక స్థిరత్వం వస్తుంది. ఆమె ధైర్యంగా నిలిస్తే సమాజం మారుతుంది. బాలిక అంటే ఒక దిశ, ఒక దృక్పథం. ఆమెలో మమకారం ఉంటుంది, మానవత్వం ఉంటుంది, మనోబలం ఉంటుంది.
ఇప్పటికీ ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో బాలికలు విద్యా అవకాశాల లోపం, చిన్న వయసులో వివాహాలు, లింగ వివక్ష, భద్రత సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు ఆమె స్వప్నాలు సమాజపు సంకెళ్లలో చిక్కుకుంటాయి. కానీ, ఈ సమస్యలను ఎదుర్కొని వెలుగులోకి వస్తున్న బాలికలు నేటి సమాజానికి నిజమైన స్ఫూర్తి.
బాలికా దినోత్సవం ఆవిర్భావం
ప్రతి సంవత్సరం అక్టోబర్ 11న “అంతర్జాతీయ బాలికా దినోత్సవం” (International Day of the Girl Child) ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి 2012లో ప్రారంభించింది. దీని ప్రధాన ఉద్దేశ్యం బాలికలకు విద్య, ఆరోగ్యం, భద్రత, సమాన హక్కులు కల్పించడం.
ప్రపంచ వ్యాప్తంగా బాలికల హక్కులు, చైతన్యం, అవకాశాల సమానత్వం మరియు వారి ఆలోచనలు ప్రోత్సహించటానికి ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది. ప్రపంచ దేశాలన్నీ ఆ రోజు చర్చా కార్యక్రమాలు, జరిపి బాలికల సమస్యలు, పరిష్కార మార్గాల పట్ల అవగాహన పెంచడంపై దృష్టి కేంద్రీకరిస్తాయి.భారతదేశంలో కూడా ఈ రోజున బాలికల స్థితి, వారి సాధికారత, భవిష్యత్ అవకాశాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు జరుగుతాయి
• “బేకింగ్ డిక్లరేషన్ అండ్ ప్లాట్‌ఫారమ్ ఫర్ యాక్సిన్ ” 1995 లో మహిళల హక్కుల విషయంలో ప్రాముఖ్యతను గురించి చెప్పడం జరిగినది. ఈ డిక్లరేషన్‌లో బాలికల హక్కులను కూడా ప్రత్యేకంగా గుర్తించటం జరిగింది.
• తరువాత, “బికాస్ ఐ యామ్ ఎ గర్ల్” అనే నినాదంతో ఒక అంతర్జాతీయ సంస్థ బాలికల ప్రత్యేక హక్కులపై దృష్టిని పెంచే విధంగా కార్యక్రమాలు ప్రారంభించింది. తరువాత 2011 డిసెంబర్ 19న, ఐక్యరాజ్యసమితి ఒక నిర్ణయం తీసుకుంది. 66/170 ద్వారా అక్టోబర్ 11ను “అంతర్జాతీయ బాలికా దినోత్సవం ”గా ప్రకటించింది.
• తొలి అంతర్జాతీయ బాలికా దినోత్సవం 2012లో జరిగింది.
• తదుపరి సంవత్సరాలలో ఈ బాలికా దినోత్సవం రోజు నిర్వహించే వివిధ కార్యక్రమాలు, థీమ్స్, అంతర్జాతీయం అవగాహనలో ముఖ్య పాత్ర వహించాయి.
అంతర్జాతీయ బాలికా దినోత్సవం ఉద్దేశ్యాలు
• బాలికల హక్కులపై అవగాహన పెంపొందించడం,ఏ దేశంలోనైనా ,ఏ ప్రాంతంలోనైనా, బాలికల హక్కులను ఎవరైనా హరిస్తే ఆ అన్యాయ పరిస్థితులపై నిర్ధిష్ట దృష్టిని నిలపడం .
• విలక్షణ సవాళ్లను ఎదుర్కోవడం - బాలికలు ఎదుర్కొనే అనేక సమస్యలు విద్య, అవకాశ లోపం, మానసిక , శారీరిక హింస, బాల్య వివాహం, ఆర్థిక అసమానతలు , సాంకేతిక రంగం లభ్యత లో తేడాలు, లింగ ఆధారిత వివక్షత పై చర్చలు జరిపి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం.
• బాలికల శక్తివంతమైన నాయకత్వం, భాగస్వామ్య బాధ్యత తీసుకోవాలి. బాలికలు కేవలం సమాజంలో అణగారిన సభ్యులు కాదు. వారు నాయకులు, ఆవిష్కర్తలు, మార్పుదారులు కావాలి. వారికి అవకాశాలపై దృష్టిని పెట్టే వాతావరణాన్ని సృష్టించాలి. ప్రయత్నాలు, విధానాలు, కార్యక్రమాల ప్రోత్సాహం వారికి సమాజం ఇవ్వగలగాలి అని తెలిపే కార్యక్రమాలు చేపట్టడం.
• ప్రభుత్వాలు, ఎన్ జీ ఓలు, సామాజిక సంస్థలు, విద్యాసంస్థలు కలిసికట్టుగా పనిచేసి, బాలికలకు ఉపాది శిక్షణలు, స్కాలర్‌షిప్‌లు, సాంకేతిక శిక్షణలు అందించేలా చూడడం.
• అంతర్జాతీయ, జాతీయ, స్థానిక స్థాయిలో అన్నీ కార్యక్రమాలలో బాలికలకు కూడా భాగస్వామ్యం కల్పించడం.
• యువతతో సహా అణగారిన సామాజిక వర్గాల సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలి. ప్రపంచంలో పలు దేశాలు, సంస్థలు ఈరోజును గుర్తించి వారికి సహకారం అందించాలి.
• ప్రతి సంవత్సరం, అంతర్జాతీయ బాలికా దినోత్సవానికి ఒక థీమ్ (విషయ శీర్షిక) ను నిర్ధారించాలి. ఇది ఆ సంవత్సరంలో అత్యంత ప్రాముఖ్యత ఇచ్చే సమస్య లేదా శక్తి రంగాన్ని ప్రబావితం చెయ్యాలి.
ఉదాహరణ:
• 2025 థీమ్: “The girl I am, the change I lead: Girls on the frontlines of crisis”
• “నేను ఒక అమ్మయిని ,నేను మార్పు తీసుకొస్తాను. ఏ సమస్య వచ్చినా అమ్మయిలు ముందువరుసలో వుండి ఎదుర్కుంటారు.”
ఇది ఒక సంక్షోభ సమయంలో (స్వాభావిక, ఆర్థిక, ఆరోగ్య, యుద్ధ పరిస్థితులలో) బాలికలు ఎలా ముందుండి మార్పుని వాళ్ళ నైపుణ్యాలతో ఎదుర్కుంటారో తెలియచేస్తుంది.
• 2024 సంవత్సరం లో అన్ విమెన్ ప్రచారంలో డిజిటల్ సమానత్వం, సాంకేతిక పరి జ్ఞానంఅనే అంశం మీద దృష్టి పెట్టారు.
• ఈ థీమ్ ద్వారా, సాధారణ అవగాహన కార్యక్రమాలను మరింత ప్రభావవంతంగా మార్చడం, నూతన ఆలోచనలు, చర్చా వేదికలు ఏర్పరచడం సాధ్యమవుతుంది.
బాలికలు ఎదుర్కొనే సవాళ్లు
• *సవాళ్లు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి
•
విద్యా అవకాశ లోపం
చాలా ప్రాంతాల్లో, బాలికలు పూర్తిగా పాఠశాలకు వెళ్ళలేరు, బాగా చదివినా సరైన అవకాశాలు లేక స్కూల్ మధ్యలో చదువు ఆగిపోవడం , మెరిట్ లో ఉన్నతవిద్యా అవకాశాలు లభించినా ముందుకు వెళ్ళే మార్గం పై సరైన దిశా నిర్దేశం లేకపోవడం వల్ల వారి చదువు అభివృద్ధి ఆగిపోతుంది. . యునెస్కో ప్రకారం, ప్రపంచంలో ఇంకా లక్షలాది బాలికలు పాఠశాల లో చేరలేని పరిస్థితిలో ఉన్నారు.
బాల్య వివాహాలు
భారతదేశం తో సహాయ అనేక దేశాల్లో, చిన్న వయసులో వివాహం జరగడం బాలికల జీవితం, ఆరోగ్యం, అభివృద్ధిపై నష్టం కలిగించే అంశం. ఇది బాలికను చదువు విడిచిపెట్టడానికి ,నైపుణ్య ఆసమర్థతలకు, హక్కులు కోల్పోవడానికి దారితీస్తుంది.
ఆర్థిక అసమానతలు
బాలికలు సంప్రదాయంగా ఉంటూ నిరంతరం కుటుంబ వ్యవహారాలు, సామాజిక బాధ్యతలలో పోరాడతారు. కాబట్టి వారు తక్కువ అవకాశాలు పొందగలుగుతారు. ఒకవేళ వాటిని అధికామించినా యువతకు ఉపాధి అవకాశాలు, ఆర్దిక సమానత్వం లభించకపోవడం ఒక పెద్ద సమస్య.
సాంకేతిక డిజిటల్ గ్యాప్
ఇంటర్నెట్, కంప్యూటర్, మొబైల్ డివైస్‌లకు వాడడం లో చాలా గ్రామాలలో బాలికలు తరచుగా వెనుకబడుతున్నారు. సాంకేతికతను అందిపుచ్చుకునే అవకాశాలు, టెక్నాలజీ లో అవగాహన కూడా వారికి క్రొత్త అవకాశాన్ని తెస్తుంది. లేదంటే వారి అభివృద్ధి ఆగిపోతుంది.
ప్రస్తుత సమాజంలో బాలికలను హింస, లైంగిక వేధింపులు, నానా రూపాలలో చుట్టుముడుతూనే ఉన్నాయి. బాలికలు తరచుగా గృహహింస, లైంగిక వేధింపుల వంటి బలమైన ప్రమాదాలకు లోనవుతారు. అవగాహన లేకపోవటం, పెద్ధల సంరక్షణ, బాధ్యత లేకపోవటం, ఆర్దిక వెనుకబాటు, సామాజిక వాతావరణం దీనికి కారణాలు. అలాగే ఆరోగ్య సమస్యలు, లోపభూయిష్ట ప్రభుత్వ సహాయం బాలికలకు ప్రధాన సమస్యగా మారుతున్నాయి. రజస్వల తరువాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో సమాచారం లేకపోవడం కూడా వీరిని కుంగదీస్తునది. కొన్ని సామాజిక వర్గాలలో బాలికల పుట్టడం వారి హోదాకు భంగం అని భావించడం,ఒకవేళ పుట్టినా వారిని పూరిటి లోనే చంపడం(భ్రూణ హత్యలు ) జరుగుతున్నాయి. ఒకవేళ ఆడపిల్ల పుట్టిన తరువాత ఆడపిల్ల అనే నెపంతో వారి అభిరుచి, స్వేచ్ఛను పరిమితం చేయడం జరుగుతుంది.
భారత్ లో ప్రస్తుత పరిస్థితి
భారతదేశంలో కూడా బాలికలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కానీ ప్రభుత్వం కొన్నిప్రత్యేక పధకాల ద్వారా వాటిని అధికమిస్తుంది. వాటిలో కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం.
• భారత ప్రభుత్వం “National Girl Child Day” ను జనవరి 24 న నిర్వహిస్తుంది, భారతీయ స్థాయిలో బాలికల సమస్యలపై అవగాహన కల్పించటం దీని ప్రధాన లక్ష్యం.
• ఇక్కడ కూడా కొన్ని ప్రాంతాలలో బాలికలు అభివృద్ధి హక్కులు, విద్యా అవకాశాలు పొందడం లో , హై-స్కూల్ స్థాయికి చేరుకోవడంలో వెనుకబాటుకు గురవుతున్న విషయాలు కనిపిస్తాయి.
• దేశంలో పలు రాష్ట్రాల్లో బాల్య వివాహం, లింగ పరిమిత ఆచారాలు ఇంకా కొనసాగుతున్నా, కొత్త చట్టాలు, న్యాయ నిర్ణయాలు భావసరిహద్దులుగా మారుతున్నాయి.
• ప్రస్తుతం, బాలికల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం, ఎన్‌జీఓలు, సామాజిక సంస్థలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి.
• ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లు, ఉచిత పాఠశాల విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
• బేటీ బఛావో బేటీ పడావో అనే నినాదంతో బాలికల హక్కుల రక్షణ , బాలికల అబివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని రూపొందించినది.
• ఆరోగ్య, జన్మనియంత్రణ, పోషణ, మహిళల విద్యాపథకాలు మొదలైనవి చాలా పధకాలు ఇప్పటికే అమలులో వున్నాయి..
• అయినా కూడా, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహనా లోపం, సంప్రదాయ కట్టుబాట్లు, ఆర్థిక పరిమితులు, భౌగోళిక ఆటంకాలు బాలికల అభివృద్ధికి పెద్ధ అడ్డంకులుగా ఉన్నాయి.
బాలికల ఉన్నతికి అంతర్జాతీయ కార్యాచరణలు
• అన్ని దేశాల్లో ప్రభుత్వ సంస్థలు, విద్యాసంస్థలు, ఎన్‌జీఓలు ఈ రోజున వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. సదస్సులు, చర్చలు, ఫోరమ్లు, వర్క్‌షాపులు, , కళారూపాలు రూపొందించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి.
• అన్ ఉమన్ ,యూనిసెఫ్ వంటి సంస్థలు ప్రతి ఏడాది ప్రత్యేక ప్రచారాలు, అవగాహన కార్యక్రమాలు, కథనాలు విడుదల చేస్తుంటాయి.
• “గర్ల్స్ టేక్ ఓవర్” వంటి కార్యక్రమాలు కొన్ని దేశాల్లో ఎంతగానో ప్రచారం అవుతున్నాయి. దీని ద్వారా అంతర్జాతీయ స్థాయి నాయకత్వ పాత్రల్లో బాలికలకు ఒక రోజు బాధ్యతలు అప్పగించి, వారి సామర్థ్యాలను ప్రజాస్వామ్యంలో చూపించే సంస్కరణలు జరుగుతున్నాయి.
• ప్లాన్ ఇంటర్ నేషనల్ ద్వారా నిర్వహించే బాలికల వాగ్దానాలు, వర్క్‌షాపులు పురోగతి సాదిస్తున్నాయి.
తీసుకోవాల్సిన చర్యలు- చట్టపరమైన సంస్కరణలు
• ప్రభుత్వం బాలికల హక్కులను మరింత బలంగా పరిరక్షించాలి. చట్టాలు, విధానాలు నిశితంగా అమలు కావాలి.
• బాలికలకు ఉచిత, నాణ్యమైన విద్యా అవకాశాలు ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత విద్య వరకుఅందించాలి. డిజిటల్ నైపుణ్యాలు, STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెథ్) రంగాల్లో మహిళల ప్రోత్సాహం కల్పించాలి.
• ఆర్థిక స్వావలంబన మార్గాలు, చిన్న వ్యాపారాలు, మైక్రోలోన్‌లు, ఉద్దీపన పథకాలు మొదలైన వాటి ద్వారా యువతులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి.
• పోషణ, మెన్స్ట్రుయల్ హెల్త్ మద్దతు, బాలికలకు హెల్త్ క్యాంప్స్, మెన్స్ట్రుయల్ హైజీన్ సదుపాయాలు ప్రతి మారుమూల గ్రామంలో ఉన్న పాఠశాలల వరకూ అందించాలి.
• బాలికల హక్కులపై, హింసపై , ఆరోగ్య మద్దతుపై , హెల్ప్‌లైన్లు, మెంటర్‌షిప్ వంటి వాటి పై అవగాహన కల్పించాలి.
• సంప్రదాయ భావాలు, లింగాభిప్రాయాలు మారేలా చర్యలు తీసుకోవాలి.సమానత్వ భావజాలానికి చోటుకల్పించాలి.
• బాలికల చొరవ ,నాయకత్వం పెంపు కోసం స్కూల్ కౌన్సిల్స్, యూత్ ఫోరం, కమ్యూనిటీ లలో వారిని భాగం చెయ్యాలి.
• బాలికలు ఒకసారి అవకాశం ఇస్తే, వారు సంక్షోభ సమయంలో ముఖ్య భూమికను పోషించి చూపిస్తారు. సహకార, సేవా సామర్థ్యాలతో ఉండటం నేర్చుకుంటారు.
• ప్రపంచవ్యాప్తంగా, బాలికలకు విధ్యా అవకాశాలు పెరిగితే, ఆ దేశాల సామాజిక, ఆర్థిక స్థితి మెరుగవుతుంది.
• డిజిటల్ అసమానత తొలగించేవిధంగా, కొన్ని దేశాల్లో “Girls Can Code” కార్యక్రమాలు అమలవుతున్నాయి.
• బాలికల నేతృత్వం, మార్పు చైతన్యం చూపించే సంఘటనలు వివిధ దేశాల్లో చోటుచేసుకున్నాయి.
• అంతర్జాతీయ బాలికా దినోత్సవం “ఒక రోజు గుర్తింపు” మాత్రమే కాదు. ఇది ప్రతి చిన్నారి, యువతీ, మహిళ కోరుకున్నఅవకాశాలలో సమానత సాధించేoదుకు ఏర్పడిన వేదిక . ప్రపంచం మారడానికి, సమానత్వ భావం స్థాపించడానికి, బాలికలు ముందుకు వస్తే మార్పుఅనేది చైతన్యంగా మారి ప్రతి ప్రాంతంలో, ప్రతి కుటుంబంలో బాలిక ఒక దీపమై వెలుగుతుంది.
