
అంతర్జాతీయ పెట్టుబడి సదస్సులు - వాస్తవ ప్రకటనలా? ప్రతిష్టా ప్రదర్శనలా?
భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆర్థిక సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. వాటిలో అత్యంత ప్రాచుర్యానికి వచ్చినది గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్. తాజాగా తెలంగాణ రాష్ట్రం కూడా సమగ్ర ప్రణాళికలతో గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది. ఇప్పటికే గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఇలాంటి కార్యక్రమాలను సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాయి. ప్రతి రాష్ట్రం దాని ప్రత్యేకతలను ప్రపంచ వేదికపై ప్రకటిస్తూ, పరిశ్రమలు, ఐటీ, లాజిస్టిక్స్, పునరుత్పాదక విద్యుత్ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి తీవ్రంగా పోటీపడుతోంది. అయితే ఈ సదస్సులు నిజంగా ఎంతవరకు ఫలప్రదం అవుతున్నాయనేది అత్యంత కీలకమైన ప్రశ్న.
ఈ సదస్సుల ప్రధాన లక్ష్యం రాష్ట్రాన్ని ఆకర్షణీయ గమ్యస్థానంగా చూపడం. పెట్టుబడి పెట్టదలచిన అంతర్జాతీయ సంస్థలకు ఒకే వేదికపై అవకాశాలు, ప్రోత్సాహకాలు, మౌలిక వసతులు, శ్రామిక శక్తి అందుబాటు వంటి అంశాలను వివరిస్తూ, రాష్ట్రం తన బలాలను ప్రదర్శిస్తుంది. ఈ విధంగా ఒక రాష్ట్రం తన అభివృద్ధి దిశను ప్రపంచానికి తెలియజేయడమే కాక, ప్రభుత్వ నూతన విధానాలపై పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచుతుంది. తెలంగాణ ఈ సదస్సుల ద్వారా హైటెక్ తయారీ, గ్రీన్ ఎనర్జీ, ఆధునిక పరిశ్రమల వైపు దారి మళ్లుతున్నట్లు సంకేతాలు ఇస్తోంది.
అయితే విమర్శకులు చూపిస్తున్న ప్రధాన అంశం సదస్సులో సంతకం చేసే MoUల(అవగాహన పత్రాలు) ఎంతవరకు నిజంగా అమలులోకి వస్తున్నాయని? అనేక రాష్ట్రాలు లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వస్తాయని ఘనంగా ప్రకటిస్తాయి. కానీ వాటిలో ఎంత శాతం వాస్తవ ప్రాజెక్టులుగా రూపుదిద్దుకుంటున్నాయి అనేది సందేహాస్పదం. MoU అనేది ఒప్పందం కాదు; అది కేవలం ఆసక్తి ప్రకటించినట్టే. అనుమతులు ఆలస్యం కావడం, భూసమీకరణలో సమస్యలు, స్థానిక ప్రతిఘటన, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు మారడం వంటి అనేక కారణాల వల్ల ప్రాజెక్టులు నిలిచిపోవచ్చు. అలా చూస్తే సదస్సులు వార్తల్లో నిలవడానికి ఉపయోగపడినా, వాస్తవ ఆర్థిక లాభాలు మాత్రం ఆశించినంతగా రావడం లేదని అనిపిస్తుంది.
మరొక సమస్య అన్ని రాష్ట్రాలు దాదాపు ఒకే రకమైన రంగాలకు ప్రాధాన్యం ఇవ్వడం. అందరూ EVలు, , ఐటీ పార్కులు, వైద్య పరికరాల తయారీ, డేటా సెంటర్లు వంటి రంగాలపైనే దృష్టి పెడుతున్నారు. దీని కారణంగా రాష్ట్రాల మధ్య పోటీ ప్రయోజనాలకు బదులుగా, సబ్సిడీల పోటీ మొదలవుతోంది. పన్ను రాయితీలు, భూమి సడలింపులు, విద్యుత్ సబ్సిడీలు ఇలా పెట్టుబడుల కోసం పరస్పరం పోటీ పడటం వల్ల, దీర్ఘకాలికంగా రాష్ట్రాల బడ్జెట్లపై ఒత్తిడి పెరుగుతుంది. పెట్టుబడిదారులు అయితే ఇలాంటి పోటీని ఉపయోగించుకుంటారు. కానీ రాష్ట్రాలకు మాత్రం ఖర్చు లాభాల సమీకరణ స్పష్టంగా ఉండటం కష్టమే.
ఇదే సమయంలో, కొన్ని రాష్ట్రాలు మాత్రం ఇటువంటి సదస్సులను సాంప్రదాయక కార్యక్రమంగా కాక, దీర్ఘకాలిక వ్యూహంగా మార్చాయి. తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలు MoUలు ముగిసిన తర్వాత ప్రాజెక్టుల పురోగతిని క్రమం తప్పకుండా ట్రాక్ చేసే ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేశాయి. గుజరాత్ సంవత్సరాల క్రితమే “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”ను కేవలం నినాదం కాకుండా, వ్యవస్థాగత మార్పుగా మార్చింది. పారదర్శక అనుమతి వ్యవస్థ, వేగవంతమైన ప్రాసెస్‌లు, నిర్వాహక పటిమ ఇవి అన్ని పెట్టుబడిదారుల నమ్మకాన్ని సమ్మిట్ ముగిసిన తర్వాత కూడా నిలబెట్టాయి. ఈ రాష్ట్రాలు చూపించిన ప్రధాన సందేశం ఏమిటంటే, అసలు పని స్టేజ్‌పై సంతకాలతో కాదు; అవి తర్వాత జరిగే పరిపాలనా చర్యలతోనే.
తెలంగాణకు ప్రస్తుతం కీలకమైన దశ. ఐటీ, స్టార్ట్‌అప్ రంగాల్లో రాష్ట్రం ఇప్పటికే మంచి గుర్తింపు పొందింది. కానీ ఇప్పుడు తయారీ, గ్రీన్ ఎనర్జీ, హార్డ్‌వేర్ వంటి రంగాల వైపు విస్తరించాల్సిన అవసరం ఉంది. ఈ సమ్మిట్ రాష్ట్రంపై అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించినా, పెట్టుబడుల విజయవంతమైన అమలు మాత్రం పూర్తిగా ప్రభుత్వ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. వేగవంతమైన అనుమతులు, స్థిరమైన విధానాలు, పారదర్శక పాలన ఇవి అందించగలిగితేనే పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతుంది. అంతర్జాతీయ పరిస్థితుల్లో అనిశ్చితి పెరుగుతున్న ఈ సమయం లో, పెట్టుబడి దారులు స్ట్రాటెజిక్ రిస్క్‌లు తగ్గిన రాష్ట్రాలను మాత్రమే ఎంపిక చేస్తారు.
అంతర్జాతీయంగా చూస్తే, వియత్నాం, ఇండోనేషియా, యుఏఈ వంటి దేశాలు నిరంతర పెట్టుబడిదారుల సంబంధాలు, దీర్ఘకాలిక హామీలు, విధాన నిరంతరత కారణంగా వేగంగా ఎదిగాయి. వాటిలాగే భారత రాష్ట్రాలు కూడా సమ్మిట్లను ఒకరోజు కార్యక్రమాలుగా కాకుండా, సంవత్సరమంతా కొనసాగే సంబంధ నిర్మాణ వ్యూహాలుగా మార్చుకోవాలి. పెట్టుబడులు హైదరాబాదు, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లోనే కాకుండా, జిల్లా కేంద్రాలకు కూడా వెళ్లేలా మౌలిక వసతులు విస్తరించాలి.
మొత్తానికి అంతర్జాతీయ పెట్టుబడి సదస్సులు ఒక సంకేతం మాత్రమే. వాటి విజయాన్ని వేదికలపై సంతకాలతో కాకుండా, వాస్తవ నిర్మాణాలుగా చేయడం, ఫ్యాక్టరీల నిర్మాణం, ఉద్యోగాల పెరుగుదల, ఎగుమతుల వృద్ధి వంటి సూచికలు మాత్రమే నిర్ణయిస్తాయి. రాష్ట్రాలు ప్రకటించే పెట్టుబడుల పరిమాణం కాదు ముఖ్యం—అవి వాస్తవంగా ఎంత అమలులోకి వస్తాయి, రాష్ట్రానికి ఎంత లాభం చేకూరుస్తాయి, ప్రజలకు ఎంత ఉద్యోగావకాశాలు ఇస్తాయి అనేదే అసలు పరీక్ష.
తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఒక కీలక మలుపులో ఉన్నాయి. సదస్సులు మంచి వేదికలే
కానీ వాటిని వాస్తవిక అభివృద్ధిగా మార్చే శక్తి మాత్రం పాలన యొక్క నాణ్యత, ప్రణాళికల అమలు, పెట్టుబడిదారుల నమ్మకం—ఈ మూడు అంశాలపైనే ఆధారపడి ఉంటుంది. ఈ సదస్సులు ఒక ప్రవేశద్వారం మాత్రమే; దాన్ని ఎలాంటి మార్గంలో తీసుకెళ్తారు అనేదే భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది.
