Let's talk: editor@tmv.in
అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా విశాఖను తీర్చిదిద్దాలి

అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా విశాఖను తీర్చిదిద్దాలి

FL - YUGDR
28 సెప్టెంబర్, 2025

డొమెస్టిక్ ప‌ర్యాట‌కంతో పాటు, అంత‌ర్జాతీయ ప‌ర్యాట‌కానికి చిరునామాగా విశాఖ‌ను తిర్చిద్దేందుకు అవిర‌ళ కృషి చేస్తున్నామ‌ని, ఇప్ప‌టికే ఎన్నో ర‌కాల అభివృద్ధి ప్రాజెక్టుల‌ను చేప‌ట్టి అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ పేర్కొన్నారు. వీఎంఆర్డీఏ చిల్డ్ర‌న్ ఎరీనాలో శ‌నివారం జ‌రిగిన ప్ర‌పంచ ప‌ర్యాట‌క దినోత్స‌వ వేడుక‌ల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయ‌న ప‌లు అంశాల‌పై మాట్లాడారు. విశాఖ‌ను అన్ని ర‌కాలుగా అభివృద్ధి చేస్తున్నామ‌ని, ప‌ర్యాట‌కానికి అధిక ప్రాధాన్య‌త ఇస్తూ ముందుకు సాగుతున్నామ‌ని చెప్పారు.

డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సు, యూహెచ్3హెచ్ మ్యూజియం, యాత్రీ నివాస్ పునఃప్రారంభం త‌దిత‌ర నూత‌న ప్రాజెక్టుల‌ను ఇటీవ‌ల‌ అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని గుర్తు చేశారు. ప‌ర్యాట‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకునే విధంగా బీచ్ కారిడార్లో ప‌లు ర‌కాల వినూత్న కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నామ‌న్నారు. జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, ప‌ర్యాట‌క శాఖ ప‌రిధిలో ప‌లు అభివృద్ధి ప్రాజెక్టులు చేప‌డుతున్నామ‌ని, మ‌రిన్ని హోటళ్లు, రిసార్టులు వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, దానిలో భాగంగా కొన్నింటికి భూ కేటాయింపులు కూడా జ‌రిగాయ‌ని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర‌, దిగువ ద‌క్షిణాంధ్ర ప్రాంతాల‌ను క‌లుపుతూ టెంపుల్ టూరిజం అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు.

విశాఖ కేంద్రంగా ప‌ర్యాట‌కాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా ప్ర‌త్యేక దృష్టి సారించింద‌ని, జిల్లా యంత్రాంగం కూడా త‌ద‌నుగుణంగా చ‌ర్య‌లు చేప‌డుతోంద‌ని వివ‌రించారు. రెండు మూడు సంవ‌త్స‌రాల్లో ప‌ర్యాట‌కంగా వినూత్న ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తాయ‌ని, విశాఖ రూపురేఖ‌లు మ‌రింత మారిపోతాయ‌ని పేర్కొన్నారు. రానున్న కాలంలో విశాఖ‌ప‌ట్ట‌ణం కేంద్రంగా ప‌లు విశేష కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయ‌ని వాటిలో భీమిలి ఉత్స‌వ్, విశాఖ ఉత్స‌వ్ ఉన్నాయ‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు. వ‌చ్చే ఫిబ్ర‌వ‌రిలో అంత‌ర్జాతీయ ఫ్లీట్ రివ్యూ, విశాఖ ప‌రేడ్ జ‌రుగుతాయ‌న్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఫుడ్ ఫెస్టివ‌ల్ మాదిరిగా మ‌రిన్ని కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తామ‌ని పేర్కొన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ఇటీవ‌ల నిర్వ‌హించిన వీడియో, ఫోటో గ్ర‌ఫీ పోటీల్లో విజేత‌ల‌కు, వివిధ వేదిక‌ల క‌ళాకారుల‌ను, హోట‌ల్, మ‌ర్చంట్స్ అసోసియేష‌న్ ప్ర‌తినిధుల‌ను, ర‌క్త‌దాత‌ల‌ను క‌లెక్ట‌ర్ అభినందించారు. దుశ్సాలువాల‌తో స‌త్క‌రించి జ్ఞాపిక‌ల‌ను, బహుమ‌తులను అంద‌జేశారు. వీడియోగ్ర‌ఫీ పోటీల్లో ప్ర‌థ‌మ స్థానంలో అన్మోల్ నిల‌వ‌గా, ద్వితీయ స్థానంలో కిర‌ణ్ తుమ్మ‌ల‌, తృతీయ స్థానంలో నివేదిత నిలిచారు. ఫోటో గ్ర‌ఫీ పోటీల్లో ప్ర‌థమ స్థానంలో దీప‌క్, ద్వితీయ స్థానంలో మోనిక‌, తృతీయ స్థానంలో న‌వాజ్ నిలిచారు. వీరికి క‌లెక్ట‌ర్ చేతుల మీదుగా బ‌హుమ‌తులు, ప్ర‌శాంసా పత్రాలు అంద‌జేశారు.

ఫోటోగ్ర‌ఫీలో భార్గ‌వ్ రాజు ప్రోత్సాహక బ‌హుమతి అంద‌జేశారు. ప్ర‌పంచ ప‌ర్యాట‌క దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని చిల్డ్ర‌న్ ఎరీనా ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన ర‌క్త‌దాన శిబిరానికి మంచి స్పంద‌న ల‌భించింది. 100 మంది దాత‌లు ర‌క్తదానం చేసి స్ఫూర్తిని నింపారు. వారిని, సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు చేసిన చిన్నారుల‌ను అభినందిస్తూ వారితో జిల్లా క‌లెక్ట‌ర్ బృంద చిత్రాలు దిగారు. జిల్లా ప‌ర్యాట‌క శాఖ అధికారి జె. మాధవి, డీవీఎం జ‌గదీశ్, వివిధ అసోసియేష‌న్ల ప్ర‌తినిధులు, ఇత‌ర అధికారులు, విద్యార్థులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా విశాఖను తీర్చిదిద్దాలి - Tholi Paluku