Let's talk: editor@tmv.in
అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ బస్టు

అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ బస్టు

Panthagani Anusha
30 అక్టోబర్, 2025

ఢిల్లీ పోలీసులు భారత్, థాయ్‌లాండ్, యూఏఈ దేశాల మధ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ అంతర్జాతీయ డ్రగ్స్ కార్టెల్‌ను ఛేదించడంతోపాటు ఈ నేరంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిని అరెస్టు చేశారు. కస్టమ్స్ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి, స్మగ్లింగ్ కేసులో ఉద్యోగం కోల్పోయిన రోహిత్ కుమార్ శర్మ (35) అనే మాజీ అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాక ఆయన నుంచి సుమారు రూ. 27 కోట్లు ఉండే 21 కేజీలకు పైగా అత్యంత నాణ్యమైన ‘హైడ్రోపోనిక్ గంజాయి సీజ్ చేశారు. అంతేకాకుండా డ్రగ్స్ అమ్మకాల ద్వారా వచ్చినట్లు భావిస్తున్న రూ. 44.42 లక్షల నగదు, ఒక ఎస్‌యూవీ కారు, ఒక స్కూటర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీటెక్ చదివిన శర్మ 2015లో సెంట్రల్ ఎక్సైజ్ విభాగంలో విధులు నిర్వహించేవారు. కాగా 2019లో కన్నూర్ ఎయిర్‌పోర్టులో బంగారం స్మగ్లింగ్ కేసులో ఆరెస్ట్ అవ్వడంతో కేంద్ర ప్రభుత్వం ఈయనను 2023లో సర్వీస్ నుంచి తొలగించింది. ఉద్యోగం పోయిన తరువాత దుబాయ్‌కి వెళ్లి, అక్కడ బిహార్‌కు చెందిన అభిషేక్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పరచుకున్నారు. వీరిద్దరూ కలిసి థాయ్‌లాండ్‌ నుంచి ఈ ఖరీదైన 'హైడ్రోపోనిక్ గంజాయిని భారత్‌కు అక్రమంగా దిగుమతి చేయాలని కుట్ర పన్నారు. సాధారణ గంజాయి కంటే పది రెట్లు ఎక్కువ శక్తివంతమైన ఈ మత్తుపదార్థం ధనవంతుల పార్టీ సర్కిల్స్‌లో ఎక్కువగా వినియోగంలో ఉంటుంది. కాగా శర్మ కస్టమ్స్‌ డిపార్ట్మెంట్ లో తనకున్న పాత పరిచయాలను ఉపయోగించి తక్కువ రద్దీ ఉన్న గౌహతి వంటి విమానాశ్రయాల ద్వారా సులభంగా ఈ స్మగ్లింగ్‌ను చేసినట్లు దర్యాప్తులో తేలింది.

ఇక డ్రగ్స్ అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిందితులు హవాలా, క్రిప్టోకరెన్సీ మార్గాల ద్వారా దుబాయ్‌కి తరలించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సమాచారం ఆధారంగానే, పోలీసులు జనక్ సినిమా సమీపంలో మాటు వేసి శర్మను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అరెస్టు అయిన శర్మను విచారించి, ఈ అంతర్జాతీయ డ్రగ్స్ కార్టెల్‌లో ఉన్న ఆయన సహచరులను, ముఖ్యంగా దుబాయ్‌లో ఉన్న అభిషేక్‌ను గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ బస్టు - Tholi Paluku