Let's talk: editor@tmv.in
అంతర్జాతీయ టీ20లకు కేన్ విలియమ్సన్ గుడ్‌బై

అంతర్జాతీయ టీ20లకు కేన్ విలియమ్సన్ గుడ్‌బై

Shaik Mohammad Shaffee
3 నవంబర్, 2025

న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికి, అభిమానులను, క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. టెస్టులు, వన్డే ఫార్మాట్లపై పూర్తి దృష్టి సారించేందుకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు విలియమ్సన్ ప్రకటించాడు. 13 ఏళ్ల సుదీర్ఘ టీ20 అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలుకుతూ, కివీస్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కేన్ మామ (అభిమానులు పిలుచుకునే పేరు) నిలిచాడు.

రాబోయే టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌కు ముందు, యువ ఆటగాళ్లకు జట్టులో అవకాశం కల్పించి, జట్టుకు ఒక స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు కేన్ విలియమ్సన్ వెల్లడించాడు. "చాలా కాలంగా నేను ఈ ఫార్మాట్‌లో భాగమవ్వడాన్ని ఆస్వాదించాను. ఈ ప్రయాణంలోని జ్ఞాపకాలకు మరియు అనుభవాలకు నేను ఎంతో కృతజ్ఞుడను. నాకూ, జట్టుకూ ఇదే సరైన సమయం అని భావిస్తున్నాను. జట్టులో చాలా మంది ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు ఉన్నారు, వారికి అవకాశాలు ఇవ్వాల్సిన సమయం ఇది. మిచెల్ సాంట్నర్ అద్భుతమైన కెప్టెన్, అతడు జట్టును విజయపథంలో నడిపించగలడు. నేను బయట నుంచి మద్దతు ఇస్తాను" అని న్యూజిలాండ్ క్రికెట్ విడుదల చేసిన ఒక ప్రకటనలో విలియమ్సన్ పేర్కొన్నాడు.

రికార్డుల రారాజు

విలియమ్సన్ తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు. మొత్తం 93 టీ20 మ్యాచ్‌లు ఆడి, 33.44 సగటుతో 2,575 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మార్టిన్ గప్టిల్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లలో 18 అర్ధశతకాలు ఉన్నాయి, అత్యధిక వ్యక్తిగత స్కోరు 95 పరుగులు. 2021లో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై కేన్ విలియమ్సన్ 85 పరుగులు చేసి, ఒంటరి పోరాటం చేసినా, దురదృష్టవశాత్తూ కివీస్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

కెప్టెన్సీలో అద్భుతాలు

టీ20ల్లో న్యూజిలాండ్‌కు 75 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన విలియమ్సన్, జట్టును రెండుసార్లు (2016, 2022) ప్రపంచకప్ సెమీ-ఫైనల్స్‌కు, ఒకసారి (2021) ఫైనల్‌కు నడిపించాడు. అతడి కెప్టెన్సీలో కివీస్ టీ20లలో 39 విజయాలు నమోదు చేసింది. మైదానంలో నిశ్శబ్ధంగా, నెమ్మదిగా ఉంటూనే, కీలక సమయాల్లో జట్టుకు విజయాలను అందించడంలో కేన్ పాత్ర మరవలేనిది. అతడి క్లాస్ బ్యాటింగ్, తెలివైన వ్యూహాలు న్యూజిలాండ్‌ను ప్రపంచ క్రికెట్‌లో ఒక శక్తివంతమైన జట్టుగా నిలబెట్టాయి.

టెస్ట్, వన్డే కెరీర్‌పై స్పష్టత

టెస్ట్, వన్డే ఫార్మాట్లలో తన భవిష్యత్తుపై తనకు స్పష్టత ఉందని, ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌పై దృష్టి సారించినట్లు కేన్ తెలిపారు. "బ్లాక్‌క్యాప్స్ (కివీస్ జట్టు) ఒక ప్రత్యేకమైన ప్రదేశం. ఇక్కడ మనం మనల్ని పూర్తిగా అంకితం చేసుకోవాలి. మనలోని అత్యుత్తమ ప్రదర్శనను వెలికితీయాలి. ఇదే అంతర్జాతీయ క్రికెట్‌లో, ఈ వాతావరణంలో నాకు బాగా నచ్చే విషయం. కోచ్ రాబ్, న్యూజిలాండ్ క్రికెట్‌తో నేను కమ్యూనికేషన్ కొనసాగిస్తాను. వారు నాకు ఎంతో మద్దతు ఇచ్చారు" అని విలియమ్సన్ అన్నారు.

కోచ్ రాబ్ వాల్టర్ మాట్లాడుతూ "ఈ ఫార్మాట్‌లో ఆటగాడిగా, కెప్టెన్‌గా కేన్ సహకారం అపారమైనది. అతడు ఆడిన 93 మ్యాచ్‌లలో 75 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించడం, జట్టుపై అతడి ప్రభావం ఎంత ఉందో తెలియజేస్తుంది" అని ప్రశంసించారు. విలియమ్సన్ అంతర్జాతీయ టీ20ల నుంచి తప్పుకున్నప్పటికీ, 2026 సీజన్‌కు ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్‌ జెయింట్స్‌కు వ్యూహాత్మక సలహాదారుగా నియమించబడటం, ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్‌ ఆడటం కొనసాగించడం విశేషం.

అంతర్జాతీయ టీ20లకు కేన్ విలియమ్సన్ గుడ్‌బై - Tholi Paluku