
అంతర్జాతీయ ఘర్షణల మధ్య భారత్ స్థిరత్వం స్పష్టంగా కనిపిస్తోంది: కిషన్ రెడ్డి
ప్రపంచవ్యాప్తంగా పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు ఆందోళన కలిగిస్తున్నా భారత్ మాత్రం ఆధ్యాత్మికత అభివృద్ధి, భద్రతకు మారుపేరుగా నిలుస్తోందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికి, దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఇక దర్శనం అనంతరం ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి, ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అశాంతి నెల కొన్నప్పటికీ భారత్ తనదైన శైలిలో స్థిరత్వాన్ని ప్రదర్శిస్తోందని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాలు, అత్యంత భద్రత కలిగిన అరబ్ దేశాలు సైతం నేడు గ్లోబల్ ఉద్రిక్తతలతో సతమతమవుతున్నాయని కానీ భారత్ మాత్రం ఆధ్యాత్మిక శక్తితో, అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు.
ఈ సుస్థిరతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వమే కారణమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలోని 140 కోట్ల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎదురవుతున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటోందని వెల్లడించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఒడిదుడుకులకు లోనవుతున్నా భారత్ అన్ని రంగాల్లో స్థిరమైన వృద్ధిని సాధిస్తూ భద్రతా ప్రతీకగా నిలవడం గర్వకారణమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
