Let's talk: editor@tmv.in
అంతర్జాతీయ క్రీడల్లో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు: రాజ్‌నాథ్ సింగ్

అంతర్జాతీయ క్రీడల్లో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు: రాజ్‌నాథ్ సింగ్

Pinjari Chand
14 ఏప్రిల్, 2026

ఒకప్పుడు భారత్‌ను కేవలం క్రికెట్, హాకీ మాత్రమే ఆడే దేశంగా గుర్తించేవారని, కానీ ఇప్పుడు ప్రపంచ స్థాయి క్రీడా పోటీల్లో దేశం ప్రత్యేక గుర్తింపు సాధిస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. లక్నోలో నిర్వహించిన సంసద్‌ ఖేల్‌ మహాకుంభ్‌ 2026 కార్యక్రమంలో సోమవారం ఆయన ప్రసంగించారు. గతంలో ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ పోటీల్లో భారత్ పతకాల పట్టికలో కనిపించడం కూడా కష్టమైందని, అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోందని చెప్పారు. దేశంలో చాలా కాలం క్రీడలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. క్రీడాకారులకు అవసరమైన మౌలిక వసతులు లేకపోవడం వల్ల అనేక ప్రతిభలు వెలుగులోకి రాలేకపోయాయని తెలిపారు.

గత దశాబ్దంలో పెద్ద మార్పు

గత 10–12 సంవత్సరాల్లో భారత క్రీడా రంగంలో పెద్ద మార్పు చోటుచేసుకుందని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో క్రీడాకారుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందని పేర్కొన్నారు. కొత్త నూతన జాతీయ విద్యావిధానం కింద క్రీడలను కూడా ఒక సబ్జెక్ట్‌గా బోధిస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే దేశంలో మొదటి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు క్రీడల అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పారు.

‘ఖేలో ఇండియా’తో ప్రోత్సాహం

ప్రభుత్వం చేపట్టిన ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా మహిళల భాగస్వామ్యం పెరిగిందని చెప్పారు. ఖేలో ఇండియా మహిళా లీగ్ దేశంలోని అనేక నగరాల్లో జరుగుతోందని, అందులో మహిళల పాల్గొనడం గణనీయంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సంప్రదాయ భారతీయ క్రీడలకు కూడా ప్రోత్సాహం లభించిందని తెలిపారు. గట్కా, మల్లఖంబ్, థాంగ్-టా, కలరిపయట్టు, యోగాసన వంటి క్రీడలను ప్రోత్సహించేందుకు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నామని చెప్పారు.

గ్రామాల వరకు క్రీడా వసతులు

ఇప్పుడైతే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆధునిక క్రీడా మౌలిక వసతులు అభివృద్ధి చెందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. గ్రామాలు, చిన్న పట్టణాల్లో మైదానాలు, స్టేడియాలు, శిక్షణ కేంద్రాలు నిర్మిస్తున్నామని తెలిపారు. అర్బన్ స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పథకం కింద గతంలో ఆరు సంవత్సరాల్లో కేవలం రూ.300 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, కానీ ఖేలో ఇండియా కింద ప్రభుత్వం ఇప్పటికే సుమారు రూ.5,000 కోట్లు క్రీడా మౌలిక వసతులపై పెట్టుబడి పెట్టిందని చెప్పారు.

లక్నో క్రీడలకు ప్రసిద్ధి

లక్నో నగరం ఎప్పటి నుంచో క్రీడా సంస్కృతికి ప్రసిద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్యం తర్వాత జరిగిన తొలి జాతీయ క్రీడలు 1948లో లక్నోలోనే జరిగాయని గుర్తుచేశారు. క్రీడా సంస్కృతిని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ‘సంసద్ ఖేల్ మహాకుంభ్’ నిర్వహిస్తున్నామని, నగరంలో క్రీడా వసతులను మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తామని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.