
అంతర్జాతీయ కార్టింగ్ ర్యాంకింగ్స్‌లో భారత బాల రేసర్ అతీకా మీర్ ప్రతిభ
భారత యువ రేసింగ్ స్టార్ అతికా మీర్ అంతర్జాతీయ కార్టింగ్ ప్రపంచంలో మరో కీలక మైలురాయిని సాధించింది. ఫెడరేషన్ ఇంటర్‌నేషనల్ డీ ఆటోమొబైల్ (ఎఫ్‌ఐఏ) విడుదల చేసిన తాజా ఇంటర్ నేషనల్ కార్ట్ ర్యాంకింగ్ (ఐకేఆర్)లో ఆమె తన కేటగిరీలో అత్యుత్తమ మహిళా రేసర్‌గా నిలిచింది. 11 ఏళ్ల అతీకా ఒకే-ఎన్‌జే జూనియర్ క్లాస్ (12–14 ఏళ్లు) విభాగంలో మొత్తం ర్యాంకింగ్స్‌లో 7వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో స్విట్జర్లాండ్‌కు చెందిన జోల్టన్ కోయిగ్నీ అగ్రస్థానంలో ఉన్నారు.
ఫార్మూలా–1 మద్దతుతో
అతీకా మీర్ ప్రతిభను గుర్తించిన ఫార్మూలా 1 అకాడమీ ఆమెకు మద్దతు ఇచ్చింది. అకాడమీ సపోర్ట్ చేసిన తొలి భారతీయురాలిగా నిలిచింది. 2026 ప్రారంభంలో ఆమెను మినీ క్లాస్ (8–12) నుంచి నేరుగా జూనియర్ కేటగిరీకి తీసుకువచ్చారు. గత నెల స్పెయిన్‌లోని వాలెన్సియాలో జరిగిన చాంఫియన్ ఆఫ్ ది ప్యూచర్ అకాడమీ (సీవోటీఎఫ్‌ఏ) సిరీస్ తొలి రౌండ్‌లో ఆమె పోడియం స్థానం సాధించడం ఆమె ప్రతిభను మరింత వెలుగులోకి తెచ్చింది. అతీకా తండ్రి ఆసిఫ్ మీర్ , భారత తొలి జాతీయ కార్టింగ్ ఛాంపియన్, తన కుమార్తె ప్రతిభకు గర్వం వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేస్తూ ముందుకు సాగితే ఆమె లక్ష్యం అయిన ఫార్మూలాలో చేరగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
తదుపరి పోటీలు
ఇటీవల డబ్ల్యూఎస్‌కే సూపర్ మాస్టర్ సీరిస్‌లో చివరి రౌండ్‌లో 53 మంది డ్రైవర్లలో 8వ స్థానం సాధించిన అతీకా ప్రస్తుతం ఇటలీలోని లోనాటో సర్క్యూట్‌లో టెస్ట్‌లు నిర్వహిస్తోంది. వచ్చే వారం జరిగే డబ్ల్యూఎస్‌కే యూరో రౌండ్ -2 కోసం ఆమె సిద్ధమవుతోంది.
