
అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం
అవినీతి అనేది ఏ దేశాన్నైనా లోపల నుంచి బలహీనపరిచే నిశ్శబ్ద శత్రువు. ప్రజాస్వామ్య వ్యవస్థల మీద నమ్మకాన్ని దెబ్బతీసే ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉండటంతో, 2003లో ఐక్యరాజ్యసమితి దీనిని సమగ్రంగా ఎదుర్కొనే ప్రయత్నాన్ని ప్రారంభించింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న జరుపుకునే విధంగా అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవంను ప్రకటించింది. అవినీతి సమస్యలపై అవగాహన పెంచడం, ప్రభుత్వాలు, సంస్థలు, పౌరులు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తుచేయడం కోసం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం. ఈ దినోత్సవం కేవలం ఒక గుర్తింపుగా కాకుండా, నైతికతకు అంకితభావాన్ని పునరుద్ధరించే ప్రపంచవ్యాప్త ఉద్యమంగా నిలుస్తుంది.
అవినీతి ఎందుకు ఒక అంతర్జాతీయ సమస్య?
అవినీతి ఒక దేశానికే పరిమితం కాదు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వివిధ రూపాల్లో అవినీతి సామాజిక, ఆర్థిక వ్యవస్థలోకి చొరబడి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో లంచాలు, రాజకీయాల్లో నిధుల దుర్వినియోగం, ప్రైవేట్ రంగంలో అక్రమ లావాదేవీలు, ప్రజా వ్యయాల్లో దోపిడీ, మానవ హక్కుల ఉల్లంఘనలు ఇలా అవినీతి ప్రభావం ఎన్నో మార్గాల్లో బయల్పడుతుంది.
అవినీతితో నేరుగా జరుగే దోపిడీతోపాటు, దీని వల్ల పేద ప్రజలకు అందాల్సిన ఆరోగ్యం, విద్య, సంక్షేమ పథకాలు పలువురు వరకు చేరవు. అభివృద్ధి రేటు క్షీణిస్తుంది, పెట్టుబడిదారులకు దేశం మీద నమ్మకం తగ్గుతుంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అవినీతి పేదరికాన్ని మరింతగా పెంచే ఒక దుష్చక్రంలా పనిచేస్తుంది.
ఈ విస్తృతమైన, ప్రభావవంతమైన సమస్యకు ప్రపంచ వ్యాప్తంగా ఒక సమగ్ర స్పందన అవసరమని గ్రహించినప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక దినం ఒక అర్ధవంతమైన సాధనమైంది.
2003 డిసెంబర్ 9న ఐక్యరాజ్యసమితి ఈ అవినీతి వ్యతిరేక చట్టంపై సంతకాలు ప్రారంభించింది. ఇదే రోజును తరువాత అంతర్జాతీయ యాంటీ కరప్షన్ డే గా అధికారికంగా నిర్ణయించింది.
యుఎన్ సిఏసి అనేది అవినీతి వ్యతిరేకంగా ప్రపంచంలోనే మొదటి అంతర్జాతీయ చట్టపరమైన ఒప్పందం. ఇందులో, అవినీతి నివారణ, అవినీతి నేరాలను స్పష్టీకరణ, అంతర్జాతీయ సహకారం, దోపిడీ చేసిన ఆస్తుల వాపసు, అవినీతి ఆరోపణలపై దర్యాప్తు, కోర్టు విధానాలు, ప్రజా రంగంలో పారదర్శకత, మొక్కల పరిరక్షణ వంటి అంశాలన్నీ చేరాయి.
2003లోనే ఈ దినోత్సవం ప్రారంభమై, 2004 నుంచి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా పాటించబడుతోంది.
ఈ దినోత్సవం ఎందుకు ప్రారంభించారు?
అవినీతి మనుగడను ఆపడానికి కేవలం చట్టాలు సరిపోవు. ప్రజలు, ప్రభుత్వాలు, సంస్థలు, అంతర్జాతీయ సమూహం కలిసి పనిచేయాలి. అందుకే ఈ దినోత్సవం మూడు ప్రధాన లక్ష్యాలతో ప్రారంభించబడింది.
ప్రపంచవ్యాప్తంగా అవినీతి వల్ల కలిగే నష్టాలపై అవగాహన పెంచడం, అవినీతి సమాజంలో దాగి ఉండే సమస్య. చాలామందికి ఇది ఎంత ప్రమాదకరమో వివరంగా తెలియదు. ఈ రోజు ద్వారా ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, సామాజిక సంస్థలు, కార్పొరేట్ సంస్థలు అవినీతి ప్రభావాలపై ప్రజలకు సమాచారం అందిస్తాయి.
నైతిక విలువలను ప్రోత్సహించడం, సమాజం నైతికత మీద నడవాలి. లేకపోతే ప్రజాస్వామ్యం కూలిపోతుంది. నైతికత, పారదర్శకత, జవాబుదారీతనం ఈ విలువలను పునరుద్ధరించడానికి ఈ దినోత్సవం ఒక వేదికలా పనిచేస్తుంది.
అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడం
అవినీతి తరచుగా సరిహద్దులు దాటుతుంది. అక్రమ లావాదేవీలు, మనీ లాండరింగ్, టాక్స్ ఎవేషన్ వంటివి అధికమయ్యాయి. కాబట్టి దేశాలు పరస్పరం సహకరించాలి.
ప్రపంచ అవినీతి వ్యతిరేక చట్టం ద్వారానే దేశాలన్ని ఆస్తుల వాపసు, దర్యాప్తు, న్యాయ సహకారం, సమాచారం పంచుకోవడం వంటి అంశాల్లో కలిసి పనిచేస్తాయి. ఈ మూడు లక్ష్యాలే ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యంత ముఖ్యమైన సామాజిక ఉద్యమంగా నిలబెట్టాయి.
అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ప్రాధాన్యత
ప్రజల్లో అవగాహన, చైతన్యం పెంపు
ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ర్యాలీలు, సెమినార్లు, వర్క్‌షాప్‌లు, గవర్నెన్స్ చర్చలు, ఆన్‌లైన్ సామాజిక ప్రచారాలు జరుగుతాయి. ప్రజలకు లంచం ఎలాంటి నేరం?, అవినీతి ఎవరెవరిని ప్రభావితం చేస్తుంది?, అవినీతి నివేదిక ఇవ్వడం ఎలా? అవినీతి, అక్రమ లావాదేవీలు, నిధుల దోపిడీ, అధికార దుర్వినియోగం, భద్రతా ఉల్లంఘనలు, నైతికంగా తప్పు పనులు, వంటి విషయాలు ధైర్యంగా వెల్లడించే వ్యక్తి ఎలా వ్యవహరించాలి అనేవి స్పష్టంగా తెలియజేస్తారు.
ప్రభుత్వాలకు బాధ్యతను గుర్తుచేస్తుంది
ప్రతి ప్రభుత్వమూ అంతర్జాతీయ నిబంధనలు అనుసరించాలి. అవినీతి కేసులపై చర్యలు తీసుకోవడం, నైతిక పాలనను ప్రోత్సహించడం వంటి చర్యలపై ఈ రోజు ఒక బాధ్యతను గుర్తు చేసేలా పనిచేస్తుంది.
యువతలో నైతిక అవగాహన
భవిష్యత్తు యువతదే. అవినీతి లేని సమాజం నిర్మించాలంటే వారు నైతికత, బాధ్యత, న్యాయం, పారదర్శకత వంటి విలువలను అర్థం చేసుకోవాలి. విద్యాసంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల యువతలో ఈ ఆలోచనలు బలపడుతాయి.
కార్పొరేట్ రంగంలో నైతికత
లంచం వ్యతిరేక విధానాలు పాటించాలి. (సంస్థలు ఈ రోజున లంచం ఇవ్వడం తీసుకోవడం, అక్రమ బహుమతులు, ప్రయోజనాలు పొందడం వంటి వాటిని పూర్తిగా నిషేధించే స్పష్టమైన నిబంధనలు, నియమాలు నియంత్రణలను లంచం వ్యతిరేక విధానాలు అంటారు)
గోప్యమైన వ్యవస్థ వుండాలి. ( అవినీతి, మోసం లేదా తప్పుదారులు గురించి ఉద్యోగులు లేదా పౌరులు సురక్షితంగా ఫిర్యాదు చేసే విధంగా ఏర్పాటు చేసే గోప్యమైన వ్యవస్థ). ఉదా: ప్రత్యేక ఫోన్ లైన్, ఇమెయిల్, ఆన్‌లైన్ పోర్టల్ లాంటివి అందుబాటులో ఉండాలి.
నైతిక నియమావళి పాటించాలి. (ఒక సంస్థలో ఉద్యోగులు ఎలా ప్రవర్తించాలి, ఏ విలువలు పాటించాలి, ఏ పనులు చేయాలి, చేయకూడదు అన్న దానిపై ఇచ్చే నైతిక నియమాలు, నియంత్రణలను నైతిక నియమావళి అంటారు). ఇటువంటి చర్యలు తీసుకోవడం వల్ల వ్యాపార రంగంలో పారదర్శకత పెరుగుతుంది.
అవినీతి ఎలా సమాజంపై ప్రభావం చూపుతుంది?
ఆర్థిక అభివృద్ధిపై ప్రభావం
అవినీతి కారణంగా ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన నిధులు కొంత మంది వ్యక్తుల జేబులోకి వెళ్లిపోతాయి. ఇది మౌలిక సౌకర్యాల అభివృద్ధి, పేదల సంక్షేమ పథకాలు, ఆరోగ్య, విద్యా ఖర్చులు తగ్గిపోవడానికి దారితీస్తుంది.
పౌరుల నమ్మకంపై ప్రభావం
ప్రభుత్వ సంస్థలు లంచం మీద నడుస్తున్నాయనే భావన కలిగితే ప్రజలు ప్రభుత్వంపై, న్యాయ వ్యవస్థపై, రాజకీయ నాయకులపై నమ్మకం కోల్పోతారు. ఇది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది.
సామాజిక అసమానత
అవినీతి వల్ల ధనవంతులే ఎక్కువ ప్రయోజనం పొందుతారు. పేదలు మరింతగా వెనుకబడతారు. ఇది సమాజంలో అసమానత, అస్థిరత, నిరసనలకు దారితీస్తుంది. దేశ భద్రతపై ప్రభావంచూపుతుంది.
అవినీతి వల్ల అక్రమ ఆయుధాలు, డ్రగ్ ట్రాఫికింగ్, టెర్రరిజం ఫండింగ్ మాదిరి ప్రమాదకర నెట్వర్క్‌లు బలోపేతం అవుతాయి.
ప్రతి సంవత్సరం థీమ్
ప్రతి సంవత్సరం ఐక్యరాజ్యసమితి ఒక ప్రత్యేక థీమ్‌ను ప్రకటిస్తుంది. వీటి ద్వారా ఇవే సందేశాలు ప్రధానంగా ఇవ్వబడతాయి. అవినీతి లేకుండా బలమైన సంస్థలు, సుస్థిర అభివృద్ధికి పారదర్శక పాలన, అవినీతి నివారణలో పౌరుల పాత్ర,సమాచారం అందించినవారికి రక్షణ, నైతిక లీడర్షిప్ ఈ థీమ్‌లు సమాజంలోని వివిధ వర్గాలకు ప్రత్యేక సందేశాలను చేరుస్తూ, అవినీతి నిరోధక చర్యలకు దారితీస్తాయి.
అవినీతి వ్యతిరేకంగా దేశాలు తీసుకోవాల్సిన చర్యలు
పారదర్శక పాలన అందించాలి. ప్రభుత్వ వ్యవస్థలు, టెండర్లు, పథకాలు, బడ్జెట్‌లు అన్నీ కూడా పూర్తిగా పారదర్శకంగా ఉండాలి. కఠిన చట్టాలు శిక్షలు అమలుచేయాలి. అవినీతి నేరాలకు కఠినమైన శిక్షలు ఉంటే ప్రజలు భయంతోనైనా నైతికతను పాటిస్తారు. ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడం ద్వారా స్వతంత్ర న్యాయవ్యవస్థ, మీడియా స్వేచ్ఛ, ఎన్నికల కమిషన్, విచారణ సంస్థలు ఇవన్నీ బలంగా ఉండాలి. టెక్నాలజీ వినియోగం పెరిగి డిజిటల్ పేమెంట్స్, ఈ గవర్నెన్స్, ఈ ప్రొక్యూర్ మెంట్ ,ఆర్టీఐ ఆన్లైన్ విధానం వంటివి అవినీతిని తగ్గించడానికి ఉపయోగపడతాయి. దీనికి టెక్నాలజీ ఎంతో సహాయపడుతుంది.
పౌరుల భాగస్వామ్యంఉండాలి. పురోగతి కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు. ప్రజలు లంచం ఇవ్వకూడదు. అవినీతి చూసినప్పుడు నివేదించాలి. నైతిక విలువలను ప్రోత్సహించాలి. అంటే సమాజం మొత్తం కలిసి పనిచేయాలి.
అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం నేటి అవసరం
ఇంటర్నెట్, డిజిటలైజేషన్ పెరిగిన ఈ రోజుల్లో అవినీతి కొత్త రూపాల్లో వస్తోంది. ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ ఫ్రాడ్స్, అంతర్జాతీయ మనీ లాండరింగ్, సైబర్ క్రైమ్ ఇలాంటి సమస్యలకు మరింత సమగ్ర చర్యలు అవసరం. అందుకే ఈ రోజున ప్రపంచమంతా అవినీతిని గుర్తించి, దాని మీద పోరాడేందుకు కొత్త విధానాలు చేపడుతోంది.
అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం కేవలం ఒక గుర్తింపు దినం మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, సంస్థలు, పౌరులు కలిసి నైతికతను కాపాడే ఒక సామూహిక ప్రమాణం. అవినీతి ఎప్పటికీ ఒకరోజులో నిర్మూలించదగిన సమస్య కాదు. ఇది ఒక నిరంతర పోరాటం. ఈ రోజు మనకు గుర్తు చేస్తుంది.
“అవినీతి లేని సమాజం కోసం ప్రతి వ్యక్తి బాధ్యతగా ముందుకు రావాలి.”
అవినీతి లేని దేశం అంటే, బలమైన సంస్థలు, సమాన అవకాశాలు, సుస్థిర అభివృద్ధి, న్యాయం, నైతికత, ప్రజాస్వామ్య బలం ఇవన్నీ కలిగిన సమాజం.
ఈ దినోత్సవం డిసెంబర్ 9ని జరుపుకోవడం అనేది మనలో నైతిక విలువలను పునరుద్ధరించుకోవడం, పారదర్శకతను కాపాడే సంకల్పాన్ని బలపరచడం అనే అర్ధంలో ఎంతో కీలకంగా మారుతుంది. కాబట్టి మనమంతా ఈ దినోత్సవం సందర్భంగా ఈ రోజునుండే అవినీతి లేని దేశం కోసం మన వంతు ప్రయత్నం చేద్దాం.
