
అంతరిక్ష విజయాలకు మిషన్ ఆపరేషన్లే కీలకం: ఇస్రో
భారత అంతరిక్ష రంగం విస్తరిస్తున్న తరుణంలో ప్రయోగాల విజయవంతానికి 'మిషన్ ఆపరేషన్స్' వెన్నెముక వంటివని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ వి. నారాయణన్ పేర్కొన్నారు. బుధవారం బెంగళూరులో ప్రారంభమైన 'స్పేస్‌క్రాఫ్ట్ మిషన్ ఆపరేషన్స్ 2026' మూడు రోజుల అంతర్జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. 'తదుపరి తరం కోసం వినూత్న, సుస్థిర అంతరిక్ష మిషన్ నిర్వహణ' అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ అంతరిక్ష సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ముఖ్యంగా సుదీర్ఘ కాలం కొనసాగే ప్రయోగాల్లో మిషన్ ఆపరేషన్స్ అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు.
రాకెట్ ప్రయాణం నిమిషాలే
రాకెట్, ఉపగ్రహాల పనితీరు మధ్య గల వ్యత్యాసాన్ని వివరిస్తూ నారాయణన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఒక రాకెట్ తన పనిని కేవలం 15 నుండి 25 నిమిషాల్లోనే పూర్తి చేస్తుంది. కానీ అది కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహం మాత్రం రెండేళ్ల నుంచి 15 ఏళ్ల వరకు నిరంతరం పనిచేయాలి. దీనికోసం ఏళ్ల తరబడి పర్యవేక్షణ, నియంత్రణ అవసరం" అని ఆయన వివరించారు. ఈ క్రమంలో కమాండ్లను అమలు చేయడంలో జరిగే చిన్న తప్పు కూడా మొత్తం మిషన్‌ను ప్రమాదంలోకి నెట్టేస్తుందని, అందుకే సాఫ్ట్‌వేర్ టీమ్‌లు, ఇంజనీర్ల పాత్ర కీలకమని కొనియాడారు.
చంద్రుడిపై విజయకేతనం
చంద్రయాన్-3 మిషన్ సాధించిన చారిత్రాత్మక విజయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. చంద్రుడి దక్షిణ ధృవం సమీపంలో ల్యాండింగ్ విజయవంతం కావడం వెనుక సుస్థిరమైన జట్టు కృషి, ఆపరేషనల్ కచ్చితత్వం ఉన్నాయని తెలిపారు. చంద్రయాన్-2 ప్రయోగంలో ఎదురైన పాక్షిక ఎదురుదెబ్బల నుంచి పాఠాలు నేర్చుకున్నామని, ఆ అనుభవంతోనే చంద్రయాన్-3ని అత్యంత కచ్చితంగా నిర్వహించగలిగామని చెప్పారు. 1962లో ప్రారంభమైన భారత అంతరిక్ష ప్రయాణం నేడు గ్లోబల్ లెవల్‌లో గుర్తింపు పొందడం గర్వకారణమన్నారు.
గగన్‌యాన్ యాత్రకు సన్నాహాలు
భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'గగన్‌యాన్' ప్రాజెక్టుపై నారాయణన్ స్పష్టతనిచ్చారు. మానవ సహిత యాత్రకు ముందు మూడు మానవరహిత మిషన్లను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మొదటి మానవరహిత మిషన్ పనుల్లో నిమగ్నమయ్యామని వెల్లడించారు. మానవ ప్రయాణానికి అనువైన వ్యవస్థలను సిద్ధం చేయడం, క్రూ ఎస్కేప్ సిస్టమ్, లైఫ్ సపోర్ట్ సిస్టమ్ వంటివి రూపొందించడం సవాలుతో కూడుకున్న పనులని పేర్కొన్నారు. దీనికోసం దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ల్యాబొరేటరీలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు.
కృత్రిమ మేధతో సరికొత్త విప్లవం
మారుతున్న కాలానికి అనుగుణంగా మిషన్ ఆపరేషన్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఆధారిత వ్యవస్థల వినియోగం పెరగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సదస్సులో ప్రజెంట్ చేసే 400కు పైగా పరిశోధనా పత్రాలు విద్యార్థులకు, స్టార్టప్ కంపెనీలకు దిశా నిర్దేశం చేస్తాయన్నారు. రష్యాకు చెందిన రోస్‌కాస్మోస్, జపాన్‌కు చెందిన జాక్సా, యూరప్ అంతరిక్ష సంస్థ, ఫ్రాన్స్‌కు చెందిన సీఎన్‌ఈఎస్ ప్రతినిధులు హాజరుకావడం ఈ సదస్సు ప్రాముఖ్యతను చాటుతోందన్నారు.
