Let's talk: editor@tmv.in
అంతరిక్షంలో నాసా కొత్త అధ్యాయం.. జాబిల్లిపై శాశ్వత స్థావరం
అంతరిక్షంలో నాసా కొత్త అధ్యాయం.. జాబిల్లిపై శాశ్వత స్థావరం

అంతరిక్షంలో నాసా కొత్త అధ్యాయం.. జాబిల్లిపై శాశ్వత స్థావరం

Shaik Mohammad Shaffee
26 మార్చి, 2026

దశాబ్దాల పరిశోధనల తర్వాత, అంతరిక్ష రంగంలో నాసా మరో కొత్త అధ్యాయానికి తెరలేపింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్దేశించిన జాతీయ అంతరిక్ష విధానాన్ని అమలు చేయడమే లక్ష్యంగా 'ఇగ్నిషన్' వేదికగా మంగళవారం కీలక ప్రకటనలు చేసింది. ట్రంప్ పదవీకాలం ముగిసేలోపే మళ్ళీ చంద్రుడిపై కాలు మోపడమే కాకుండా, అక్కడ శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసేందుకు పక్కా ప్రణాళికను వెల్లడించింది.

మూడు దశల్లో 'మూన్ బేస్' నిర్మాణం

చంద్రుడిపై మనుషులు శాశ్వతంగా నివసించేలా చేసేందుకు నాసా మూడు దశల్లో పనులు చేపట్టనుంది. మొదటి దశలో ప్రైవేటు కంపెనీల సాయంతో రోవర్లను పంపి, అక్కడ విద్యుత్తు, సిగ్నల్ వ్యవస్థలను సిద్ధం చేస్తారు. రెండో దశలో జపాన్ సహకారంతో ప్రత్యేక వాహనాలను పంపి, వ్యోమగాములు ఉండటానికి కావాల్సిన కనీస వసతులు కల్పిస్తారు. ఇక చివరిదైన మూడో దశలో ఇటలీ, కెనడా వంటి దేశాల సహకారంతో శాశ్వత నివాసాలను నిర్మించి, చందమామను మనుషులు ఎప్పుడూ ఉండేలా ఒక సురక్షితమైన స్థావరంగా మారుస్తారు.

అంగారకుడిపైకి అణుశక్తి నౌక

అంతరిక్ష ప్రయోగాల్లో మైలురాయిగా నిలిచే 'స్పేస్ రియాక్టర్-1 ఫ్రీడమ్' ప్రాజెక్టును నాసా పరిచయం చేసింది. 2028 చివరి నాటికి అణుశక్తితో నడిచే ఈ అంతరిక్ష నౌకను అంగారక గ్రహం (మార్స్) వైపు పంపనున్నారు. ఇది సౌరశక్తి పని చేయని సుదూర అంతరిక్షంలో అత్యంత వేగంగా, సమర్థవంతంగా ప్రయాణించేందుకు దోహదపడుతుంది. మార్స్ చేరుకున్నాక ఇది 'స్కైఫాల్' పేలోడ్ ద్వారా హెలికాప్టర్లను అక్కడ మోహరిస్తుంది.

ఐఎస్ఎస్ స్థానంలో ప్రైవేటు స్టేషన్లు

గత రెండు దశాబ్దాలుగా సేవలందిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) స్థానంలో ప్రైవేటు స్టేషన్లను ప్రోత్సహించాలని నాసా నిర్ణయించింది. అమెరికా ఉనికికి ఎలాంటి ఆటంకం కలగకుండా, తొలుత ఐఎస్ఎస్‌కి ఒక 'కోర్ మాడ్యూల్'ను తగిలించి, ఆ తర్వాత దానికి ప్రైవేటు మాడ్యూళ్లను జత చేస్తారు. మార్కెట్ డిమాండ్ పెరిగాక ఇవి విడివడి స్వతంత్రంగా పని చేస్తాయి.

సైన్స్ అండ్ టెక్నాలజీలో సరికొత్త విప్లవం

అంతరిక్ష పరిశోధనల్లో నాసా సరికొత్త విప్లవానికి తెరలేపింది. ఈ ఏడాది చివర్లో 'రోమన్ టెలిస్కోప్'ను నింగిలోకి పంపి విశ్వంలోని రహస్యాలను ఛేదించనుంది. అలాగే 2028లో శని గ్రహం దగ్గర ఉన్న 'టైటాన్' అనే చంద్రుడిపైకి అణుశక్తితో నడిచే ఒక ప్రత్యేకమైన డ్రోన్ (ఆక్టోకాప్టర్)ను పంపేందుకు సిద్ధమైంది. మరోవైపు 'ఆర్టెమిస్' ప్రాజెక్టు ద్వారా 2027లో భూమి చుట్టూ కీలక పరీక్షలు నిర్వహించి, ఆపై ఏడాది మనుషులను చంద్రుడిపై దించేందుకు పక్కా ప్లాన్ వేసింది. అంతేకాదు, 2027 నుంచి ప్రతి ఏటా కనీసం 30 రోబోలను చంద్రుడిపైకి పంపి అక్కడ పరిశోధనలు వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

"సమయం వేగంగా కదులుతోంది.. ఇది దేశ గౌరవానికి సంబంధించిన అంశం. విజయమో, అపజయమో నెలల కాలంలోనే తేలిపోతుంది. అందుకే నాసా తన సర్వశక్తులూ ఒడ్డి పని చేస్తోంది" అని నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్‌మాన్ ఉద్ఘాటించారు. మరోవైపు ఈ మెగా ప్రాజెక్టుల కోసం వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను సివిల్ సర్వెంట్లుగా మార్చుతూ నాసా తన అంతర్గత శక్తిని కూడా పెంచుకుంటోంది.

అంతరిక్షంలో నాసా కొత్త అధ్యాయం.. జాబిల్లిపై శాశ్వత స్థావరం - Tholi Paluku