
అంతరిక్షంలో తుఫాన్లు
మనం సూర్యుడిని సాధారణంగా కాంతి, వేడి, జీవానికి కారణమని మాత్రమే భావిస్తాం. కానీ అదే సూర్యుడు మనకు కనిపించని ఒక కొత్త మర్మాన్ని దాచుకున్నాడు. అంతరిక్షంలో మెల్లగా కదిలే గాలుల మధ్య ఒక అజ్ఞాత తుపాను పుడుతోంది. అది శబ్దం చేయదు, పొగలు కక్కదు, కానీ దాని శక్తి మన భూమిని కదిలించగలదు. సూర్యుడి కాంతి వెనుక దాగి ఉన్న ఈ అంతరిక్ష తుపానులు మన సాంకేతిక ప్రపంచాన్ని సవాలు చేస్తున్నాయి. ఇవి కనిపించవు, కానీ వాటి ప్రభావం భూమి గుండెల్లోకి చేరుతుంది. ఈ ప్లాస్మా ప్రవాహాలు భూమి వైపు గుట్టుగా పయనిస్తున్నాయి. ప్రతి క్షణం అవి మన కమ్యూనికేషన్ వ్యవస్థల మధ్యలో దారి వెతుకుతున్నాయి.
నిజానికి సూర్యుడు ప్రతి క్షణం తన గుండె నుంచి ఎగసే వేడి గాలులను అంతరిక్షంలోకి పంపిస్తూనే ఉంటాడు. ఆ గాలులు, ఆ విద్యుత్ కణాలు, భూమిని తాకే దారిలో నృత్యం చేస్తాయి. శాస్త్రవేత్తలు దీన్ని సౌర గాలి అని పిలుస్తారు. కానీ కొన్నిసార్లు ఆ సౌర గాలి అల్లకల్లోలమవుతుంది. సూర్యుడి ఉపరితలంపై జరిగే మహా విస్ఫోటనాలు, ప్లాస్మా మేఘాలు, అంతరిక్షంలోకి విసిరివేయబడతాయి. వాటిని కొరొనల్ మాస్ ఎజెక్షన్లు అంటారు. ఈ తుపానులు భూమిని చేరినప్పుడు అవి మన ఉపగ్రహాలను కదిలిస్తాయి.. GPS సంకేతాలను గందరగోళం చేస్తాయి.. విమాన మార్గాలనూ మార్చేస్తాయి. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు మరో కొత్త రహస్యాన్ని కనుగొన్నారు. సౌర గాలి మధ్యలో మరింత ప్రమాదకరమైన తుపానులు ఉన్నాయని వారు చెబుతున్నారు. ఇవి అంతరిక్ష తుపానులు.. సూర్యుడి ఉధృతి నుంచి విడిపోయిన ప్లాస్మా చక్రాలు. ఇవి సూర్య తుపానుల కంటే చిన్నవిగా ఉంటాయి, కానీ వాటి గుండెల్లో ఉన్న చుంబక శక్తి భూమి రక్షణ కవచాన్ని దెబ్బతీయగలదు. అవి కంటికి కనిపించవు, కానీ వాటి ప్రతి చలనం ఒక నిశ్శబ్ద ప్రమాదానికి సంకేతం. ఇక మెల్లగా సూర్యుని శ్వాస భూమివైపు కదులుతోంది. ఆ గాలుల్లో దాగి ఉన్న ఈ అంతరిక్ష తుపానులు ఏ దిశలో తిరుగుతాయో, ఎప్పుడు దాడి చేస్తాయో ఎవరికి తెలియదు.
ఇక ఈ అంతరిక్ష తుపానులు భూమిని ప్రభావితం చేయడం గతంలోనూ జరిగింది. 2024 మేలో అంతరిక్షంలో పుట్టిన ఒక తుపాను భూమిని తాకింది. నాడు విమానాలు దారి మళ్లించబడ్డాయి.. ఉపగ్రహాలు స్థిరత్వం కోల్పోయాయి.. జీపీఎస్ పరికరాలు మౌనమయ్యాయి. ఒక్కో వ్యవసాయ క్షేత్రం లక్షల రూపాయల నష్టాన్ని ఎదుర్కొంది. మనకు ఆ క్షణం తెలిసింది, మనం చూస్తున్న సూర్యుడు మాత్రమే కాదు, మనం చూడలేని అంతరిక్ష తుపానులు కూడా మన భవిష్యత్తును ప్రభావితం చేస్తున్నాయని తెలిసి వచ్చింది. ఆ ఘటన తర్వాత మిచిగన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సూపర్ కంప్యూటర్లతో కొత్త నమూనాలు తయారుచేశారు. ఆ నమూనాలు ఒక దృశ్యాన్ని చూపించాయి.
సూర్యుడు కొన్నిసార్లు తన లోపల ఉగ్రంగా పేలిపోతాడు. అప్పుడు భారీగా వేడి గాలులు, ప్లాస్మా అని పిలిచే విద్యుత్‌భరిత పదార్థం బయటకు ఎగిరిపోతుంది. ఇక ఆ వేడి మేఘాలు అంతరిక్షంలో ముందుకు దూసుకుపోతుంటే, వాటి వెనుక గాలులు కలగలిసి తిరుగుతూ చిన్న తుఫానులను తయారు చేస్తాయి. ఆ పెద్ద తుపానులు దూసుకెళ్తున్నప్పుడు, వాటి వెనుక చిన్న చిన్న తిప్పలు పుడతాయి. కొన్నిసార్లు అవి కాసేపటికే చెదరిపోతాయి.. కానీ మరికొన్ని మరింత బలంగా మారుతాయి. అవి వేగంగా కదిలే సౌర గాలులతో ఢీకొని, అంతరిక్ష తుపానుల్లా తిరుగుతూ భూమివైపు కదలడం మొదలుపెడతాయి. ప్రస్తుతం మనం ఆధారపడే సౌర పరిశీలన వ్యవస్థ.. భూమి, సూర్యుని మధ్య ఉన్న లాగ్రాంజ్ పాయింట్-L1 వద్ద ఉన్న రెండు ఉపగ్రహాలపైనే ఆధారపడి ఉంది. అవి సూర్యుడిని ఎదురుగా చూసే ఒకే దిశలో ఉండటంతో, బయట జరిగే తుపానులను గుర్తించలేవు.
ఈ అంధకారాన్ని తొలగించడానికి శాస్త్రవేత్తలు ఒక కొత్త ఆలోచన తెచ్చారు. దానికి పేరు స్విఫ్ట్..! అంటే స్పేస్ వెదర్ ఇన్‌వెస్టిగేషన్‌ఫ్రాంటియర్. ఇది నాలుగు చిన్న అంతరిక్ష నౌకల సమూహం. అవి త్రిభుజాకారంలో ఏర్పడి, మధ్యలో ఒక ప్రత్యేకమైన నౌక ఉండబోతోంది. అది సాధారణ రాకెట్‌ల్లా కాకుండా సూర్యకాంతినే ఇంధనంగా ఉపయోగిస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్న వ్యవస్థ కంటే 40 శాతం త్వరగా హెచ్చరికలు ఇవ్వగలదు. మిగతా మూడు నౌకలు దాని చుట్టూ 2లక్షల మైళ్ళ దూరంలో తిరుగుతూ, అంతరిక్ష గాలులను మూడు మార్గాల నుంచి పరిశీలిస్తాయి. ఈ సమూహం అందించే దృశ్యం మొదటిసారిగా తుపానుల రూపాన్ని చూపిస్తుంది. చుంబక క్షేత్రాలు ఎలా మారుతున్నాయో, ప్లాస్మా ప్రవాహాలు ఎలా తిప్పుకుంటున్నాయో మనం ప్రత్యక్షంగా చూడగలుగుతాం. ఇది కేవలం శాస్త్ర ప్రగతికే కాదు.. ప్రపంచ భద్రతకూ ఒక కీలక అడుగు. మరి చూడాలి ఈ స్విఫ్ట్ మనల్ని కాపాడుతుందో లేదో అన్నది ఇప్పటికైతే చెప్పలేం.. ఒకవేళ అంతరిక్ష తుపానుల తాకిడి పెరిగితే మాత్రం ముప్పు తప్పదండి..!
