Let's talk: editor@tmv.in
అంతరాష్ట్ర నేరాల ముఠా అరెస్ట్

అంతరాష్ట్ర నేరాల ముఠా అరెస్ట్

T Venkata Ramana
9 అక్టోబర్, 2025

ఆన్‌లైన్ షాపింగ్ ప్రపంచాన్ని మార్చివేసినా దానితో పాటు మోసాలు కూడా భయంకరంగా పెరిగాయి. ముంబై పోలీసులు రూ.34 లక్షల విలువైన వస్తువుల మోసంలో నలుగురు అంతర్రాష్ట్ర నేరస్థులను పట్టుకున్నారు. ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులను ఆర్డర్ చేసి, కొరియర్ మధ్యలో స్వాధీనం చేసుకుని నకిలీ వస్తులను అందులో చేర్చి స్టికర్లు మార్చి సంస్థలను మోసం చేసిన ఈ గ్యాంగ్ వివిధ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన దేశవ్యాప్త ఈ-కామర్స్ మోసాల అలెర్ట్‌గా మారింది. 2024లో భారతీయులు రూ.22,845 కోట్లు సైబర్ మోసాలకు గురయ్యారు. ఇది మునుపటి ఏడాది కంటే 206 శాతం ఎక్కువ. 2025లో కూడా ఈ ట్రెండ్ కొనసాగుతోంది.

ఈ-కామర్స్ మోసాలు

ఆన్‌లైన్ మోసాలు డిజిటల్ యుగంలో పెరిగిపోయాయి. ముఖ్యంగా ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో క్రెడిట్ కార్డు మోసాలు, రిటర్న్ ఫ్రాడ్, షిప్పింగ్ ఇంటర్‌సెప్షన్ వంటివి ఎక్కువ. ముంబైలో జరిగినటువంటి కేసులా నేరస్థులు ఖరీదైన వస్తువుతో చవకైనవాటిని ఆర్డర్ చేసి, డెలివరీ మధ్యలో స్వాధీనం చేసుకుని స్టికర్లు మార్చడం ఒక ప్రముఖ పద్ధతి.డేటా బ్రీచ్, ఫిషింగ్‌తో కార్డు వివరాలు దొంగిలించి, అనధికారిక లావాదేవీలు చేస్తారు. కస్టమర్ కొనుగోలు తర్వాత 'ఫ్రాడ్' అని చార్జ్‌బ్యాక్ చేస్తారు. నిజానికి వస్తువు పొందినా ఫేక్ సెల్లర్‌లు రియల్ కస్టమర్‌ల నుండి డబ్బు వసూలు చేసి వస్తువులు డెలివర్ చేయరు. ఫేక్ మెయిల్స్, ఎస్.ఎం.ఎస్ లతో లాగిన్ వివరాలు దొంగిలించి, అకౌంట్‌ను హైజాక్ చేస్తారు. ముంబై కేసులా డెలివరీ బాయ్‌లతో కుమ్మక్కై వచ్చిన కొరియర్ లలో వస్తువలను మార్చి చవకైన వస్తువులు తిరిగి పంపిస్తున్నారు. 2024లో 45 శాతం భారతీయులు డీప్‌ఫేక్ మోసాలకు గురయ్యారు.

దేశవ్యాప్తంగా ఈ-కామర్స్ మోసాలు

భారతదేశంలో సైబర్ ఫ్రాడ్‌లు 2022లో 10.29 లక్షల నుండి 2024లో 22.68 లక్షలకు పెరిగాయి. 2024-25 మధ్య కాలంలో 24 లక్షల డిజిటల్ ఫైనాన్షియల్ ఫ్రాడ్‌లు జరిగి రూ.4,245 కోట్ల నష్టం సంభవించింది . ఈ మోసాల పెరుగుదల 67 శాతానికి పెరిగింది. ఈ-కామర్స్‌లో 2.6 శాతం ఆర్డర్లు ఫ్రాడ్‌గా తేలాయి. ఢిల్లీలో ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌లు ఎక్కువ జరుగుతున్నాయి. 2024లో వందల కేసులు నమోదయ్యాయి. ఇటీవల 8 మందిని ఈ కేసుల్లోనే కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 19 ల్యాప్‌టాప్‌లు, 40 మొబైల్స్ సీజ్ చేశారు. గుజరాత్, తమిళనాడులో షిప్పింగ్ ఫ్రాడ్‌లు పెరిగాయి. మొత్తం ఏడు రాష్ట్రాల్లో 453 కేసుల్లో 25 మందిని పోలీసులు అరెస్టు చేశారు. రూ.72.85 లక్షలు రీఫండ్ చేశారు. దర్యాప్తుల్లో 80 శాతం కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం ఏఐ టూల్స్ ఉపయోగంతో ఫ్రాడ్ డిటెక్షన్ మెరుగుపడుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో

తెలుగు రాష్ట్రాలు సైబర్ నేరాల హాట్‌స్పాట్‌గా మారాయి. 2025లో మాత్రమే 66 కేసులు తెలంగాణలో నమోదయ్యాయి. హైదరాబాద్, అనంతపురం, విశాఖపట్నంలో ఆన్‌లైన్ ట్రేడింగ్, ఫేక్ అప్‌ల ద్వారా మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి. సైబరాబాద్‌లో గత ఆగస్టులో రూ.850 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ జరిగింది. ఇందులో ఇద్దరిని అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో రూ.43 లక్షల షేర్ ట్రేడింగ్ మోసం ఇటీవల బయటపడింది.

ఆంధ్రప్రదేశ్‌లో ..

అనంతపురంలో రూ.1.74 కోట్ల ఫేక్ అప్ మోసం జరిగింది. ఈ కేసులో 5గురిని అరెస్టు చేశారు. గత మార్చ్‌లో గుంటూరులో జరిగిన మరో కేసులో ముగ్గురిని హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. విశాఖలో రూ.43 లక్షల ఐపీఓ అలాట్‌మెంట్ ఫ్రాడ్ అరెస్టు జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో 20కి పైగా అరెస్టులు జరిగాయి. 44 మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బాధితులు సూపర్ మార్కెట్ స్కీంలో మోసపోయారు. దర్యాప్తులో 70శాతం కేసుల్లో డబ్బు రికవరీ జరగలేదు. ఇంటర్‌స్టేట్ గ్యాంగ్‌ల కారణంగా పోలీసులకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.

ఈ-కామర్స్ మోసాలు 2025లో గ్లోబల్‌గా 48 బిలియన్ల నష్టానికి దారితీశాయి. భారతదేశంలో డిజిటల్ యూజర్లు పెరగడంతో 86 శాతం హౌస్‌హోల్డ్‌లు ఇంటర్నెట్ కనెక్టెడ్ మోసాలు మూడు రెట్లు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ఐటీ హబ్‌ల కారణంగా టార్గెట్ చేస్తున్నారు.

అప్రమత్తంగా ఉండాలి

ప్రజలు ఆన్ లైన్ మోసాల భారిన పడకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. నకిలీ వెబ్ సైట్లను ఆశ్రయించి మోసాలకు పాల్పడకూడదన్నారు. పేరొందిన అఫిషియల్ యాప్ లలోనే కొనుగోలు చేయాలని, ఎవరికి కూడా డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు, బ్యాంకు వివరాలు తెలపకూడదని పోలీసులు సూచిస్తున్నారు.

అంతరాష్ట్ర నేరాల ముఠా అరెస్ట్ - Tholi Paluku