
అండర్–19 వరల్డ్‌కప్‌లో భారత్–బంగ్లాదేశ్ మధ్య ‘నో షేక్ హ్యాండ్’
ఐసీసీ అండర్–19 వరల్డ్‌కప్ 2026లో భాగంగా శనివారం జరిగిన భారత్–బంగ్లాదేశ్ గ్రూప్ మ్యాచ్ టాస్ సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య సాధారణంగా జరిగే హ్యాండ్‌షేక్ కనిపించలేదు. టాస్ కోసం భారత జట్టు కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే హాజరుకాగా, బంగ్లాదేశ్ జట్టు తరఫున వైస్ కెప్టెన్ జవాద్ అబ్రార్ వచ్చారు. అయితే ఇరు జట్ల కెప్టెన్ల మధ్య సంప్రదాయంగా హ్యాండ్‌షేక్ జరగకపోవడం చర్చగా మారింది. ఈ మ్యాచ్ భారత్‌కు టోర్నీలో రెండోది కాగా, బంగ్లాదేశ్‌కు ఇది తొలి మ్యాచ్. ఇటీవలి కాలంలో భారత్–బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో భద్రతా కారణాలు చూపుతూ, భారత్‌లో జరగనున్న తమ మ్యాచ్‌లను ఇతర దేశాలకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని కోరింది. ఇదే సమయంలో ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు నుంచి బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజూర్ రెహ్మాన్‌ను విడుదల చేయాలని బీసీసీఐ కోరగా, ఆ నిర్ణయం అమలైంది. అయితే ఐసీసీ వర్గాలు వెల్లడించిన ప్రకారం, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన భద్రతా నిపుణులు నిర్వహించిన స్వతంత్ర ప్రమాద అంచనాల్లో, భారత్‌లో బంగ్లాదేశ్ మ్యాచ్‌లు జరగకుండా చేసేలా ఎటువంటి ఇబ్బందులు గుర్తించలేదని తెలిపారు. టోర్నీకి సంబంధించిన భద్రతా ప్రమాద స్థాయి తక్కువ నుంచి సాధారణ స్థాయిలోనే ఉందని, ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లకు అనుగుణంగానే ఉందని స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్ జట్టు, అధికారులు లేదా మ్యాచ్ వేదికలపై ఎలాంటి ప్రత్యక్ష లేదా ప్రత్యేక ప్రమాదాలు లేవని కూడా ఆ సర్వేలో తేలినట్టు ఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. కోల్‌కతా, ముంబైలో జరిగే మ్యాచ్‌ల భద్రతా పరిస్థితిని సమర్థవంతంగా నియంత్రించవచ్చని వారు తెలిపారు. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌కప్ 2026 భద్రతా ప్రణాళిక నిరంతరం సమీక్షలోనే ఉంటుందని, ఇందులో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సహా అన్ని సభ్య దేశాలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఐసీసీ స్పష్టం చేసింది. టోర్నీ షెడ్యూల్ ఇప్పటికే ఖరారైందని, అందులో మార్పులేమీ లేవని తెలిపింది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే టీ20 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ జట్టు అదే రోజు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత ఇటలీ, ఇంగ్లండ్, నేపాల్‌తో గ్రూప్ దశ మ్యాచ్‌లు ఆడనుంది.
