
అండర్-19 ప్రపంచకప్: పాకిస్థాన్ ఓటమి.. సెమీస్‌కు భారత్
ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఆదివారం జరిగిన సూపర్ సిక్స్ పోరులో దాయాది పాకిస్థాన్‌ను 58 పరుగుల తేడాతో ఓడించి ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. సెమీస్‌లో భారత్ ఫిబ్రవరి 4న అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది.
జట్టును ఆదుకున్న కనిష్క్, వేదాంత్
టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (30) మెరుపులు మెరిపించినా, కెప్టెన్ ఆయుష్ మాత్రే (0) డకౌట్ కావడంతో భారత్ 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో వేదాంత్ త్రివేది (68) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. చివర్లో కనిష్క్ చౌహాన్ (35), ఖిలన్ పటేల్ (21) మెరుపు వేగంతో ఆడటంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
పాక్ బ్యాటర్ల వింత ధోరణి
పాకిస్థాన్ సెమీస్‌కు వెళ్లాలంటే ఈ లక్ష్యాన్ని 33.3 ఓవర్లలోనే ఛేదించాల్సి ఉంది. కానీ, పాక్ బ్యాటర్లు కనీసం గెలవడానికి కూడా ప్రయత్నించనట్లుగా చాలా నెమ్మదిగా ఆడారు. 33.3 ఓవర్లు ముగిసేసరికి వారు కేవలం 167/4 పరుగులు మాత్రమే చేయగలిగారు, దీంతో అక్కడే వారు సెమీస్ రేసు నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత భారత బౌలర్ల ధాటికి పాక్ వరుసగా వికెట్లు కోల్పోయి, 46.2 ఓవర్లలో 194 పరుగులకే కుప్పకూలింది.
బౌలింగ్‌లోనూ కనిష్క్ మెరుపులు
బ్యాటింగ్‌లో రాణించిన కనిష్క్ చౌహాన్, బౌలింగ్‌లోనూ అదరగొట్టాడు. 10 ఓవర్లు వేసిన అతను కేవలం 30 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇందులో ఏకంగా 40 డాట్ బాల్స్ ఉండటం గమనార్హం. స్పిన్నర్లు ఖిలన్ పటేల్, ఆయుష్ మాత్రే చెరో మూడు వికెట్లతో పాక్ నడ్డి విరిచారు. అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శన చేసిన కనిష్క్ చౌహాన్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
